Nalgonda: ఆగని మరణాలు.. గ్రామానికి కీడు సోకిందని అక్కడి ప్రజలంతా వనవాసం..
సృష్టికి.. ప్రతి సృష్టి జరుగుతున్న ఈ ఆధునిక కాలంలో కూడా పల్లెలు మూఢనమ్మకాల మత్తులో జోగుతున్నాయి.. మూఢ నమ్మకాలతోనే అన్ని సమస్యలు తొలగిపోతాయానే నమ్మకం నానాటికీ మరింత పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.. వరస మరణాలతో గ్రామానికి కీడు సోకిందని.. వర్షాలు కురవడం లేదని ఆ గ్రామస్తులు ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..

నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం తక్కెళ్లపహాడ్ గ్రామం.. ప్రకృతి ఒడిలో గ్రామస్తుల జీవనం హాయిగా సాగిపోతున్నది.. ఈ క్రమంలో ఊరిలో జనం ఉన్నపళంగా ఒకరి తర్వాత మరొకరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకరు మృతి చెందగా, అతడి దశదినకర్మ పూర్తికాక ముందే మరొకరు మృతి చెందడం రెండు నెలలుగా జరుగుతోంది. దీంతో ఎందుకు చనిపోతున్నారో తెలియకపోతే గ్రామస్తులు ఆందోళన చెందారు. దీనికి తోడు ఆశించిన వర్షాలు లేకపోవడంతో మరింత భయాందోళనకు గురయ్యారు. వానాకాలం సీజన్ ప్రారంభంలో పత్తితోపాటు మెట్టపంటలను కూడా గ్రామస్తులు సాగు చేశారు. అయితే వర్షాలు లేక విత్తిన పత్తి విత్తనాలు మొలకెత్తక.. రెండు మూడుసార్లు విత్తారు. భూగర్భ జలాలు అడుగంటి నారుమళ్లు ఎండిపోతున్నాయి. ఒకవైపు వరస మరణాలు, మరోవైపు వర్షాలు రాకపోవడంతో ఏం చేయాలో తెలియక గ్రామస్తులు తలలు పట్టుకున్నారు. చేసేదేమిలేక చివరకు గ్రామస్తులంతా కలిసి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ పెద్దలు నకిరేకల్ లోని ఓ స్వామీజీని కలిశారు. గ్రామంలో వరుస మరణాలు సంభవించడం.. వర్షాలు కురవకపోవడానికి కీడే కారణమని చెప్పారు. కీడు పోవాలంటే గ్రామస్తులందరూ ఊరు విడిచి వెళ్లి.. ఓ ప్రాంతంలో కీడు వంటలు వండుకోవాలని.. స్వామీజీ గ్రామస్థులకు సూచించారు.
దీంతో గ్రామస్తులంతా ఊరు విడిచి ఒక్కరోజు వనవాసానికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అందరూ ఊరు విడిచి వెళ్లాలని, గ్రామంలో ఒక్కరు కూడా ఇంట్లో పొయ్యి వెలిగించొద్దని, కిరాణ, మద్యం బెల్టు దుకాణాలు తెరవొద్దని, కోళ్లు, మేకలను కోయొద్దని దండోరా వేయించారు. ఊరు విడిచి వెళ్లకున్నా, దుకాణాలు తెరిచినా రూ.5 వేలు, గ్రామంలో కోళ్లు, మేకలు కోసి మాంసం విక్రయిస్తే రూ.10 వేలు జరిమానా విధిస్తామని దండోరా వేయించారు. ఇంకేముంది అందరూ ఉదయం 6 గంటలకు..ఇళ్లకు తాళం వేసి..పొలం బాట పట్టారు. గ్రామంలోని ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కలిసి వనవాసానికి వెళ్లారు. సాయంత్రం చీకటి పడేంత వరకు అక్కడే గ్రామస్తులంతా కుటుంబ సభ్యులతో కలిసి కీడు వంటకాలను వండుకొని తిన్నారు.
వీడియో చూడండి..
ఎవరు కూడా మధ్యలో మళ్ళీ గ్రామంలోకి వెళ్ళకుండా పొలాల వద్దనే గడిపారు. కీడు సోకడం వల్ల గ్రామంలో ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారని.. వర్షాలు కురవడం లేదనీ.. కీడు పోవాలంటే గ్రామాన్ని విడిచి కీడు వంటలు చేసినట్లయితే ఆ పీడ పోతుందని తెలియడంతో గ్రామాన్ని వదిలి వచ్చామని స్థానికులు చెబుతున్నారు.. గతంలో ఇదే మాదిరిగా గ్రామానికి కీడు సోకితే కీడు వంటలు చేసి వనవాసం వచ్చామని.. అప్పుడు బాగానే జరిగిందని వివరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
