Telangana Congress: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ఆ పార్టీ నేతలు భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా నేరుగా ప్రియాంక గాంధీని రంగంలోకి దించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు పార్టీ అధిష్టానానికి కొన్ని ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. కొన్ని మాసాల్లోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. కేసీఆర్ స్థాయి నాయకుడిని రాజకీయంగా ధీటుగా ఎదుర్కోవాలంటే ప్రియాంక గాంధీ తెలంగాణపై నేరుగా ఫోకస్ చేయాల్సిన అవసరముందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ప్రియాంక గాంధీతో వారం లేదా 10 రోజులు తెలంగాణలో పాదయాత్ర నిర్వహిస్తే.. రాష్ట్రంలో పార్టీకి కొత్త ఊపు వస్తుందని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా సేవలందిస్తున్న సునీల్ కనుగోలు సైతం పార్టీ అధిష్టానానికి ఇదే తరహా సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు పార్టీ అధిష్టానం అంగీకరిస్తే.. త్వరలోనే ప్రియాంక గాంధీ రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టవచ్చని ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి.. ప్రత్యేక రాష్ట్రంలో ఇప్పటి వరకు అధికారం దక్కలేదు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీయే (పాతపేరు టీఆర్ఎస్) విజయం సాధించి.. అధికార పగ్గాలు చేపట్టింది. అయితే మొన్నటి కర్ణాటక విజయం తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం పక్కా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్, బీజేపీలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే.. గాంధీ-నెహ్రూ కుటుంబ చరిష్మా అవసరమని వారు భావిస్తున్నారు. ప్రియాంక గాంధీ నేరుగా రంగంలోకి దిగితే.. ఇక తెలంగాణలో పార్టీకి తిరుగుండదని అంచనావేస్తున్నారు. కేవలం జనాకర్షక హామీలతో ప్రజలను పార్టీ వైపు తిప్పుకోవడం సాధ్యంకాదని.. జనాకర్షణ కలిగిన నాయకుడు అవసరమని చెబుతున్నారు. ఈ లోటు వద్దంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రచారానికి ప్రియాంక గాంధీ సారథ్యంవహించాలని అభిప్రాయపడుతున్నారు.
అలాగే ఎన్నికల వరకు ప్రియాంక గాంధీ తరచూ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించడం, బహిరంగ సభల ద్వారా పార్టీకి పూర్వ వైభవం తీసుకురావచ్చని కాంగ్రెస్ నేతలు యోచిస్తున్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో, ఇతర హామీలు అమలయ్యేలా చూస్తానని ప్రియాంక హామీ ఇస్తే ప్రజల విశ్వాసాన్ని పొందవచ్చని భావిస్తున్నారు. ఎన్నికల్లో గెలవాలంటే పార్టీ సిద్ధాంతాలు, హామీల కంటే బలమైన నాయకుడు అవసరమని, చరిష్మా కలిగిన ప్రియాంక గాంధీ కీలక బాధ్యతలు స్వీకరిస్తే తెలంగాణలో ఇక పార్టీకి ఢోకా ఉండదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరి తెలంగాణ కాంగ్రెస్ నేతల పిలుపుపై ప్రియాంక గాంధీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..