రాములోరి కళ్యాణం.. భద్రాద్రికి సీఎం రేవంత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక!
భద్రాచలం లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఘనంగా జరిగిన సీతారామ కళ్యాణోత్సవం గురించి ఈ వ్యాసం వివరిస్తుంది. లక్షలాది మంది భక్తులు ఈ వేడుకలకు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భద్రతా ఏర్పాట్లు బాగా చేసారు. భక్తుల సౌకర్యార్థం అనేక ఏర్పాట్లు కూడా చేసారు.

సీతారాముల కల్యాణం చూతము రారండి అంటూ లక్షలాది భక్తులు దక్షిణ అయోధ్య భద్రాచలం బాట పట్టారు. ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో సీతారాములోరి కల్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. మిథిలా స్టేడియంలోని మిథిలా కల్యాణ మండపంలో, అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణ ఉత్సవం జరగనుంది. దీనికోసం మిథిలా స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబు అయ్యింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. మిథిలా స్టేడియం ప్రాంగణాన్ని 24 సెక్టార్లుగా విభజించారు. అన్ని సెక్టార్లలో LED స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు.
శ్రీరాముని కల్యాణోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చలువ పందిళ్లు ఏర్పాటుచేశారు. వేసవి కావడంతో భక్తులకు మంచినీరు, మజ్జిగ అందించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తూ గోటి తలంబ్రాలను సమర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే.. జంగారెడ్డిగూడెం నుంచి సుమారు ఏడు వేల మంది భక్తులు గోటి తలంబ్రాలు భద్రాద్రి ఆలయానికి సమర్పించారు. దాంతో.. భద్రాచలం రాములోరి ఆలయ పరిసరాలు ఒకరోజు ముందే రామ నామస్మరణతో మారుమోగిపోయాయి.
ఈ వేడుకలకు సీఎం, మంత్రులు, ఇతర ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం రేవంత్‌రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న నేపథ్యంలో భద్రాచలంలో 2 వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో శ్రీరామనవమి కాగా.. గతేడాది లోక్‌సభ ఎన్నికల కోడ్ కారణంగా రాములవారి కల్యాణానికి రేవంత్ హాజరు కాలేకపోయారు. అలాగే ఈ రాములోరి కళ్యాణ వేడుకకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు రానుండటంతో భద్రాద్రిలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.