ఇంటర్‌సిటీ రైలులో ప్రమాదం జరిగింది. తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. లోకోపైలట్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. నాందేడ్-ఆదిలాబాద్ ఇంటర్‌సిటీ రైలు ఇంజిన్‌లో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. తలమడుగు మండలం డోర్లి గేట్ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా రైలు ఇంజిన్‌లో పొగలు కమ్మేశాయి. వెంటనే డోర్లి గేట్ వద్ద రైలును లోకోపైలట్ నిలిపివేశాడు. గంటకు పైగా అలాగే నిలిపి ఉంచారు.
ఆదిలాబాద్ నుంచి మరో రైలు ఇంజిన్ వచ్చిన తర్వాత ఇందులోని ప్రయాణికులను అందులోకి ఎక్కించారు. మరో టైన్ వచ్చే వరకు ప్రయాణికులకు నిరీక్షణ తప్పలేదు. రైలు ఇంజిన్‌లో సాంకేతిక లోపం వల్ల పొగలు వచ్చినట్లు సిబ్బంది వెల్లడించారు. గతంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ చోటు చేసుకోలేదని తెలిపారు. ఇంజిన్‌లో సాంకేతిక లోపం కారణంగానే పొగలు వ్యాపించినట్లు భావిస్తున్నారు. చిన్న సాంకేతిక సమస్య వల్ల ఇలా జరిగివుంటుందని సిబ్బంది అంచనా వేశారు.
రెండు రాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలకు ఈ ఇంటర్‌సిటీ ట్రైన్ చాలా ముఖ్యమైనది. ఇక్కడివారి రాకపోకలకు ఇది అనుకూలంగా ఉండటంతో ఉదయం పాల వ్యాపారం, కూరగాయల వ్యాపారం చేసేవారు ఇందులోనే ప్రయాణం చేస్తుంటారు.