AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tummala VS Puvvada: మంత్రికి, మాజీ మంత్రికి ఫైట్.. ముప్పూటలా కొత్తకొత్త ఆరోపణలు, సవాళ్ళు-ప్రతి సవాళ్ళు

Telangana Election: ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అధికార పార్టీ బీఆర్ఎస్. అంతే ప్రెస్టేజియస్‌గా కాంగ్రెస్‌ కూడా సవాళ్లు స్వీకరిస్తోంది. అసలు ఖమ్మం నుంచి ఒక్క ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేటును తాకనివ్వబోమంటూ ఛాలెంజ్‌ విసిరింది కాంగ్రెస్.

Tummala VS Puvvada: మంత్రికి, మాజీ మంత్రికి ఫైట్.. ముప్పూటలా కొత్తకొత్త ఆరోపణలు, సవాళ్ళు-ప్రతి సవాళ్ళు
Tummala Vs Puvvada
Balaraju Goud
|

Updated on: Nov 04, 2023 | 9:41 PM

Share

అబ్బబ్బ.. ఏమన్న మాటలా అవి. హుజూరాబాద్, మునుగోడు ఫైట్స్‌ను తలపించేంత పోరు జరుగుతోందక్కడ. ఖమ్మంలో ఆ రేంజ్‌ రాజకీయం జరుగుతుందని ఎవరూ ఊహించరు. కానీ, ఓసారి తల తిప్పి చూడాల్సినంత ఫైట్‌ అయితే జరుగుతోంది అక్కడ. అసెంబ్లీ గేట్ తాకనివ్వబోమని కాంగ్రెస్‌ సవాల్‌ విసరడం, ఎలా ఆపుతారో చూస్తామంటూ బీఆర్ఎస్ ప్రతి సవాల్‌ చేయడం.. ఇలా రోజుకు మూడు పూటలా మాటల తూటాలు పేలుతున్నాయి. ఇద్దరు నేతలు ఇంతకీ ఎందుకంత ప్రెస్టేజ్‌కు పోతున్నారు..!

తెలంగాణ రాష్రంలో 119 నియోజకవర్గాలున్నా.. ఇంటెన్సివ్ పొలిటికల్‌ వార్ జరుగుతున్నది మాత్రం ఖమ్మంలోనే. మాటకు మాట, కౌంటర్ ఎన్‌కౌంటర్, అటాక్ రివర్స్ అటాక్.. ఇవన్నీ ఒక్క ఖమ్మం జిల్లాలోనే జరుగుతున్నాయి. పైగా ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అధికార పార్టీ బీఆర్ఎస్. అంతే ప్రెస్టేజియస్‌గా కాంగ్రెస్‌ కూడా సవాళ్లు స్వీకరిస్తోంది. అసలు ఖమ్మం నుంచి ఒక్క ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేటును తాకనివ్వబోమంటూ ఛాలెంజ్‌ విసిరింది కాంగ్రెస్.

ఇలాంటి సవాళ్లు తెలంగాణలోని మరే జిల్లాలో జరగలేదు. అందులోనూ.. ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్ భారం మొత్తం మోస్తున్నారు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. అందుకే, పువ్వాడ అజయ్‌ నుంచే కాంగ్రెస్‌కు ఎక్కువ కౌంటర్స్ వెళ్తున్నాయి. అటు ఖమ్మం జిల్లాను క్వీన్‌స్వీప్‌ చేస్తామన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కూడా ఎక్కడా తగ్గడం లేదు. ఈ జిల్లాలో ద్విముఖ పోరే ఉండడంతో నిత్యం బీఆర్ఎస్, కాంగ్రెస్‌ మధ్య నువ్వా-నేనా అనే రేంజ్‌లో సవాళ్లు ప్రతి సవాళ్లు వినిపిస్తున్నాయి. కాకపోతే, ఇదే కొంత శృతిమించినట్టు కనిపిస్తోంది. రాజకీయంగా ఆరోపణలు చేసుకోవాల్సిన వాళ్లు.. కాస్త వ్యక్తిగతంగానూ వెళ్తున్నట్టు కనిపిస్తోంది.

తుమ్మల ఓల్డ్‌ వెస్పా స్కూటర్‌ అయితే.. తాను స్పోర్ట్స్‌ బైక్‌ లాంటి వాడిని. తాను పక్కా లోకల్‌, తుమ్మల నాన్‌ లోకల్‌. పువ్వాడ చేసిన ఈ కామెంట్స్‌ కొంతలో కొంత ఫర్వాలేదు. ప్రజలు వినడానికీ బాగానే ఉన్నాయివి. కాని, అంతకు మించి మాట్లాడుకోవడమే ప్రజలను కాస్త ఇబ్బంది పెడుతోంది. తన వెంట నిఖార్సయిన యువకులు ఉంటే.. తుమ్మల వెంట రౌడీషీటర్లు, గంజాయి స్మగ్లర్లు ఉన్నారంటూ మాట్లాడారు పువ్వాడ. ఖమ్మంలో కొంతమంది సైకోలుగా మారి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడడం సంచలనం సృష్టించింది. రాబోయే రోజుల్లో ఖమ్మం సిటీలో సైకోల కోసం పిచ్చాసుపత్రి కట్టించి వారికి వైద్యం అందిస్తామన్నారు. అంతకుముందు అట్నుంచి వచ్చిన యాక్షన్‌ను బట్టే పువ్వాడ అజయ్ కుమార్ కూడా ఇలా రియాక్షన్‌ ఇచ్చారని చెప్పుకుంటున్నారు.

