మహబూబ్‌నగర్ జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపుతోంది. జిల్లాలో మళ్లీ కల్తీ కల్లు మాఫియా రెచ్చిపోతోంది. కాసులకు కక్కుర్తిపడిన కల్తీకల్లు తయారీదారులు ప్రజల ప్రాణాలను హరించేస్తున్నారు. డైజోఫాం, అల్ఫాజోలం, క్లోరో హైడ్రేట్ వంటి మత్తు పదార్థాలతో కృత్రిమ కల్లును తయారు చేస్తుండడం ప్రజల ప్రాణాలపైకి తెస్తోంది. కల్తీకల్లుతాగి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్న జనం పరిస్థితి ఆందోళనరేకెత్తిస్తోంది. కల్తీ కల్లులో కలిపే మత్తు పదార్థాల మోతాదు ఎక్కువైనా లేదా తక్కువైనా ప్రమాదమే. ప్రతి రోజు తాగే ఈ కల్లులో మత్తు పదార్థం మోతాదు తక్కువైతే వీరంతా పిచ్చి పిచ్చిగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని మోతినగర్, దొడ్లోనిపల్లి, కోయనగర్ గ్రామాలకు చెందిన పది మంది స్త్రీ పురుషులు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుండడంతో మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. ఇంద్రజ అనే మహిళ పూర్తిగా చచ్చుబడిపోయింది. మత్తు పదార్థం తగ్గడం వల్లే ఇలా ప్రవర్తిస్తున్నారంటున్నారు బాధితులు.
జిల్లాలో ఉత్పత్తి అవుతోన్న కల్లుకి పది రెట్లు ఎక్కువ కల్లు ప్రతి రోజూ విక్రయిస్తున్న పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఎండ నుంచి ఉపశమనం కోసం కాయ కష్టం చేసుకునే నిరుపేదలు కల్లును ఆశ్రయిస్తుంటారు.
గతంలోనూ కల్తీ కల్లు బారిన పడి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మూడు గ్రామల ప్రజలు కల్తీ కల్లు వల్ల అనారోగ్యం బారినపడ్డారు. అయినప్పటికీ సంబంధిత ఎక్సైజ్ అధికారుల్లో మాత్రం చలనం లేదు. కనీసం కల్తీ కల్లు నివారణకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం..