Telangana: అత్యాచారం చేసిన వ్యక్తిని కొట్టి పంపిస్తే అతడిని దేవుడు అనుకుంది.. కానీ ఆ నీచుడు
కఠిన చట్టాలు తీసుకువస్తున్నా.. కామాంధుల వక్రబుద్ధి మాత్రం మారటం లేదు. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు రెచ్చిపోతున్నారు. పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
కామాంధులు మారడం లేదు. మహిళ కనిపిస్తే చాలు విరుచుకుపడుతున్నారు. చిన్నా, పెద్ద.. వావి వరసలు ఏమీ లేదు. రాక్షసుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వికారాబాద్ జిల్లా(vikarabad district) పూడూరు మండల పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. బుధవారం రాత్రి అన్నం తిని.. బయటకు వచ్చిన 15 ఏళ్ల మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే బాలికను తీసుకెళ్లడం గమనించిన ఓ యువకుడు అడ్డుకోవడానికి వెళ్లాడు. అయితే సభ్య సమాజం తలదించుకునే విధంగా అతడు కూడా ఆ బాలికపై అత్యాచారానికి యత్నించాడు. బాలిక తప్పించుకుని కుటుంబీకులకు చెప్పడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే… బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటి బయట నిల్చున్న ఓ బాలికను అదే గ్రామానికి చెందిన చింటు అనే యువకుడు గమనించాడు. ఆమె నోరు మూసి ఇంటి వెనుక మామిడి తోటలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన మరో యువకుడు చాకలి రవి.. అక్కడికి వెళ్లి చింటును కొట్టి అక్కడి నుంచి పంపించాడు. రవి చేసిన సహాయానికి ఆ బాలిక థ్యాంక్స్ చెప్పి.. ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే రవి.. ఉన్మాదిలా వ్యవహరించాడు. కనీస మానవత్వం లేకుండా బాధితురాలిపై అత్యాచారానికి యత్నించాడు. షాక్‌కు గురైన బాలిక.. అక్కడి నుంచి పారిపోయి ఇంటికి చేరుకుంది. తల్లిదండ్రులతో రోదిస్తూ జరిగింది చెప్పింది. దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేశారు. దారుణానికి ఒడిగట్టిన యువకులను అదుపులోకి తీసుకున్నారు. బాలికను చికిత్స కోసం తాండూరు(Tandur) గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు.