బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తగిలింది. తెలంగాణ లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో చేరికలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని తన నివాసంలో కలిసారు. కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దమయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి అనంతరం అనేక రాజకీయ పరిణామాలు మారాయి. బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో కొందరు, బీజేపీలోకి కొందరు చేరిపోయారు. వీరికి ఆయాపార్టీలు లోక్ సభ సీటు కూడా కేటాయించాయి. ప్రస్తుతం ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆయా అభ్యర్థులు ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే లోక్ సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన రెండవ రోజు బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది.
నెలరోజుల క్రితమే రాజేందర్‌నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. శుక్రవారం ఉదయం రేవంత్ రెడ్డితో భేటీ అయిన ప్రకాష్ గౌడ్, కాంగ్రెస్‌పార్టీలో చేరేందుకు సిద్దయ్యారు. శనివారం అనుచరులతో కలిసి ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. మొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రకాష్ గౌడ్ చేరిక అంశం రాజకీయంగా కీలక చర్చనీయాంశమైంది. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో తనతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్నారు కేసీఆర్. అయితే తాజాగా జరిగిన పరిణామాలు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..