ఖమ్మం గుమ్మం సాక్షిగా కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వితంతువులు, వృద్ధులకు రూ. 4వేల పెన్షన్‌ను అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఆదివాసీలకు పోడు భూమలు పంపిణీ చేస్తామన్నారు. ఆదివారం జనగర్జన పేరుతో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ఎన్నికల మానిఫెస్టోను ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వితంతువులు, వృద్ధులకు రూ. 4వేల పెన్షన్‌ను అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ బీ టీమ్‌ల మధ్య ప్రధాన పోరు ఉంటుందని, తెలంగాణలో బీజేపీ అడ్రస్ లేకుండా పోయిందని రాహుల్ పేర్కొన్నారు. ‘భారత్ జోడో యాత్ర తెలంగాణకు రావడం ఎంతో సంతోషకరంగా ఉంది. నా యాత్రను విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాత్రలో దేశాన్ని కలిపే విషయమే అందరితో మాట్లాడాను. మన ఐడీయాలజీ కేవలం దేశాన్ని కలపడం మాత్రమే. దేశమంతా భారత్ జోడో యాత్రకు మద్దతుగా నిలిచింది. యాత్ర ద్వారా దేశంలో ద్వేషాన్ని, విద్వేషాన్ని దూరం చేసే ప్రయత్నం చేశాం’ అని రాహుల్ తెలిపారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన పొంగులేటిని రాహుల్ అభినందించారు. అలాగే పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేపట్టిన భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. ఇక బీఆర్‌ఎస్ ప్రభుత్వంతో పులిలా పోరాడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రాహుల్ తెలిపారు. ‘ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కంచుకోట, ప్రతిసారి మమ్మల్ని ఆదరించింది. ఇక బీఆర్‌ఎస్ అంటే బీజేపీ రిస్తేదార్ పార్టీ. బీఆర్‌ఎస్ బీజేపీకి బీటీమ్‌గా మారిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి తన జాగీరు అనుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు రూపాయల అవినీతి జరిగింది. ధరణి పోర్టల్ సమస్యలను యాత్రలో తెలుసుకున్నాను. కేసీఆర్ హయాంలో రైతులు, ఆదివాసీలు, యువత, దళితులు అందరూ నష్టపోయారు. మోడీ చేతిలో కేసీఆర్ రిమోట్ ఉంది. సీఎం కేసీఆర్ అవినీతికి ప్రధాని మోడీ అండదండలున్నాయి.తెలంగాణలోనూ కర్ణాటక తరహా ఫలితాలు వస్తాయి. అధికారంలోకి వస్తే సమాజంలోని అన్ని వర్గాలను ఆదుకుంటాం. గిరిజనులకు పోడు భూములు ఇస్తాం. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను కచ్చితంగా ఓడిస్తాం. కార్యకర్తలే కాంగ్రెస్‌కు వెన్నెముక. మీరు బీఆర్ఎస్‌ను సులభంగా ఓడించగలరు’ అంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు రాహుల్
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..