Telangana: ఆ మార్కెట్‌లో రోజూ ఉచితంగా టిఫిన్.. రూ. 5కే భోజనం.. ఎక్కడంటే..?
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు నానా కష్టాలు పడుతుంటారు. పంట అమ్ముడు పోతుందో లేదోనన్న ఆందోళనతో మార్కెట్‌కు వచ్చిన రైతన్నకు అర్థాకలితో ఉంటున్నాడు. అన్నదాతల అర్ధాకలిని తీర్చేందుకు మార్కెట్ కమిటీ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఆ మార్కెట్ ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

తెలంగాణ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్‌గా సూర్యాపేట పేరొందింది. ఈ మార్కెట్‌కు నిత్యం వేలాది బస్తాల ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు సాగుతుంటాయి. దీంతో ఈ వ్యవసాయ మార్కెట్‌కు నిత్యం వందలాది మంది రైతులు వస్తుంటారు. వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించడానికి మార్కెట్‌కు వచ్చే రైతులు రెండు, మూడు రోజుల పాటు ఇక్కడే ఉండాల్సి వస్తోంది. ధాన్యం రాశులకు కాపలాగా ఉంటూ సరైన భోజనం లేక రైతులు అర్ధాకలితో ఉంటున్నారు. అన్నదాతల అవస్థలను గమనించిన మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి చలించిపోయారు. పంటను అమ్ముకునేందుకు అరిగోసలు పడుతూ మార్కెట్‌కు వచ్చే అన్నదాతలు అర్థాకలితో ఉండకూడదని వేణారెడ్డి ఆలోచించారు. రైతు సంక్షేమం కోసం మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతులకు ఉచిత అల్పాహారం (టిఫిన్), కేవలం 5 రూపాయలకే భోజనం అందించే పథకాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఉచిత ఆహార పంపిణీ కార్యక్రమం లయన్స్ క్లబ్, అక్షయ పాత్ర సంస్థల సహకారంతో కొనసాగుతోంది. ఉదయం అల్పాహారంలో ఉప్మా, కిచిడి అన్నదాతలకు అందిస్తున్నారు. ఐదు రూపాయలకే పప్పు, సాంబార్ భోజనాన్ని పెడుతున్నారు. ఈ భోజనానికి అయ్యే ఖర్చులో ఐదు రూపాయలు మాత్రమే రైతుల నుంచి వసూలు చేసి, మిగతా మొత్తాన్ని మార్కెటింగ్ శాఖ భరిస్తోంది. ఉదయం అల్పాహారానికి వెయ్యి మంది, మధ్యాహ్నం 1500 మంది అన్నదాతలకు ఐదు రూపాయల భోజనాన్ని అందిస్తోంది.
మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి కృషి ఫలితంగా మార్కెట్‌కు వచ్చే వందలాది మంది రైతులు ఇప్పుడు కడుపు నిండా భోజనం చేస్తున్నారు. త్వరలో నిత్య అన్నదానం ట్రస్ట్ ఏర్పాటు చేసి రైతులకు ఆహార పంపిణీని నిరంతరం కల్పించాలనే లక్ష్యంతో సూర్యాపేట మార్కెట్ కమిటీ ఆలోచన చేస్తోంది. ఈ ట్రస్ట్ ద్వారా మార్కెట్‌కు వచ్చే ప్రతి రైతుకూ నిత్య అన్నదానం నిర్వహించాలని చైర్మన్ భావిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రైతు బంధు, మద్దతు ధర, పంటలకు బోనస్ పంపిణీ, ఉచిత వ్యవసాయ యంత్రాల పంపిణీ వంటి అనేక రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. తాజాగా సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి చొరవతో ప్రారంభమైన ఈ ఉచిత ఆహార పంపిణీ కార్యక్రమం రైతు సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను మరోసారి చాటుతోంది. అన్నదాతకు ఎంతో మేలు చేకూర్చే ఉచిత ఆహార పంపిణీ గొప్ప నిర్ణయం అంటూరైతులు ప్రశంసిస్తున్నారు.
