
దళిత బంధు పథకం పై ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతు న్నాయి.దళితుల సంక్షేమం కోసం ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం పై జిల్లాలో చాలా చోట్ల అవకతవకలు జరిగాయి అని, ప్రజలు, దళితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దళిత బంధు రగడ నడుస్తుంది. అందుకే వైఎస్ ఆర్ పార్టీ అధినేత షర్మిల కూడా ఇక్కడికి రావాలని అనుకుంది..అసలైన అర్హులకు, నిరుపేదలకు కాకుండా ధనవంతులకు, అన్నీ ఉన్నవారికి తాము చెప్పినట్టు నడుచుకునే వారికే అధికారులు, ప్రజాప్రతినిధులు దళిత బంధుని మంజూరు చేస్తున్నారనీ, నిరుపేదలు ఏమైపోవాలి అని చాలా చోట్ల ర్యాలీలు నిర్వహిస్తూ, స్థానిక ప్రజాప్రతినిధుల దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు.
ఈ దళిత బంధు పథకంతో తమలో తమకే గొడవలు పెడుతు న్నారని, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, సంగారెడ్డి, పటాన్చెరు, ఆందోల్, జిన్నారం నియోజకవర్గాలలో దళితులంతా రోడ్లపైకి వచ్చి దళిత బందును వ్యతిరేకిస్తున్నారు..వీరికి పలువురు ప్రతిపక్ష నేతలు మద్దతు పలుకుతున్నారు. మొన్నటి వరకు అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూమ్ల్ కేటాయించలేదని ధర్నాలు చేశారు. అది క్రమేపి తగ్గగానే ప్రస్తుతం దళిత బంధు నిరసనలు తెరమీదకు వచ్చాయి. అర్హులందరికీ ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు అర్హులకు మద్దతు తెలుపుతూ ప్రతి చోట నిరసన కార్యక్రమాలను చేపడు తున్నారు. ప్రతి చోట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, దళిత బంధు పారదర్శకంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో దాదాపు 50 కుటుంబాలు ఉంటే,దళిత బంధు కేవలం 10 కుటుంబాలకు మాత్రమే అందిస్తున్నారని, ఆ పది కుటుంబాలు కూడా ప్రజా ప్రతినిధుల కనుసనల్లో మెలిగే వారికే తమ అనుకూలంగా ఉన్న వారికే అందిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.. దళితబంధు ఆర్థికసాయం ధనికులకే ఇస్తున్నారని సదాశివపేట మండలం మాచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దళితులు సంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో సోమవారం ధర్నా నిర్వహించారు..గ్రామంలో 51 దళిత కుటుంబాలు ఉండగా కేవలం 10 మందికి మాత్రమే దళితబంధు ఇచ్చారని, వారంతా ఉద్యోగులు, వ్యాపారులు, రియల్టర్లేనని ఆరోపించారు. అర్హులను కాదని ఉన్నవారికే దళితబంధు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు..అనర్హులకు సాయం నిలిపివేయాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
అధికార పార్టీ నాయకుల అక్రమాలకు దళితబంధు పథకం కేంద్రంగా మారిందని. దళితబంధు పేరిట మరోసారి దళితులను మోసం చేస్తున్నారని,దళితబంధు పూర్తిగా అధికార పార్టీ జేబు పథకంగా మారిందన్నారు. అర్హులను కాదని కేవలం బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులకే సాయం పేరిట రూ.10 లక్షలు ఇస్తున్నారని ఆరోపించారు..పథకాల పేరుతో కేవలం బీఆర్‌ఎస్ నాయకులకు ప్రజల సొమ్మును దోచిపెడు తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. మరో వైపు అల్లదుర్గం మండల కేంద్రలోని 120 దళిత కుటుంబాలు ఉండగా ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న 8 కుటుంబాలకే దళితబంధు సాయం అందజేస్తున్నారని ఆరోపించారు. నిరుపేద కుటుంబాలను పక్కన పెట్టడం పై పది రోజులుగా ఆందోళన చేస్తున్నా అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు.
గ్రామపంచాయతీ తీర్మానం చేసినా స్పందించక పోవడం దారుణమని మండిపడ్డారు. గృహలక్ష్మి పథకం కోసం ఊరంతా దండోరా వేశారని, మరి దళితబంధు కోసం ఎందుకు దండోరా వేయించలేదని ప్రజలు ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామంలో దళిత బందు పథకంలో అవకతవకలు జరిగాయని, నిజమైన అర్హులకు కాకుండా గ్రామంలోని బిఅర్ఎస్ నాయకులు తమ అనుచరులకు ఇస్తున్నారని ఆరోపిస్తూ, గ్రామంలోని రోడ్డు పై ధర్నా నిర్వహించి అనంతరం కేసీఅర్ దిష్టి బొమ్మను దహనం చేశారు.గ్రామంలో సుమారు 400 వరకు దళిత కుటుంబాలు ఉండగా గ్రామానికి కేవలం 20 దళిత బందు కేటాయించారని, అవి కూడా బిఅర్ఎస్ నాయకులే తీసుకుంటే మా పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తంచేశారు.గ్రామ సర్పంచ్ కు తెలియకుండా,గ్రామంలో ఎలాంటి గ్రామ సభ నిర్వహించకుండా ఎవరికి తెలియకుండా కేటాయించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పటాన్ చెరు నియోజకవర్గంలో పెద్దఎత్తున దళిత బంధు నిరసన ర్యాలీ నిర్వహించారు. పెద్దఎత్తున పాల్గొన్న దళితులకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెల్పింది. నియోజక వర్గంలో గత వారం రోజులుగా జరుగుతున్న దళిత బంధు నిరసనలకు ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత కుటుంబాలకు, దళిత బంధు ఇవ్వాలని,డిమాండ్ చేస్తూ పటాన్ చెర్ లో పెద్ద ఎత్తున్న నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. దళితులు, కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, వినతిపత్రం అందజేసారు..దళిత ద్రోహి ముఖ్యమంత్రి కేసీఆర్ అని, అధికార పార్టీకి చెందిన దళితులకు మాత్రమే దళిత బంధు పథకానికి ఎంపిక చేయడం సరైంది కాదన్నారు, నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఒక్క కుటుంబానికి దళిత బంధు ఆర్థిక సహాయం అందించే వరకు కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాలు చేస్తుందన్నారు. ఇలా ప్రతి రోజు దళిత బంధుపైన ఏదో ఒక నియోజకవర్గంలో ఇలా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..