Telangana: అయోమయంలో సోమారపు.. కమలంతోనే సాగాలా.. ఇండిపెండెంట్‌గా దిగాలా..?
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి రామగుండం మున్సిపల్ తొలి చైర్మన్‌గా గెలపొందాడు. ఆ తర్వాత టీడీపీలో చేరి 2004లో మంథని నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో రామగుండం నుండి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సోమరపు సత్యనారాయణను ప్రజలు గెలిపించారు. అధికార కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సభ్యునిగా కొనసాగుతూ వచ్చిన ఆయన.. తెలంగాణ ఉద్యమ తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో TRS పార్టీలో చేరారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు నిలయమైన పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో సోమారపు సత్యనారాయణ కాస్త పేరున్న పొలిటికల్ లీడర్. FCIలో ఇంజనీర్‌గా పనిచేసిన సోమారపు, తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ అరంగేట్రం చేశాడు. తొలుత మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి రామగుండం మున్సిపల్ తొలి చైర్మన్‌గా గెలపొందాడు. ఆ తర్వాత టీడీపీలో చేరి 2004లో మంథని నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో రామగుండం నుండి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సోమరపు సత్యనారాయణను ప్రజలు గెలిపించారు. అధికార కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సభ్యునిగా కొనసాగుతూ వచ్చిన ఆయన.. తెలంగాణ ఉద్యమ తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో TRS పార్టీలో చేరారు. చేరిక సందర్భంగా అధినేత కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు, ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో TRS అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన సోమారపు సత్యనారాయణ రామగుండంకు రెండవసారి ఎమ్మెల్యేగా వ్యవహరించారు. గత ఎన్నికల్లో TRS అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ, రెబల్ అభ్యర్థి కోరుకంటి చందర్ చేతిలో ఓటమిపాలయ్యారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో TRS పార్టీకి గుడ్ బై చెప్పాడు.
రాష్ట్ర బిజెపి అగ్ర నాయకుల సంప్రదింపుల మేరకు కమలం గూటికి చేరారు. BJP అదిష్టానం కూడా సోమారపు సత్యనారాయణ అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని జిల్లా బిజెపి అధ్యక్ష పదవిని అప్పగించింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, నిన్న మొన్న వచ్చిన నాయకుడు మనపై పెత్తనం చేయడమా..? అంటూ.. ఆ పార్టీ క్యాడర్లో చాలామంది ఆరంభం నుండి సోమారపు సత్యనారాయణకు దూరంగా ఉండడం ప్రారంభించారు. ఈ తలనొప్పులు నచ్చక BJP జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కొంతకాలం సోమారపు సత్యనారాయణ నిర్ణయాన్ని హోల్డ్‌లో పెట్టిన అధిష్టానం, ఆయన సూచన మేరకే ఇటీవల మరో నాయకుడిని జిల్లా అధ్యక్షునిగా నియమించింది. రాబోయే ఎన్నికల్లో రామగుండం బిజెపి టికెట్ సోమారపు సత్యనారాయణకే అని అగ్ర నాయకులు హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే స్థానికంగా బిజెపికి పెద్దగా పట్టు లేకపోవడంతో సోమారపు అనుచరులంతా ఆ పార్టీ పట్ల అనాసక్తుతను ప్రదర్శిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. బిజెపి నుండి పోటీ చేస్తే తాము సహకరించబోమని పలువురు నిక్కచ్చిగా చెప్పినట్లు కూడా సమాచారం. ఈ నేపథ్యంలో అనుచరుల సహకారం లేకుండా బిజెపి నుండి పోటీ చేసేది ఎలా అంటూ సోమారపు సత్యనారాయణ మల్ల గుల్లాలు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
వయసు రిత్యా ఇవే తనకు చివరి ఎన్నికలని భావిస్తున్న సోమారపు కచ్చితంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని నిర్ణయించుకున్నారు. కానీ బిజెపి నుండి పోటీ చేసే విషయంపై ఒక క్లారిటీకి రాలేకపోతున్నారు. మరోవారం వేచి చూసి అనుచరుల అభిప్రాయాల మేరకు ఫైనల్ నిర్ణయానికి రావాలని భావిస్తున్నట్లుగా తెలియ వచ్చింది. అప్పటికి కూడా అనుచరులు బిజెపికి నై అంటే, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు కూడా లేకపోలేదని సన్నిహితుల ద్వారా అందిన సమాచారం. ఏది ఏమైనప్పటికీ, సోమారపు సత్యనారాయణ మరో వారం తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.