Telangana: మీరు అపాయంలో ఉన్నా.. ఎవరు ఆపదలో ఉన్నా ఈ ఒక్క నంబర్‌కు ఫోన్ చేస్తే చాలు
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న Dial-112 అత్యవసర సహాయ సేవలు ప్రజలకు బాగా ఉపయోగపడుతున్నాయి. పోలీస్, అగ్నిమాపక, వైద్య, మహిళల రక్షణ, బాలల భద్రత వంటి విభాగాలను ఒకే నంబర్ 112 ద్వారా కలిపి సత్వర సహాయాన్ని అందిస్తున్నారు. డిసెంబర్ 2024లో ప్రారంభమైన ఈ సేవలు ఇప్పటివరకు 45 కేసులను సమర్థవంతంగా పరిష్కరించాయి. ప్రతి అత్యవసర పరిస్థితిలో ప్రజలు నిరభ్యంతరంగా ఈ సేవలను వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

భారత ప్రభుత్వం ప్రారంభించిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ గురించి మీకు తెలుసా..? అంటే ఏం లేదండి..దేశవ్యాప్తంగా అత్యవసర సేవల కోసం ఒకే నంబర్ – 112 అందుబాటులోకి తీసుకొచ్చారు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ నంబర్‌కు కాల్ చేస్తే అధికారులు సెకన్ల వ్యవధిలో యాక్షన్‌లోకి దిగిపోతారు. వాయిస్ కాల్స్, SMS, ఇమెయిల్స్, పానిక్ SOS బటన్ లేదా ERSS వెబ్ పోర్టల్ ద్వారా 112 సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో సత్వర సహాయాన్ని అందించేందుకు కంప్యూటర్ ఆధారిత డిస్పాచ్ టెక్నాలజీని ఉపయోగించి ఈ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మహిళల రక్షణ కోసం ఇది మరింత ఉపయోగకరంగా ఉంది.
తెలంగాణ ప్రభుత్వం సైతం 112 వ్యవస్థ ఏర్పాటు ద్వారా మంచి ఫలితాలు అందుకుంటోంది. పోలీస్ (100), ఫైర్ డిపార్ట్‌మెంట్ (101), మెడికల్ (108), మహిళల కోసం (181), బాలల రక్షణ (1098), విపత్తుల నిర్వహణ (1077) వంటి విభిన్న సేవల కోసం ఉపయోగించే నంబర్లను ఒకే చోట సమన్వయం చేశారు. అంటే మీరు 112కు కాల్ చేయడం ద్వారా వీటిలో ఏ సేవలను అయినా అందుకోవచ్చు. తెలంగాణ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ (TGERSS-Dial-112) హైదరాబాదులో బంజారాహిల్స్‌లోని TGiCCC భవనంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ అత్యవసర కంట్రోల్ రూములతో పాటు పోలీస్ పెట్రోల్ వాహనాలు సైతం నిత్యం అందుబాటులో ఉంటాయి. ఏదైనా కాల్ రాగానే అన్ని వ్యవస్థలతో సమన్యయం చేసుకుంటూ మెరుపు వేగంతో సేవలు అందిస్తున్నారు.
2024 డిసెంబర్ 5న ఈ సేవలు తెలంగాణలో ప్రారంభమయ్యాయి. ఆ రోజు నుంచి.. ఎన్నో కేసుల్లో ప్రజలకు సేవలు అందించారు. 112కు వచ్చిన కాల్స్ ద్వారా 31 ఆత్మహత్యా ప్రయత్నాలను నిలువరించారు. అలానే ఐదుగురు పిల్లల మిస్సింగ్ ఫిర్యాదులను చేధించారు. బాల్య వివాహాలు, హత్యాయత్నం, బలవంతపు వివాహం..పిల్లల కిడ్నాప్, అత్యాచార యత్నం, రోడ్డు ప్రమాదాలతో కలిపి ఏకంగా 45 కేసుల్లో సేవలు అందించారు.
ప్రతి కేసులో, Dial-112 మొదటి కాల్ పాయింట్‌గా పనిచేసింది. కాల్ అందుకున్న వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించి, నిరంతర సమన్వయంతో సమస్యను పరిష్కరించడంలో అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రజలు ఏ విధమైన అత్యవసర పరిస్థితులైనా Dial-112 సేవను సందేహం లేకుండా ఉపయోగించాలని TGiCCC డైరెక్టర్ సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