అటు ఖమ్మం నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్న తుమ్మల నాగేశ్వరరావు కూడా డోస్ పెంచారు. పువ్వాడ అజయ్ టార్గెట్‌గా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. పువ్వాడ ఆధ్వర్యంలో ఖమ్మంలో అరాచక రాజ్యం నడుస్తోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇసుక నుంచి మట్టి వరకు అన్నీ దోచేస్తున్నారంటూ డైరెక్టుగా టార్గెట్ చేస్తున్నారు తుమ్మల. ఖమ్మంలో కొత్తగా ట్రాన్స్‌పోర్ట్ మాఫియా కూడా వచ్చిందంటూ అలిగేషన్స్ చేశారు. సామాన్యుడు ఒక ప్లాట్ కొనుక్కుంటే ఎప్పుడు ఎవరు వచ్చి కబ్జా చేస్తారో తెలియక భయంతో బతుకుతున్నారంటూ కొత్త పాయింట్‌ తీసుకొచ్చారు తుమ్మల. మంత్రి పువ్వాడ అజయ్ కాంట్రాక్టర్లను బెదిరించి, ఆ పనులను వేరే వారికి అమ్ముకున్నారని ఆరోపించారు. ప్రతీ దాంట్లో కమీషన్లు దండుకున్నారని విమర్శించారు. ప్రజల భూములు కబ్జా చేసి కాలేజ్ చుట్టూ ఫెన్సింగ్ వేసి ఎవర్నీ రానివ్వడం లేదన్నారు. ఖమ్మం గుట్టలను మాయం చేసి మట్టి దోచుకున్నారని మండిపడ్డారు తుమ్మల. ఖమ్మంలో అంతా దోచుకునే ముఠాను తయారు చేశారన్నారు. తాను గెలిస్తే ఈ అరాచకాలు ఉండవు.. దోపిడీ ఉండబోదంటూ హామీ ఇస్తున్నారు.

తుమ్మల నాగేశ్వరరావు చేసిన ఆరోపణలకు పువ్వాడ కూడా స్ట్రాంగ్‌ కౌంటర్సే ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతమంది గోడలు కూల్చి కబ్జాలు చేశారో తాము ఆధారాలతో సహా చెప్పగలమన్నారు. తన ప్రత్యర్థి అయిన ఓ పెద్దాయన విజ్ఞత కోల్పోయి మరీ మాట్లాడుతున్నారంటూ ఖమ్మంలో ఇసుక మాఫియా ఆరోపణలపై కౌంటర్ ఇచ్చారు. అసలు ఖమ్మంలో ఇసుక ఎక్కడుందో ఆ పెద్ద మనిషే చెప్పాలన్నారు. తుమ్మల నాగేశ్వరరావు కంటే రంగులు మార్చే ఊసరవెల్లి నయం అంటూ తీవ్రంగానే మాట్లాడారు పువ్వాడ. అసలు తుమ్మలకు ఎక్కడా ఆప్షన్‌ లేకపోయే సరికి ఖమ్మం వచ్చారే తప్పా, ఖమ్మం ప్రజలపై ప్రేమ ఉండి కాదన్నారు.

2014లో తన చేతిలో ఓడిపోయిన తరువాత ఈ పదేళ్ల పాటు తుమ్మల ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలీదని కౌంటర్స్ ఇచ్చారు. కరోనా టైంలో, వరదల సమయంలో ఖమ్మం ప్రజల గురించి ఆయన పట్టించుకున్నదే లేదన్నారు. తుమ్మలను పాలేరులో గెలిపిస్తే అక్కడకు వెళ్తారని, లేదంటే ఖమ్మం వస్తారన్నారు. ఆయనకు ఖమ్మం రెండో ప్రాధాన్యతని అన్నారు. కాని, పువ్వాడ కుటుంబం మాత్రం నిత్యం ఖమ్మం ప్రజలతోనే ఉంటూ ఖమ్మం జిల్లాను వదిలి పెట్టలేదన్నారు. తుమ్మల ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మం జిల్లా ప్రజలకు ఏం చేశారో చెప్పాగలరా అని నిలదీశారు. అధికారాన్ని అనుభవించి ప్రజలను బూతు పురాణంతో భయపెట్టడం తప్ప తుమ్మల చేసిందేమీ లేదన్నారు. తన చేతిలో ఓడిపోయి మూలకు కూర్చుంటే.. కేసీఆర్ పిలిచి మంత్రి పదవి ఇచ్చారని, అయినా సరే జిల్లాకు ఆయన చేసింది శూన్యం అని డైరెక్ట్‌ అటాక్‌కు దిగారు. అసలు 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వ్యక్తి.. ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారని, ఇదేనా ఆయన చెప్పే నీతి నిజాయితీ అని ప్రశ్నించారు. తుమ్మల నాగేశ్వరరావు కంటే రంగులు మార్చే ఊసరవెల్లి నయం అంటూ తీవ్రంగానే మాట్లాడారు పువ్వాడ.

మొత్తానికి ఖమ్మం పోరు ఎలా ఉందంటే.. అప్పుడెప్పుడో హుజూరాబాద్‌లో ఇలాంటి ఫైట్ చూశాం. ఆ తరువాత మునుగోడులో టఫ్‌ ఫైట్ చూశాం. వాటికి ఏమాత్రం తీసిపోని టెంపోతో నడుస్తోంది ఖమ్మం రాజకీయం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..