Adilabad: అక్షయ తృతీయ సందర్భంగా అందరూ బంగారం షాపులకు వెళ్తుంటే.. ఆ రైతులు మాత్రం
భూమినే తల్లిగా భావించే రైతులకు విత్తనం బంగారమే కదా... అందుకే అక్షయ తృతీయ సందర్భంగా విత్తన షాపులకు క్యూ కడుతున్నారు రైతులు. వర్షం పడగానే విత్తు నాటేందుకు భూమిని సిద్ధం చేసే పనిలో ఉన్నామని చెబుతున్నారు.
అక్షయ తృతీయ రోజు ఆదిలాబాద్ అన్నదాతలు పెద్ద ఎత్తున విత్తన దుకాణాలకు క్యూ కడుతున్నారు. ఈ శుభదినాన విత్తనాలు కొనుగోలు చేస్తే బంగారం లాంటి పంట పండుతుందన్న నమ్మకంతో ప్రతి ఏటా ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. వానాకాలం సాగు కోసం రెండు నెలల ముందుగానే విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు ఆదిలాబాద్ రైతులు. ఉదయం నుండే సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాపులు రైతులతో కిటకిటలాడుతున్నాయి. అక్షయ తృతీయ మంచిరోజు కావడంతో ఇష్టదైవానికి పూజలు చేసి వానాకాలం వ్యవసాయ పనులు ప్రారంభిస్తామని చెపుతున్నారు.
విత్తనమే బంగారం
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా సాగయ్యే పత్తితో పాటు సోయ విత్తనాలు కొనుగోలు చేసేందుకు సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాపుల వద్ద రైతన్నలు క్యూకట్టారు. అక్షయ తృతియ కావడంతో విత్తనాలు కొనుగోలు చేయడమే మాకు బంగారం కంటే ఎక్కువ అంటూ విత్తనాల కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు సైతం అన్నదాతను అతిథిగా బావించి శాలువా కప్పి సన్మానించి మరీ వారు కొనుగోలు చేసిన విత్తనాలను వారికి అందించడం ఆనవాయితీగా వస్తుందని చెపుతున్నారు. అక్షయ తృతీయ రోజు అంతా బంగారం, వెండి కొనుగోలు చేస్తే… మేము మాత్రం విత్తనాలే బంగారంలా బావించి కొనుగోళు చేస్తున్నామంటున్నారు.
సిరుల పంటలు పండాలని
గతేడాది అక్షయ తృతియ రోజు కొనుగోలి చేసిన పత్తి విత్తనాలతో దిగుబడి అదికంగా వచ్చిందని.. మద్దతు ధర మాత్రం తక్కువగా పలకడంతో ఆరు నెలలుగా పత్తి ఇంటికే పరిమితం అయిందని.. ఈసారి ఆ పత్తి అమ్మకాలతో పాటు.. సాగు కూడా అదికంగా రావాలని ఇంటి దైవాన్ని పూజించి ఈ రోజు విత్తనాలను కొనుగోళు చేశామని చెపుతున్నారు ఆదిలాబాద్ రైతులు. ఖరీప్ సీజన్ కు ఆదిలాబాద్ లో 15 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. జూన్ లో వచ్చే మార్గశిర కార్తే నుంచి విత్తనాలు వేయడం మొదలు కానుంది. అక్షయ తృతీయ నాడు విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు.. వర్షం పడగానే వాటిని వేసేందుకు భూమిని సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. భూమినే తల్లిగా భావించే రైతుకు విత్తనం బంగారమే కదా…
మరిన్ని తెలంగాణ వార్తల కోసం