Telangana Elections: ఈ ముగ్గురు బీజేపీ బీసీ సీఎం అభ్యర్థులు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆసక్తి కరమైన చర్చ..
BC BJP candidates: ఇప్పడు ఆ ముగ్గురు నేతల గురించే చర్చ మొదలైంది. అధికారంలోకి వస్తే బిసి ని సీఎం గా చేస్తామని బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో బిసి నేతల్లో ఉత్సాహం కనపడుతుంది. అయితే ఆ ముగురు నేతలు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారు కావడం విశేషం. ఇప్పటికే సోషల్ మీడియాలో బిసి సీఎం అభ్యర్థులు వీరే అంటూ వైరల్ చేస్తున్నారు. ఎవరా ముగ్గురు నేతలు?

కరీంనగర్, అక్టోబర్ 30: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్‌కు మంచి పట్టు ఉంది. అయితే ఇక్కడ ప్రతిపక్షాలు పాగా వేసేందుకు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇక్కడ బీజేపీ కి మంచి పట్టు ఉండడంతో బీసీ సీఎం చుట్టే రాజకీయం తిరుగుతుంది. రాష్ట్రానికి చెందిన ముగ్గురు కీలక నేతలు ఈ జిల్లా నుంచే బరిలోకి దిగుతున్నారు. ఇటీవల సూర్యాపేట సభలో బీజేపీ అగ్రనేత అమిత్ షా బీసీని సీఎం చేస్తామని ప్రకటించారు. దీంతో బీసీ అభ్యర్థుల్లో ఆశలు మొదలయ్యాయి. హుజురాబాద్ నుంచి ఈటెల రాజేందర్, కరీంనగర్ నుండి బండి సంజయ్ కుమార్, ధర్మపురి అర్వింద్ కోరుట్ల నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఈ ముగ్గురిలో ఒకరు సీఎం అనే చర్చ మొదలైంది.
ఎప్పుడైతే బీసీని సీఎం అభ్యర్థి అంటూ ప్రకటించారో.. ఈ ముగ్గురు నేతలు దూకుడు పెంచారు. ఖచ్చితంగా గెలిచేందుకు బీసీ సీఎం వాదం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ ముగ్గురు నేతలు వేదిక పై ఎక్కితే చాలు సీఎం సీఎం అంటూ నినాదాలు హోరెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఓ విభాగం ఇదే ప్రచారాన్ని నిర్వహిస్తుంది. కార్యకర్తలు సీఎం అంటూ చేసే నినాదాలను వైరల్ చేస్తున్నారు. మొదట బీసీ కులాల సమీకరణ పై దృష్టి పెడుతున్నారు. ముందుగా తమ సామాజిక వర్గంలో 80 శాతం పైగా ఓట్లు తమ వైపు పడేందుకు ప్లాన్ చేస్తున్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ముందుగా ఆసక్తి చూపించలేదు. అయితే, సెంట్రల్ ఎన్నికల కమిటీల్లో బీసీ సీఎం అభ్యర్థి పైన చర్చ జరిగింది. ఇదే విషయాన్ని సంజయ్ దృష్టి కి రావడంతో పోటీ కి సై అన్నారు.
మొదటి నుంచి ఈటెల రాజేందర్ గజ్వేల్ తో పాటు హుజురాబాద్‌లో పోటీ చెస్తానని ప్రకటించారు. అందుకే తగినట్లుగానే రెండు స్థానాలు పోటీ చేయడానికి అధిష్టానం టికెట్ కేటాయించింది. రాజేందర్ ఎక్కడ సమావేశం నిర్వహించిన సీఎం.. సీఎం.. అంటూ కార్యకర్తల నినాదాలతో మారు మ్రోగుతోంది. తన సామాజిక వర్గ ఓట్లు అన్ని కూడ బీజేపీ వైపు మళ్లించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఈ రెండు చోట్ల బీసీ ఓట్లే గెలుపు ఓటములను ప్రభావం చూపనున్నాయి.
ఇక కోరుట్ల నుంచి పోటీ చేస్తున్న ఎంపీ అర్వింద్ కూడ బీసీ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. కోరుట్లలో ఎక్కువ బీసీ ఓట్లు ఉండడంతో తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా ఈ ముగ్గురు గురించి సోషల్ మీడియాలో… రాజకీయా వర్గాల్లో చర్చ మొదలైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
