AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch video: మానవత్వాన్ని ప్రశ్నిస్తున్న ఘటన.. తాత మృతదేహం ముందే ఆస్తి పంచాయితీ!

కన్నప్రేమ.. కుటుంబ బంధాలు.. మానవీయ విలువలు.. ఇవన్నీ ఆస్తి ముందు వెలవెలబోయాయి. ఇంటి పెద్ద మరణిస్తే కుటుంబ సభ్యులంతా ఒక్కటై కన్నీటి వీడ్కోలు పలకాల్సిన వేళ.. ఆయన మృతదేహం ముందే ఆస్తి కోసం వాదులాటకు దిగిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కడసారి వీడ్కోలు పలకాల్సిన సమయంలోనూ ఆస్తి, వారసత్వం చుట్టూ వివాదం చెలరేగడం స్థానికులను విస్మయానికి గురిచేసింది..

Watch video: మానవత్వాన్ని ప్రశ్నిస్తున్న ఘటన.. తాత మృతదేహం ముందే ఆస్తి పంచాయితీ!
Property Dispute Erupts Before Grandfather Funeral
G Sampath Kumar
| Edited By: |

Updated on: Oct 15, 2026 | 10:12 AM

Share

వేములవాడ, అక్టోబర్ 15: వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు కోనాయిపల్లికి చెందిన కొంకటి చంద్రయ్య (80) సోమవారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన భార్య పోచవ్వ, ఏకైక కుమారుడు నాగరాజు కొన్నేళ్ల క్రితమే మరణించారు. చంద్రయ్యకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మరణించిన కుమారుడు నాగరాజుకు ఇద్దరు భార్యలు కాగా.. మొదటి భార్యకు ఒక కుమారుడు, రెండో భార్యకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం చంద్రయ్య పేరిట గ్రామంలో ఓ ఇల్లు, సుమారు ఎకరంన్నర వ్యవసాయ భూమి ఉన్నాయి. వృద్ధాప్యంలో ఉన్న చంద్రయ్యకు నాగరాజు రెండో భార్య, ఆమె కుమార్తెలు సేవలు చేసి పోషించారు. చంద్రయ్య మృతితో కుటుంబంలో విషాదం నెలకొనాల్సి ఉండగా.. అంత్యక్రియలు ఎవరు నిర్వహించాలనే అంశం వివాదానికి దారితీసింది. ఇన్నాళ్లూ తామే వృద్ధుడికి సేవలు చేశామని, తామే అంత్యక్రియలు నిర్వహించి తలకొరివి పెడతామని చంద్రయ్య కుమారుడు నాగరాజు రెండో భార్య, ఆమె కుమార్తెలు పట్టుబట్టినట్లు తెలిసింది. మరోవైపు చంద్రయ్య కుమార్తెలు దీనికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సంప్రదాయం ప్రకారం మనవడు అయిన మొదటి భార్య కుమారుడికి తలకొరివి పెట్టే అవకాశం ఇవ్వాలని కొందరు అన్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

అంత్యక్రియల నిర్వహణపై మొదలైన వివాదం ఆస్తుల అంశంతో ముడిపడటంతో పరిస్థితి మానవత్వాన్ని మరిపించింది. తలకొరివి పెట్టే హక్కు తమకే దక్కాలంటూ ఇరువర్గాలు పట్టుబట్టడంతో మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించడంలో జాప్యం జరిగినట్లు తెలిసింది. గంటల తరబడి మృతదేహం ఇంట్లోనే ఉండగా.. కుటుంబ సభ్యులు తమ వాదనలకే ప్రాధాన్యమివ్వడం స్థానికంగా చర్చకు దారితీసింది. ఆస్తి కోసం ఇంతటి వివాదం అవసరమా అంటూ గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తికి సేవలు చేయడం ఎంత ముఖ్యమో.. ఆయన మరణానంతరం గౌరవప్రదంగా అంతిమ వీడ్కోలు పలకడం కూడా అంతే ముఖ్యం. అయితే కుటుంబ బంధాల కంటే ఆస్తులే ముఖ్యమనేలా సాగిన ఈ వివాదం మానవీయ విలువలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. తాతకు ఎవరు తలకొరివి పెట్టాలన్న సంప్రదాయపరమైన అంశం ఒకవైపు ఉంటే.. ఆయన పేరిట ఉన్న ఇల్లు, వ్యవసాయ భూమి వారసత్వం మరో అంశం. అంత్యక్రియలు నిర్వహించడం వల్లే ఆస్తిపై హక్కు లభిస్తుందనే భావనకు చట్టపరమైన ఆధారం ఉందని భావించకూడదని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. ఆస్తి హక్కులు వర్తించే చట్టాలు, కుటుంబ సంబంధాలు, వీలునామా వంటి అంశాల ఆధారంగా నిర్ణయించబడతాయి.

ఇవి కూడా చదవండి

మనిషి సంపాదించిన ఆస్తులు చివరకు ఇక్కడే మిగిలిపోతాయి. కానీ ఆయన చూపిన ప్రేమ, కుటుంబానికి అందించిన అనుబంధాలు మాత్రం జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. అలాంటి వ్యక్తి చివరి ప్రయాణంలోనైనా కుటుంబ సభ్యులు విభేదాలను పక్కనపెట్టి గౌరవంగా వీడ్కోలు పలకాల్సి ఉండగా.. మృతదేహం ముందే వివాదానికి దిగడం బాధాకరం. ఆస్తి కోసం పోరాటం చేయడం కంటే మానవత్వానికి విలువనివ్వాలనే సందేశాన్ని ఈ ఘటన సమాజానికి అందిస్తోంది.

Follow Us