Assembly Meet: ఈనెల 25 లేదా 28 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. ముందు రోజే భేటీ కానున్న కేబినెట్!
తెలంగాణ వార్షిక బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 25 లేదా 28వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
Telangana Assembly Budget Session: తెలంగాణ వార్షిక బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు కానుంది. ఈ నెల 25 లేదా 28వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సుమారు రెండు వారాల పాటు సమావేశాలను నిర్వహించాలని భావిస్తోంది. ఈ నెల 25 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యే పక్షంలో తొలి రోజు గవర్నర్ ప్రసంగం, 26న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగే అవకాశముంది. లేదంటే, ఈ నెల 28న బడ్జెట్‌ను ప్రవేశ పెట్టి శివరాత్రి పండుగ నేపథ్యంలో రెండ్రోజుల విరామం తర్వాత మార్చి 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు యధావిథిగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కాగా, ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే, ఏర్పాట్లు పూర్తి చేసేందుకు అసెంబ్లీ కార్యాలయం సిద్ధమవుతోంది.
వార్షిక బడ్జెట్(2022 23)తో పాటు పద్దులకు సంబంధించి చర్చ వచ్చే నెల 16వ తేదీ వరకు కొనసాగే సూచనలున్నాయి. సమావేశాల ప్రారంభానికి ముందు ఈ నెల 24 లేదా 25 తేదీల్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఇదిలావుంటే, ఇప్పటివరకు ఖాళీగా ఉన్న శాసనమండలి ఛైర్మన్, డిఫ్యూటీ ఛైర్మన్ పదవులను కూడా భర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు మొదలు పెట్టారు. శాసన మండలి చైర్మన్‌గా పనిచేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి పదవీ కాలపరిమితి గతేడాది జూన్‌లో ముగియడంతో భూపాల్‌రెడ్డి ప్రొటెమ్ చైర్మన్‌గా శాసన మండలి సమావేశాలను నిర్వహించారు. ఈ ఏడాది జనవరిలో భూపాల్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవీకాలం కూడా ముగియడంతో ఆయన స్థానంలో ఎంఐఎం పార్టీకి చెందిన అమీనుల్ జాఫ్రీ ప్రస్తుతం ప్రొటెమ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల ఆరంభంలో మండలి కొత్త చైర్మన్ ఎన్నిక కోసం షెడ్యూలు విడుదలయ్యే అవకాశముంది.
Read Also… Hyderabad: హైదరాబాద్‌లో మరో దారుణం.. పాలకోసం బయటికి వచ్చిన బాలికపై అఘాయిత్యం..