
హైదరాబాద్ నగరాభివృద్ధి దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రియల్ ఎస్టేట్ రంగాన్ని నేరుగా ప్రభావితం చేసేలా టీడీఆర్ విధానంలో కీలక మార్పులు చేస్తూ పురపాలక శాఖ జీవో నెం. 16ను విడుదల చేసింది. చెరువులు, నదుల పరిరక్షణతో పాటు భూసేకరణను వేగవంతం చేయడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సవరించిన నిబంధనలు ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించిన తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అమలులోకి రానున్నాయి. ఈ పరిధిలోని 300 డివిజన్లలో ఇకపై జరిగే నిర్మాణాలు కొత్త టీడీఆర్ నిబంధనలకు లోబడి ఉండాల్సి ఉంటుంది. నగరంలో హైరిస్ భవనాల నిర్మాణాన్ని నియంత్రించేలా ప్రభుత్వం కీలక షరతును విధించింది. ఇకపై 10 అంతస్తులు దాటే ప్రతి భవనానికి టీడీఆర్ తప్పనిసరి కానుంది. 11వ అంతస్తు నుంచి పై అంతస్తుల వరకు నిర్మించే మొత్తం విస్తీర్ణంలో 10 శాతానికి సమానమైన టీడీఆర్ సర్టిఫికెట్లు బిల్డర్లు సమర్పించాల్సి ఉంటుంది. దీంతో ఇప్పటివరకు మార్కెట్‌లో వినియోగం లేక నిల్వగా ఉన్న టీడీఆర్ బాండ్లకు డిమాండ్ పెరగనుంది.
ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో
భూమిని ప్రభుత్వానికి ఉచితంగా అప్పగించే బిల్డర్లకు ప్రత్యేక రాయితీలు కూడా ఈ జీవోలో పొందుపరిచారు. సెట్‌బ్యాక్ నిబంధనల్లో, భవన ఎత్తు పరిమితుల్లో సడలింపులు కల్పిస్తూ వారిని ప్రోత్సహించనున్నారు. దీని ద్వారా భూసేకరణ ప్రక్రియ సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. చెరువులు, నదుల పరిరక్షణకు సంబంధించి భూముల స్వాధీనంపై కూడా ప్రభుత్వం ఆకర్షణీయమైన విధానాన్ని ప్రకటించింది. ఎఫ్‌టీఎల్ పూర్తిస్థాయి నీటి మట్టం పరిధిలో ఉన్న పట్టా భూములకు 200 శాతం టీడీఆర్, చెరువుల బఫర్ జోన్లలో ఉన్న భూములకు 300 శాతం టీడీఆర్, బఫర్ వెలుపల అభివృద్ధి పనుల కోసం భూములు సేకరిస్తే 400 శాతం టీడీఆర్ ఇవ్వాలని నిర్ణయించింది. ఒక ఎకరాకు మించి భూసేకరణ జరిగితే ఆ ప్రతిపాదనను ప్రభుత్వం నేరుగా పరిశీలించనుంది. మూసీ నది పరీవాహక ప్రాంతం, నగరంలోని చెరువుల సుందరీకరణ పనులకు భూ యజమానుల నుంచి ఎదురవుతున్న అడ్డంకులను తొలగించడమే ఈ విధాన మార్పుల లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.
గతంలో ప్రభుత్వం జారీ చేసిన దాదాపు 10 వేల కోట్ల రూపాయల విలువైన టీడీఆర్ సర్టిఫికెట్లు మార్కెట్‌లో పేరుకుపోయి వాటి ధర గణనీయంగా పడిపోయింది. దీంతో భూ యజమానులు టీడీఆర్‌కు బదులుగా నగదు పరిహారం కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. ఇప్పుడు పెద్ద భవనాల నిర్మాణానికి టీడీఆర్ తప్పనిసరి చేయడంతో బిల్డర్లు వాటిని కొనుగోలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో టీడీఆర్ మార్కెట్ మళ్లీ కదలికలోకి రావడంతో పాటు, ప్రభుత్వంపై నగదు పరిహారం భారం తగ్గనుంది. ఫలితంగా నిధుల కొరతతో నిలిచిపోయిన రోడ్ల విస్తరణ పనులు, మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులు వేగం అందుకునే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇది చదవండి: ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..