Chicken Rates: ఆ పట్టణంలో చికెన్ చాలా చీప్‌గా దొరుకుతుంది. పేపర్ రేట్ కంటే రూ. 30 నుంచి రూ.50 వరకు తక్కువకు లభిస్తుంది. అంతేకాదు కిలో చికెన్ కొంటే ఒక్కోసారి 6 కోడిగుడ్లు ఉచితం అనే ఆఫర్ కూడా ప్రకటిస్తారు. పెళ్లిల్లకు, ఫంక్షన్లకు హోల్ సేల్‌గా చికెన్ కొంటే చాలా వరకు రేటు తగ్గిస్తారు. ఇది ఎక్కడో కాదు తెలంగాణలోని కామారెడ్డి పట్టణంలో నడుస్తుంది. కొత్తగా చికెన్ సెంటర్ వ్యాపారంలోకి దిగిన ఓ వ్యాపారి ఈ ఆఫర్లను ప్రకటిస్తున్నాడు. దీంతో మిగతా పోటీదారులు కూడా ఇదే రేటుకు చికెన్ విక్రయించాల్సి వస్తుంది. వీరి మధ్య పోటీతో కస్టమర్లు పండుగ చేసుకుంటున్నారు.
కామారెడ్డికి చెందిన చికెన్ వ్యాపారి ఒకరు ఇటీవల జిల్లా కేంద్రంలో మూడు బ్రాంచ్‌లను తెరిచి, పేపర్ ధరపై రూ.30 తగ్గిస్తున్నట్లు ఫ్లెక్సీలు కట్టారు. ఏళ్ల తరబడిగా చికెన్ వ్యాపారం చేస్తున్న వ్యాపారులు ఈ ఫ్లెక్సీలను చూసి తట్టుకోలేకపోతున్నారు. పట్టణంలో గడచిన నాలుగైదేళ్లుగా వీరి మధ్య పోటీ బాగా పెరిగింది. ఒకరిని చూసి ఒకరు అన్నట్టుగా అందరూ తగ్గింపు ధరలకే ఇస్తున్నారు. అంతేకాదు తగ్గింపు ధరతో పాటు కిలో చికెన్ కొంటే అర డజను కోడిగుడ్లు ఉచితం అనే మరో ఆఫర్ పెట్టారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో చికెన్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆదివారం రోజైతే టన్నుల కొద్దీ విక్రయాలు సాగుతాయి. రోజూ హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు ఆర్డర్‌పై సరఫరా చేస్తుంటారు. అలాగే ఫంక్షన్లు, పండుగలు, పెళ్లిళ్లకు పెద్ద ఎత్తున చికెన్ సరఫరా చేస్తారు. కొందరు వ్యాపారులైతే ఎక్కువ మొత్తంలో చికెన్ ఆర్డర్ చేస్తే డోర్ డెలివరీ కూడా చేస్తారు. శనివారం రాష్ట్రంలో డ్రెస్స్‌డ్ చికెన్ ధర కిలోకు రూ.220 ఉండగా, కామారెడ్డిలో రూ.180కి విక్రయించారు. అంటే కిలోకు రూ.40 వరకు తగ్గించారు. కొన్ని చోట్ల కిలో ధర రూ.170కి కూడా అమ్మారు. అయితే కొందరు బడా వ్యాపారుల వల్ల సాధారణ చిరు వ్యాపారులు నష్టపోతున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు.