
ఆడపిల్ల పుడితే భారమని భావించే రోజులకు కాలం చెల్లింది. ఆడబిడ్డ పుడితే ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని సంబరాలు చేసుకునేలా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామ సర్పంచ్ కత్తెరపాక మంజుల సుధాకర్ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. సమాజంలో వేళ్లూనుకున్న వివక్షను దూరం చేస్తూ సామాజిక మార్పు కోసం కొదురుపాక సర్పంచ్ భరోసా అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేవలం అభివృద్ధి పనులకే పరిమితం కాకుండా మానవీయ కోణంలో ఆలోచించిన సర్పంచ్ దంపతులు.. తన ఐదేళ్ల పదవీ కాలంలో గ్రామంలో ఎవరు ఆడపిల్ల పుట్టినా తమ సొంత నిధుల నుండి రూ. 5,000 ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా ఈ అకౌంట్లను తెరిపించి ఆ పాస్ బుక్కులను తల్లిదండ్రులకు అందజేస్తున్నారు.
నూతన సంవత్సర కానుకగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్, గ్రామానికి చెందిన తిరుమలేష్-గౌతమి దంపతులకు పుట్టిన ఆడబిడ్డ పేరు మీద రూ. 5,000 డిపాజిట్ చేసి ఆ పాస్ బుక్కును స్వయంగా వారికి అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఆడపిల్లల చదువు, వివాహం తల్లిదండ్రులకు భారం కాకూడదని అన్నారు. తాము చేసే ఈ చిన్న పొదుపు, ఆ బిడ్డ పెరిగి పెద్దయ్యే సరికి కొండంత అండగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామస్తుల ఆలోచనా విధానంలో మార్పు రావడమే తమ లక్ష్యం అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడమే కాకుండా వ్యక్తిగతంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్న మంజుల సుధాకర్ దంపతులపై ప్రశంసల జల్లు కురుస్తోంది. జిల్లాలోని ఇతర గ్రామాలకు కూడా ఈ నిర్ణయం ఒక దిక్సూచిగా నిలుస్తుందని స్థానికులు కొనియాడుతున్నారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపిన సర్పంచ్ దంపతుల చొరవ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..