Rahul Gandhi: వరంగల్‌లో రాహుల్ గాంధీ సభ.. కాంగ్రెస్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?
తెలంగాణలో దళిత గిరిజన దండోరా సభలకు రాహుల్ గాంధీని రంగంలోకి దింపుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇంద్రవెళ్లిలో సమరశంఖం పూరించిన కాంగ్రెస్.. రాహుల్ సభతో ముగించబోతోంది. వరంగల్ సెంటిమెంట్‌తో సెప్టెంబర్ 17న భారీ సభకు ప్లాన్ చేస్తోంది తెలంగాణ పీసీసీ.
తెలంగాణలో దళిత గిరిజన దండోరా సభలకు రాహుల్ గాంధీని రంగంలోకి దింపుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇంద్రవెళ్లిలో సమరశంఖం పూరించిన కాంగ్రెస్.. రాహుల్ సభతో ముగించబోతోంది. వరంగల్ సెంటిమెంట్‌తో సెప్టెంబర్ 17న భారీ సభకు ప్లాన్ చేస్తోంది తెలంగాణ పీసీసీ. ఇంతకీ వరంగల్ సెంటిమెంట్ ఏంటి? రాహుల్ సభకు వరంగల్‌ను ఎంచుకోవడానికి కారణం ఏంటి?.. తెలంగాణ కాంగ్రెస్ సారధ్య పగ్గాలను రేవంత్ రెడ్డి చేపట్టిన తర్వాత గులాబీ సర్కార్‌పై పోరును ఉదృతం చేసింది కాంగ్రెస్. కొత్త పీసీసీ చీఫ్‌గా నియామితులయ్యాక కార్యకర్తల్లో వచ్చిన ఊపును కొనసాగించడానికి వరుస కార్యక్రమాలు చేపట్టారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ తెచ్చిన దళిత బంధు అమలుపై ప్రభుత్వ చిత్తశుద్ధిని శంఖిస్తోంది కాంగ్రెస్. దాంతో దళిత బందుకు కౌంటర్‌గా దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరుతో జనాల్లోకి వెళుతున్నారు కాంగ్రెస్ నేతలు.
ఇంద్రవెళ్లిలో కాంగ్రెస్ ప్రారంభ సభ ఊహించిన దానికంటే గ్రాండ్ సక్సెస్ కావడంతో అదే ఊపుతో మరిన్ని సభలు నిర్వహించి రాష్ట్రాన్ని చుట్టేలాయని నిర్ణయించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అనంతరం రావిరాలలో నిర్వహించిన రెండో సభ సైతం విజయవంతం అయ్యింది. కార్యాచరణకు మరింత పదును పెంచారు రేవంత్ రెడ్డి. మొత్తం అన్ని లోక్ సభ నియోజకవర్గాల్లో దళిత గిరిజన ఆత్మగౌరవ సభలు, అసెంబ్లీ స్థాయిలో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ దళిత గిరిజనులను దగా చేస్తున్నారని ఆరోపిస్తూ జనాల్లోకి వెళుతున్నారు.
ఈ నేపథ్యంలో పార్లమెంట్ స్థానాల్లో నిర్వహిస్తున్న దళిత గిరిజన దండోరా ముగింపు సభను వరంగల్‌లో నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 9 క్విట్ ఇండియా దినోత్సవం రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్.. ముగింపు సభను సెప్టెంబర్ 17న నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. ఈ సభకు రాహుల్ గాంధీని రప్పిస్తున్నారు. అయితే ఈ సభ వరంగల్ లో నిర్వహించడానికి ప్రత్యేక కారణాలున్నాయి.
2004 ఎన్నికల ముందు వరంగల్ లో బీసీ గర్జన పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించింది కాంగ్రెస్. ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రావడానికి బీసీ గర్జన సభ ఎంతో దోహదపడిందన్నది కాంగ్రెస్ నమ్మకం. అదే సెంటిమెంట్‌ను ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నారు హస్తం నేతలు. అప్పుడు బీసీ గర్జన్ నిర్వహిస్తే ఇప్పుడు దళిత గిరిజనులతో ఆత్మగౌరవ దండోరా నిర్వహిస్తోంది కాంగ్రెస్. అప్పటి బీసీ గర్జన సభకు సోనియా గాంధీ హాజరుకాగా.. ఇప్పుడు దళిత గిరిజన దండోరాకు రాహుల్ గాంధీని ఆహ్వానించడం ద్వారా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనేది కాంగ్రెస్ నేతల నమ్మకంగా ఉంది.
కాంగ్రెస్ చేపట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు పార్టీ బలోపేతానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయ పడుతున్నారు. మొత్తం మీద రేవంత్ పీసీసీ పగ్గాలు చేపట్టాక వరుస కార్యక్రమాలతో క్యాడర్ టూ లీడర్ అందరిని పరుగెత్తిస్తున్నారు.
(Ashok Bhimanapally, TV9 Telugu, Hyderabad)
Also Read..