మారుతున్న కాలంతో పాటు బంధాల్లో కూడా మార్పులు వచ్చాయి. కడుపున పుట్టిన పిల్లలైనా, కన్న తల్లైనా .. బంధాలు అనుబంధాలు అన్నీ వ్యాపార బంధాలుగా మారాయి. రోజు రోజుకీ మానవ సంబంధాలు మరింతగా దిగజారుతున్నాయి. కొందరు పుత్రరత్నాలకి చివరికి కన్నతల్లిదండ్రులు కూడా భారమైపోతున్నారు. తమ ఆర్ధిక పరిస్థితి సహకరించడంలేదంటూ.. జీవాన్ని, జీవితాన్ని ఇచ్చిన అమ్మానాన్నలను అనాథల్లా రోడ్డుమీద వదిలేసి.. చేతులు దులిపేసుకుంటున్నారు.. నవమాసాలు మోసి కని.. కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచిన తల్లి కన్న బిడ్డలకు భారమైపోతోంది. వృద్ధ్యాప్యంలో అండగా ఆసరాగా నిలబడాల్సిన తల్లిని నడిరోడ్డుమీద వదిలేసిన ప్రబుద్ధులు అనేకమంది ఉన్నారు తాజాగా ఇటువంటి అవమానవీయ ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
తన ప్రాణం అడ్డేసి.. రెక్కలు ముక్కలు చేసుకొని కనిపెంచిన తల్లిపట్ల క్రూరంగా ప్రవర్తించారు కొడుకులు. తిని తినక కడుపున పుట్టిన బిడ్డలను ప్రయోజకులను చేసిన తల్లిపట్ల మానవత్వం మరిచారు కొడుకులు. ప్రభుత్వ ఉద్యోగాల్లో సెటిల్ అయిన తల్లికి పట్టేడు అన్నం పెట్టేందుకు వెనుకాడారు. ఆకలి కేకలతో వయసు మళ్లీ ఆ తల్లి ఏం చేయాలో తెలియక చివరకు పోలీసులను ఆశ్రయించింది. తన ఆలనాపాలనా చూడకపోగా.. కూతుర్ల వద్దకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని.. ఇదేంటని అడిగితే కొడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ తల్లి. ఈఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినపల్లిలో జరిగింది. వెంకటనర్సమ్మ అనే వృద్ధురాలికి ఇద్దరు కుమారులు, నలుగురు కూతుళ్లు. వయసు మళ్లీన తనకు పిడికెడు అన్నం పెట్టకుండా హింసిస్తున్నారంటూ ముదిగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది వెంకటనర్సమ్మ అనే వృద్దురాలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..