Telangana: కొలువు కల.. నెరవేరిన వేళ.. టీచర్ అయిన రిక్షావాలా కొడుకు

|

Oct 10, 2024 | 11:06 AM

తండ్రి రిక్షా తొక్కుతూ.. తల్లి పండ్లు అమ్ముతూ ఆ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తాము పడుతున్న కష్టాలు పిల్లలు పడొద్దని భావించి మంచి చదువులు చదివించారు. నిరంతరం శ్రమించి, వారి బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసిన కన్నవారి ఆశయాలను గుర్తించి నెరవేర్చాడు ఆ కుర్రాడు.

Telangana:  కొలువు కల.. నెరవేరిన వేళ.. టీచర్ అయిన రిక్షావాలా కొడుకు
Ganesh With His Father
Follow us on

ప్రస్తుత రోజుల్లో గవర్నమెంట్ జాబ్ సాధించడం అనేక మంది కల. ఉన్న కొద్దిపాటి ఉద్యోగాలకు వేలు, లక్షల్లో పోటీ పడుతున్నప్పటికి తాము కలలు కన్న జాబ్ కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా తట్టుకుని నిలబడి.. చివరికి ప్రభుత్వ ఉద్యోగం సాధించి చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నారు కొందరు యువత. ఆ కోవకు చెందిన వాడే ఈ కుర్రోడు.

కష్టపడి పోరాడితే సాధించనిది ఏదీ లేదని నిరూపించాడు ఇతగాడు.. లక్షల మంది పోటీలో ఉన్నా ఇవేవి అతడు విజయాన్ని ఆపలేదు. అవకాశాన్ని అందిపుచ్చుకుని.. తన తలరాతను మార్చుకున్నాడు. ఏళ్ల కష్టం.. ఎన్నో అపజయాలు.. మరెన్నో ఒడుదొడుకులు.. కుటుంబ సభ్యుల త్యాగాలు.. సంవత్సరాల తరబడి నిరీక్షణ.. వెరసి చివరకు అతను ఇష్టంగా ఎంచుకున్న ఉపాధ్యాయ కొలువు సాధించాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం రవీంద్రనగర్ కాలనీకి చెందిన ముడావత్ గణేశ్ డీఎస్సీ – 2024 ఫలితాల్లో ఎస్టీ విభాగంలో ఎస్జీటీ(Secondary Grade Teacher) జాబ్ సాధించాడు. తండ్రి మూడావత్ పంతులు రిక్షా తొక్కుతూ, తల్లి పండ్లు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరికి నలుగురు అమ్మాయిలు. ఇద్దరు అబ్బాయిలు సంతానం. చిన్న కుమారుడు గణేశ్ ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో వారు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. గురువుల మార్గనిర్దేశం, కుటుంబ సభ్యలు ప్రొత్సాహం వల్లే తాను జాబ్ కొట్టగలిగాను అని చెబుతున్నాడు గణేశ్..

చదువు కుటుంబ పరిస్థితులను మార్చేస్తుంది. చదవు తారతమ్యాలను చెరిపేస్తుంది. చదువు మీ హోదాను పెంచుతుంది. చదువు సమాజంలో మీకు గౌరవాన్ని అందిస్తుంది. అందుకే చదవును అశ్రద్ద చేయకండి. కొతకాలం ఇష్టపడి, కష్టపడి చదివి, జీవితాంతం హ్యాపీగా ఉండండి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..