తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి KCR.. మరోసారి వాసాలమర్రి గ్రామానికి రానున్నారు. ఈ గ్రామాన్ని CM KCR దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పర్యటించిన ఈయన..2021, జూలై 10వ తేదీ శనివారం ఈ గ్రామంలో పర్యటిస్తారని తెలుస్తోంది. అయితే.. అధికారికంగా మాత్రం ఎలాంటి షెడ్యూల్ రాకపోయినా.. అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు వాసాలమర్రిలో ఏర్పాట్లపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్నాక గత నెలలో ఆ ఊరికి వెళ్లిన సీఎం కేసీఆర్ గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
అనంతరం, గ్రామ సభ నిర్వహించి గ్రామాభివృద్ధికి పలు సూచనలు చేశారు. అందరూ కష్టపడి పనిచేస్తే వాసాలమర్రి ఆరు నెలలు తిరిగే సరికి బంగారు వాసాలమర్రి అవుతుందంటూ హితబోధ చేశారు. వాసాలమర్రి గ్రామాభివృద్ధికి రూట్ మ్యాప్ ప్రకటించడమే కాకుండా ఒకే ఒక్క ఏడాదిలో రూపురేఖలు మార్చేస్తానని ప్రకటించారు. ఇంకా 20 సార్లయినా వాసాలమర్రికి వస్తానంటూ ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగానే 20రోజులు కూడా తిరక్కముందే రెండోసారి శనివారం గ్రామానికి వెళ్తున్నారు.
వాసాలమర్రి అభివృద్ధి చెందాలంటే గ్రామస్తుల్లో ఐక్యమత్యంతోపాటు పైకి రావాలనే పట్టుదల ఉండాలంటూ తన మొదటి పర్యటనలో దిశానిర్దేశం చేశారు కేసీఆర్. వారానికి కనీసం రెండు గంటలైనా గ్రామస్తులంతా పనిచేయాలన్నారు. మరి, రేపటి పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ వాసాలమర్రి అభివృద్ధికి ఎలాంటి వరాలు ప్రకటిస్తారో గ్రామస్తులకు ఏం దిశానిర్దేశం చేస్తారోనని ఆసక్తి నెలకొంది.