CM KCR: మోత్కుపల్లికి రాజకీయ అనుభవం ఎంతో ఉంది.. కీలక విషయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్
CM KCR: మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ కండువా కప్పి..
CM KCR: మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ కండువా కప్పి మోత్కుపల్లిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. మోత్కుపల్లి నర్సింహులుకు రాజకీయ అనుభవం ఎంతో ఉందని, అణగారిన వర్గాల వాయిస్ వినిపించారని అన్నారు. నాతో చాలా ఏళ్లు కలిసి పని చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. అనాడు విద్యుత్ కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాం.. ఆ రోజుల్లో కరెంటు కోతల కష్టం ఎలా ఉండేదో తెలుసు అని అన్నారు. తెలంగాణ వస్తే పెట్టుబడులు రావన్న తప్పుడు ప్రచారం చేశారని, తెలంగాణ సాధనలో మాయవతి ఇంటికి 19 సార్లు వెళ్లాలనని అన్నారు. మంచినీళ్లు కూడా కొనుక్కుని తాగాల్సిన పరిస్థితి ఉండేదని, మన సమస్య ఏంటో అందరికీ వివరించి చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్ చెప్పారు. సమస్యలను పరిష్కరించుకున్నామన్నారు. తెలంగాణ వస్తుందని ఆ రోజే చెప్పా.. 38 పార్టీల మద్దతు కూడగట్టి రాష్ట్రాన్ని సాధించామని అన్నారు. అన్యాయానికి గురైన వారిని బాగు చేయాలనే ఉద్దేశంతో ఎన్నో చర్యలు చేపట్టామని, చేనేతల ఆత్మహత్యలు ఆగే విధంగా చర్యలు చేపట్టా మని అన్నారు.
దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నాం..
తెలంగాణ సమాజం అత్యంత దారుణమైన పరిస్థితులను అనుభవించిందని, ఎన్నో సమస్యల కారణంగా చాలా బాధలు పడ్డాం. చాలా అనుభవించాం. ఒకప్పుడు నర్సింహులు కరెంట్ మంత్రిగా ఉండే. నేను ఆయనను కలిసినప్పుడు కరెంట్ బాధలు ఉన్నాయని చెప్పారు. ఆలేరు అంతా కరువు ప్రాంతం. ఎన్ని ట్రాన్స్‌ఫార్మర్లు తీసుకొచ్చినా లాభం లేకుండా పోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కోసం తెలంగాణ ప్రాంతం ఎన్నో కష్టాలు పడిందని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ వస్తే ఏం అభివృద్ధి జరగదని పుకార్లు సృష్టించారు. అనేక అవమానాలను తెలంగాణ సమాజం ఎదుర్కొందని అన్నారు. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత కూడా అనేక భయభ్రాంతులకు గురి చేశారని, ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా ముందుకెళ్లామని అన్నారు.
ఇతర పార్టీలకు రాజకీయం అంటే గేమ్..
ఇతర పార్టీలకు రాజకీయం అంటే ఒక గేమ్ లాంటిదని, టీఆర్‌ఎస్‌కు మాత్రం రాజకీయం ఒక యజ్ఞం లాంటిదని వ్యాఖ్యానించారు. బలహీన వర్గాలను బలోపేతం చేయడానికి దళిత బంధు పథకం తీసుకువచ్చామని, దళిత బంధు యజ్ఞం ఆగదని స్పష్టం చేశారు. దీనిని అన్ని వర్గాలకు అందిస్తామని, బీసీలు, ఇబీసీలకు వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. ఒక క్రమంలో పనులు చేస్తూ వస్తున్నామని, దళిత బంధు కోసం రూ. లక్షా 70 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
గత 60 ఏళ్లలో ఇలాంటి పనులు ఎందుకు చేయలేదని కేసీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నా.. చేయలేదన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే ఏదైనా సాధ్యమేనని అన్నారు. అందరికి మంచి జరగాలంటే మంచి నాయకత్వంతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వచ్చేసారి కూడా గెలిచేది మనమే అంటూ కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. దళితబంధు కరోనా కారణంగా ఏడాది ఆలస్యమైందని, దళిత బంధు ద్వారా రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల ఆదాయం అని అన్నారు. దళిత బంధుకు రూ.1.70 లక్షల కోట్లు అవసరమని ముందుగానే అంచనా వేశామని, అందుకు తగినట్లుగానే ముందుకెళ్తున్నామని అన్నారు.