AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2027: ముంబై కొత్త కెప్టెన్ ఎవరవుతారు? పాండ్యా స్థానంలో తెరపైకి వస్తున్న పేర్లు ఇవే

IPL 2027: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పుపై జోరుగా చర్చ సాగుతోంది. హార్దిక్ పాండ్యా స్థానంలో రోహిత్ శర్మ మళ్లీ పగ్గాలు చేపడతారా లేక యువ సంచలనం తిలక్ వర్మకు అవకాశం దక్కుతుందా అనేది వేచి చూడాలి.

IPL 2027: ముంబై కొత్త కెప్టెన్ ఎవరవుతారు? పాండ్యా స్థానంలో తెరపైకి వస్తున్న పేర్లు ఇవే
Mumbai Indians
Rakesh
|

Updated on: Oct 15, 2026 | 9:40 AM

Share

IPL 2027: ఐపీఎల్ 2027 సీజన్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ (MI) శిబిరంలో కెప్టెన్సీ మార్పు గురించిన చర్చలు తారాస్థాయికి చేరాయి. ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మ స్థానంలో బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఫ్రాంచైజీలో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. ప్రస్తుతం హార్దిక్ స్థానంలో జట్టును ఎవరు నడిపిస్తారనే అంశంపై మేనేజ్‌మెంట్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ అనుభవంపై మళ్లీ నమ్మకం ఉంచాలా లేక యువ బ్యాటర్ తిలక్ వర్మకు భవిష్యత్తు బాధ్యతలు అప్పగించాలా అనేదానిపై తీవ్ర కసరత్తు జరుగుతోంది.

పాండ్యా హయాంలో నిరాశ

గతంలో గుజరాత్ టైటాన్స్ జట్టును ఛాంపియన్‌గా నిలిపిన హార్దిక్ పాండ్యాను 2024లో ముంబై ఇండియన్స్ భారీ అంచనాలతో కెప్టెన్‌గా నియమించింది. అయితే ఆ సీజన్‌లో ముంబై జట్టు పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. ఆ తర్వాత 2025లో ప్లేఆఫ్స్ వరకు చేరినప్పటికీ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో నిష్క్రమించింది. ఇక 2026 సీజన్‌లోనూ ఆశించిన ప్రదర్శన కనబరచలేక ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ మూడు సీజన్లలో జట్టు ప్రదర్శన నిలకడగా లేకపోవడంతోనే మేనేజ్‌మెంట్ నాయకత్వ మార్పు వైపు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

రోహిత్ శర్మ అనుభవమే శ్రీరామరక్ష?

ఫ్రాంచైజీలో ఒక వర్గం మాత్రం రోహిత్ శర్మను మళ్లీ కెప్టెన్‌గా తీసుకురావాలని గట్టిగా కోరుకుంటోంది. రోహిత్ నాయకత్వంలోనే ముంబై ఇండియన్స్ 2013, 2015, 2017, 2019, 2020 సంవత్సరాల్లో ఛాంపియన్‌గా నిలిచింది. ఒత్తిడిని జయించడంలో ఆయనకున్న సామర్థ్యం, ఆటగాళ్లపై ఉండే పట్టు జట్టుకు ఎంతో ప్రయోజనకరంగా మారుతాయని భావిస్తున్నారు. అయితే రోహిత్ వయసు 40 ఏళ్లకు చేరువవుతుండటం ఒక్కటే మేనేజ్‌మెంట్‌ను వెనకడుగు వేయిస్తోంది. ఒకవేళ ఆయన్ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించి, యువ ఆటగాడు తిలక్ వర్మకు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగిస్తే భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

భవిష్యత్తు కోసం తిలక్ వర్మ వైపు చూపు?

మరోవైపు మేనేజ్‌మెంట్‌లోని మరొక వర్గం మాత్రం యువ ఆటగాడు తిలక్ వర్మకు దీర్ఘకాలిక బాధ్యతలు అప్పగించాలని ప్రతిపాదిస్తోంది. ఇటీవల దేశీయ క్రికెట్ అలాగే అంతర్జాతీయ వేదికలపై కీలక మ్యాచ్‌లలో తిలక్ ప్రదర్శించిన పరిణితి అందరినీ ఆకట్టుకుంది. ఒత్తిడి పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోకుండా బ్యాటింగ్ చేసే తత్వం అతని సొంతం. ఒకవేళ తిలక్ వర్మకు ఇప్పుడు పగ్గాలు అందిస్తే వచ్చే ఐదారు సంవత్సరాల పాటు జట్టును విజయవంతంగా నడిపించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దులీప్ ట్రోఫీలో సారథ్యం వహించిన అనుభవం కూడా అతనికి కలిసొచ్చే అంశం.

సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా ఆప్షన్లు

రోహిత్, తిలక్ కాకుండా టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా పేర్లు కూడా రేసులో వినిపిస్తున్నాయి. సూర్యకు అంతర్జాతీయ స్థాయిలో నాయకత్వ అనుభవం ఉన్నప్పటికీ, ఆయన వయసు, ఫామ్ దృష్ట్యా దీర్ఘకాలిక ఆలోచన చేయాల్సి ఉంటుంది. మరోవైపు బుమ్రా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నా, ఫాస్ట్ బౌలర్ కావడంతో వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా కెప్టెన్సీ భారంగా మారుతుందనే వాదన ఉంది. ఏదేమైనా ఐపీఎల్ 2027 వేలానికి ముందే ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ క్యాప్టెన్సీ విషయంలో ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం క్రికెట్ సర్కిళ్లలో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us