Telangana: యుముడి వేశంలో ఊరూరా తిరుగుతున్న ఇతనెవరు.. ఎందుకు ఈ సంచారం?
సమాజంలో గురువుల పాత్ర ప్రముఖమైనది. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే కాకుండా సమాజాభివృద్ధికి దోహదపడాలి. ఓవైపు విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు అందరికీ భిన్నంగా సమాజ హితం కోసం ఉపాధ్యాయుడు కొత్త అవతారంలో సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. సామాజిక చైతన్యం కోసం వినూత్న రీతిలో ఆ ఉపాధ్యాయుడు ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

సమాజాన్ని సామాజిక రుగ్మతలు, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు ఇంకా పట్టిపీడిస్తున్నాయి. నానాటికి పెరిగిపోతున్న ఈ జాడ్యాలతో యువత చిత్తవుతోంది. ఈ రుగ్మతలకు చెక్ పెట్టాలని సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరంట్ల ప్రభుత్వ హై స్కూల్ తెలుగు టీచర్ ప్రభాకర్ భావించాడు. ఇందుకోసం తోలుత ప్రజలకు అవగాహన కల్పించాలని భావించాడు. దీనికోసం ప్రభాకర్ ఓవైపు విధులు నిర్వర్తిస్తూనే.. మరోవైపు సెలవు దినాల్లో విచిత్ర వేషాధారణతో ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాడు. ధర్మ రక్షణ దురంధరుండా.. సకల పాప కోటి భయంకరుండా.. దేవగణా పూజితా దిక్పాలకుండా.. నరకలోక పరిపాలకుండా. యముండా! అంటూ యమధర్మరాజు వేషధారణలో ఊరూరా ప్రచారం చేస్తున్నాడు.
నల్ల రంగు దుస్తులు, వాటిపై పుర్రె బొమ్మ, నెత్తిన టోపీ, నల్లటి కళ్లజోడు, యమధర్మరాజు వేషధారణతో చేతిలో మైకు పట్టుకుని.. ఎక్కడ జనం రద్దీ ఉన్నా అక్కడ ప్రత్యక్షం అవుతున్నాడు. ముఖ్యంగా మాదకద్రవ్యాలకు బానిసై భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్న యువత లక్ష్యంగా తన చైతన్య కార్యక్రమాలను చేపడుతున్నాడు. గ్రామాల్లోని వీధుల్లో, ఐకెపి కేంద్రాల వద్ద మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై యముడు వేషంలో వివరిస్తున్నారు. మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు, హత్యలు, అత్యాచారాలకు ప్రధాన కారణమవుతున్నాయనీ, మత్తును దరిచేరనివ్వొద్దంటూ విచిత్ర వేషధారణలో అవగాహన కల్పిస్తున్నాడు.

రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్యవంతులను చేసే దిశగా వినూత్నంగా ప్రయత్నిస్తున్నాడు. యమధర్మరాజు వేషధారణతో సామాన్యులకు అవగాహన కలిగేలా సందేశాలతోపాటు కరపత్రాల పంపిణీ, ఫ్లెక్స్ ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ధూమపానానికి బానిసై అనారోగ్యంతో బాల్య స్నేహితుడి మృతి కలచివేసిందని ప్రభాకర్ చెబుతున్నాడు దీంతో డ్రగ్, మత్తు పదార్థాల బారిన యువత పడకుండా ఉండేందుకు సెలవు దినాల్లో ఇలాంటి అవగాహన ప్రదర్శనలు చేపడుతున్నానని ప్రభుత్వ టీచర్ ప్రభాకర్ అంటున్నాడు. ప్రభుత్వ టీచర్ సెలవు దినాన్ని ప్రజల కోసం వినియోగించడం పట్ల స్థానికులు అభినందిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
