
సిద్దిపేట, ఆగస్ట్ 20: సిద్దిపేట జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది..దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామ శివారులో ఓ కారు బావిలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా అర్ధరాత్రి వేళ ఈ దారుణం జరిగింది.మృతుల్లో ఐదేళ్ల బాలుడు, మూడేళ్ల చిన్నారి కూడా ఉండటంతో బలవంతపూర్ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకు న్నాయి. ఒకే కుటుంబంలో వెలుగులు నింపాల్సిన ఆ నలుగురిని.. కాలం కారు రూపంలో కబలించేసింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామ శివారులో తీవ్ర విషాదం గుండెల్ని పిండేస్తోంది.
రోడ్డు పక్కనే ఉన్న ఓ వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లడంతో.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ సమాధి అయ్యారు. మృతులను బలవంతపూర్ గ్రామానికి చెందిన రాజు, ఆయన భార్య భాగ్యతో పాటు ఐదేళ్ల కుమారుడు నియాన్ష్, మూడేళ్ల కూతురు శాన్వికగా గుర్తించారు. సిద్దిపేటలో ఓ బంధువు చనిపోవడంతో.. పరామర్శించేందుకు రాజు తన కుటుంబంతో కలిసి వెళ్లాడు. అంతా ముగించుకుని రాత్రి వేళ కారులో తిరుగుపయనమయ్యారు. అయితే అర్ధరాత్రి దాటినా రాజు కుటుంబం ఇంటికి చేరకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులు వారికి ఫోన్ చేశారు. కానీ అటు రాజు, ఇటు భాగ్య.. ఇద్దరి ఫోన్లు స్విచ్చాఫ్ రావడంతో వారి గుండెల్లో రాయి పడింది.
ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో.. చివరకు కంగారుగా దుబ్బాక పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన దుబ్బాక పోలీసులు.. మృతుల మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. లాస్ట్ లొకేషన్ ఆధారంగా అప్పనపల్లి గ్రామ శివారులోని రోడ్డు పరిసరాలను పరిశీలించారు. ఈ క్రమంలోనే రోడ్డు పక్కనే ఉన్న ఓ లోతైన బావిలో కారు పడి ఉండటాన్ని గమనించారు.వెంటనే స్థానికుల సహాయంతో, క్రేన్‌ను రప్పించి కారును బయటకు తీశారు. అయితే అప్పటికే ఘోరం జరిగిపోయింది. కారు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో శ్వాస ఆడక రాజు, భాగ్యతో పాటు ఆ ఇద్దరు పసికందులు కారులోనే ప్రాణాలు విడిచారు.