Ponguleti Srinivas Reddy: ముఖ్యమంత్రి నేతృత్వంలోని తెలంగాణ సర్కార్‌పై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఖమ్మం వేదికగా జూలై 2న జరగనున్న సభను అడ్డుకునేందుకు కేసీఆర్ సర్కార్ ప్రయత్నిస్తుందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యే ఆ సభ జరగకుండా బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని, ఆ సభకు వెళ్తే పథకాలు కట్ చేస్తమని ప్రజలను బెదిరిస్తున్నారని పొంగులేటి ఆరోపించారు.
ఇంకా సభ నేపథ్యంలో ఆర్‌టీసీ బస్సులను ఇవ్వకుండా వేధిస్తున్నారని, ప్రైవేట్ వాహనాలు కూడా రాకుండా చెక్‌పోస్ట్‌లు పెట్టారని బీఆర్ఎస్ నాయకులపై పొంగులేటి శ్రీనివాసరావు పలు ఆరోపణలు చేశారు. అయితే బీఆర్ఎస్ నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ సభను సక్సెస్ చేస్తామని తేల్చి చెప్పారు పొంగులేటి.
కాగా, ఇటీవల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ద్వయం ఖమ్మం వేదికగా తాము హస్తం పార్టీలో చేరతామని.. అందుకోసం నిర్వహించే సభకు రాహుల్ గాంధీ రావాలని ఆహ్వానించారు. జూలై 2న జరిగే ఈ సభలోనే పొంగులేటి, జూపల్లి సహా నిజామాబాద్ మాజీ ఎమ్మెల్సీ అరికెలా నర్సారెడ్డి, ఇతర నేతలు గుర్నాథ్ రెడ్డి, ముద్దప్పా దేశ్ ముఖ్, కిష్టప్ప వంటి పలువురు రాజకీయ నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..