Telangana Congress: రెస్పెక్టెడ్‌ సోనియా మేడమ్‌.. మాకు అన్యాయం జరుగుతోంది.. కీలక నేత సంచలన లేఖ..

నాగర్‌కర్నూల్‌కి నేనే కరెక్టైన అభ్యర్థిని అంటున్నారు కాంగ్రెస్‌ నేత సంపత్‌ కుమార్‌. మల్లురవికి ఇస్తే ఓడిపోవడం ఖాయం అంటున్నారు. అసలు తన పేరు పరిశీలించకుండా... ఏకపక్షంగా ఆయన పేరును సీఈసీకి ప్రతిపాదించడం వెనుక కుట్ర ఉందంటున్నారు సంపత్‌ కుమార్‌. సోనియాకు ఓ లేఖ రాసి.. తన ఆవేదనను వ్యక్తం చేశారు.

Telangana Congress: రెస్పెక్టెడ్‌ సోనియా మేడమ్‌.. మాకు అన్యాయం జరుగుతోంది.. కీలక నేత సంచలన లేఖ..
Telangana Congress

Updated on: Mar 21, 2024 | 7:15 AM

రెస్పెక్టెడ్‌ సోనియా మేడమ్‌ జీ.. మాకు అన్యాయం జరుగుతోంది. పార్టీకి వీరవిధేయుడిగా ఉండడమే శాపమా? బలమైన బ్యాగ్రౌండ్‌ లేకపోవడమే నా తప్పా? అన్ని అర్హతలు కలిగిఉన్న నాకు కాకుండా.. వరుసగా ఓడుతూ వస్తున్న వ్యక్తికి టికెట్‌ ఇవ్వడం ఏంటి? అంటూ తన ఆవేదననంతా వెళ్లగక్కారు కాంగ్రెస్‌ పార్టీ పాలమూరు నేత సంపత్‌ కుమార్‌. నాగర్‌కర్నూల్‌ టికెట్‌కు అన్ని అర్హతలు కలిగి ఉన్న నాయకుడిని తానే అంటున్నారు సంపత్‌. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవి కొన్ని రోజులుగా పార్టీలో యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన రెబల్స్‌ను బుజ్జగించే పనిలో సక్సెస్‌ అయ్యారు. ముఖ్యంగా పటేల్‌ రమేష్‌ను రెబల్‌ కాకుండా అడ్డుకున్నారు. ఇలాంటి ట్రబుల్‌షూట్స్‌ చేయడంలో ఆయన సక్సెస్‌ అయ్యారు. దీంతో ఎంపీ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్‌ టికెట్‌ను ఆశించారు మల్లు రవి. అందుకోసం భారీగానే లాబీయింగ్‌ చేస్తున్నారు.

ఏఐసీసీ సెక్రటరీగా ఉన్న సంపత్‌.. ఏకంగా సోనియాగాంధీకి లేఖ రాశారు. భారమైన గుండెతో తాను ఈ లేఖను రాస్తున్నానని మొదలుపెట్టిన సంపత్‌.. తాను మాదిగ వర్గానికి చెందిన వాడిని కాబట్టి ఇక్కడ టికెట్‌ ఇస్తే గెలిచి తీరతానంటున్నారు. ఎందుకంటే నాగర్‌ కర్నూలులో 17లక్షల మంది ఓటర్లు ఉంటే.. అందులో మాదిగ సామాజికవర్గ ఓటర్లు 3లక్షల 75వేలు ఉంటే.. మాల సమాజికవర్గ ఓటర్లు 62వేల మంది ఉన్నారంటున్నారు. అందుకే తాను అన్నిరకాలుగా ఇక్కడ సరైన అభ్యర్థినంటూ లేఖలో రాసుకొచ్చారు సంపత్‌. ఇప్పటికే నాలుగు సార్లు ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన మల్లురవి వంటి అభ్యర్థికి మళ్లీ ఇస్తే.. ఓటమి ఖాయమంటున్నారు. ఖమ్మంలో ఉన్న మంత్రి తమ్ముడిని సంతృప్తిపర్చడానికి.. డిప్యూటీ సీఎంకు స్వయాన సోదరుడు కావడం వల్లే తన పేరును పరిశీలించకుండా… మల్లురవి పేరు ఒక్కటే స్క్రీనింగ్‌ కమిటీకి సిఫార్సు చేశారని, దీని వెనుక కుట్ర ఉందని మండిపడ్డారు సంపత్‌.

ఇప్పటికే మల్లురవిని ఢిల్లీలో రాష్ట్రప్రభుత్వ ప్రతినిధిగా నియమించి కేబినెట్‌ ర్యాంకును కల్పించారని.. తాను మహారాష్ట్ర అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్న సమయంలో కావాలనే ఆయన పేరును సీఈసీకి సిఫార్సు చేసి.. తన పేరు తెరపైనే లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంపత్‌ కుమార్‌. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తనను ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందని.. 17 కేసులు అక్రమంగా బనాయించిందని అయినాగాని.. కాంగ్రెస్‌కు పార్టీ గెలుపుకోసమే అహర్నిశలు కృషి చేశానన్నారు. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రలో ఎక్కువ దూరం నడిచిన తెలంగాణ నేతను తానేనన్నారు సంపత్‌. కాబట్టి.. తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

నాగర్​కర్నూల్​ లోక్​సభ స్థానం నుంచి మల్లు రవి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1991లో మొదటిసారి ఎంపీగా గెలిచిన మల్లు రవి, 1998లో రెండో సారి లోక్​ సభకు వెళ్ళారు. వైఎస్​ హయాంలో కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేశారు. కాని 1998 గెలుపు తర్వాత నాలుగు సార్లు ఓడిపోయారు మల్లు రవి. మరి సంపత్‌ లేఖ తర్వాత అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..