AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్.. 686 ఉద్యోగాలకు నవంబర్ 9న పూర్తి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఏపీపీఎస్సీ (APPSC) మరో తీపికబురు అందించింది. జాబ్ క్యాలెండర్‌లో భాగంగా ఇప్పటికే 892 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయగా, తాజాగా మరో 1466 పోస్టుల భర్తీకి 10 ప్రాథమిక నోటిఫికేషన్లను జారీ చేసింది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ సమయానికి ఖాళీలు, రిజర్వేషన్లు, విద్యార్హతలతో కూడిన పూర్తి స్థాయి నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ ఇన్‌ఛార్జ్‌ ఛైర్మన్‌ శశిధర్‌ వెల్లడించారు..

APPSC గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్.. 686 ఉద్యోగాలకు నవంబర్ 9న పూర్తి నోటిఫికేషన్
APPSC Group 2 Notification
Srilakshmi C
|

Updated on: Oct 15, 2026 | 8:18 AM

Share

అమరావతి, అక్టోబర్ 15: తాజాగా విడుదల చేసిన ప్రాథమిక నోటిఫికేషన్లలో గ్రూప్ 2 ఉద్యోగాలు కీలకంగా ఉన్నాయి. వివిధ శాఖల్లో కలిపి మొత్తం 686 గ్రూప్ 2 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను నవంబర్ 9న విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రూప్ 2కు సిద్ధమవుతున్న అభ్యర్థులు పోస్టుల వారీగా ఖాళీలు, విద్యార్హతలు, రిజర్వేషన్లు, దరఖాస్తుల తేదీలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక ప్రకటనలో పరిశీలించాల్సి ఉంటుంది.

గ్రూప్-2 పరీక్ష విధానం ఇదే

గ్రూప్-2 ఎంపిక ప్రక్రియలో భాగంగా స్క్రీనింగ్ పరీక్షను 150 మార్కులకు నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు కేటాయించడంతో మెయిన్స్ మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షల తేదీలు, సిలబస్, దరఖాస్తుల ప్రారంభం, చివరి తేదీ వంటి వివరాలను పూర్తిస్థాయి నోటిఫికేషన్‌లో వెల్లడించనున్నారు.

  • స్క్రీనింగ్ పరీక్ష: 150 మార్కులు
  • మెయిన్స్ పేపర్-1: 150 మార్కులు
  • మెయిన్స్ పేపర్-2: 150 మార్కులు
  • మెయిన్స్ మొత్తం: 300 మార్కులు

ఇతర శాఖల్లోనూ ఉద్యోగాలు

ఏపీపీఎస్సీ గ్రూప్ 2తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో మరిన్ని ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ ప్రాథమిక నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటిలో అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబ్ సూపరింటెండెంట్, రాయల్టీ ఇన్‌స్పెక్టర్, కెమికల్ ఎగ్జామినర్, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ తదితర పోస్టులు ఉన్నాయి. అలాగే డైట్ లెక్చరర్లు, ఎస్‌జీటీలు, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు వంటి విద్యాశాఖకు సంబంధించిన పోస్టుల భర్తీకి కూడా ప్రకటనలు జారీ అయ్యాయి. ఆయా విభాగాల్లో ఖాళీల సంఖ్య, అర్హతలు, నియామక నిబంధనలపై పూర్తి నోటిఫికేషన్లలో స్పష్టత రానుంది. నాన్‌ యూనిఫాం ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిని 44 ఏళ్ల వరకు సడలించారు. రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం అదనపు వయోపరిమితి సడలింపులు వర్తించనున్నాయి. వయస్సును లెక్కించేందుకు జూలై 1వ తేదీని ప్రామాణికంగా తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే అభ్యర్థులు తాము దరఖాస్తు చేసే పోస్టుకు వర్తించే వయోపరిమితి, అర్హతలు, ఇతర నిబంధనలను సంబంధిత పూర్తిస్థాయి నోటిఫికేషన్‌లో తప్పనిసరిగా పరిశీలించాలి.

అభ్యర్థులు ఏం చేయాలి?

ఏపీపీఎస్సీ తాజా ప్రకటనలతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా గ్రూప్-2 అభ్యర్థులు స్క్రీనింగ్ పరీక్షతో పాటు మెయిన్స్ పరీక్షకు కూడా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా సిద్ధమవడం మంచిది. పోస్టుల వారీగా ఖాళీలు, విద్యార్హతలు, రిజర్వేషన్లు, దరఖాస్తుల తేదీలు వంటి వివరాల కోసం ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలి. ప్రాథమిక నోటిఫికేషన్‌ను మాత్రమే ఆధారంగా చేసుకుని దరఖాస్తు వివరాలపై నిర్ణయం తీసుకోకుండా, పూర్తి స్థాయి ప్రకటన విడుదలైన తర్వాత అర్హతలను నిర్ధారించుకోవాలి.

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగాల ఖాళీలు

  • పురపాలక కమిషనర్ గ్రేడ్-3 పోస్టుల సంఖ్య: 6
  • సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-2 పోస్టుల సంఖ్య: 7
  • డిప్యూటీ తహసీల్దార్ పోస్టుల సంఖ్య: 200
  • గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్ అధికారి (జీఎస్టీ) పోస్టుల సంఖ్య: 40
  • సహాయ రిజిస్ట్రార్ (కోఆపరేటివ్ సొసైటీస్) పోస్టుల సంఖ్య: 10
  • డిప్యూటీ ఎంపీడీఓ పోస్టుల సంఖ్య: 176
  • సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎక్సైజ్) పోస్టుల సంఖ్య: 29
  • సహాయ సెక్షన్ అధికారి (జీపీడీ) పోస్టుల సంఖ్య: 71
  • సహాయ సెక్షన్ అధికారి (ఆర్థిక శాఖ) పోస్టుల సంఖ్య: 5
  • సహాయ సెక్షన్ అధికారి (న్యాయ శాఖ) పోస్టుల సంఖ్య: 4
  • సీనియర్ అకౌంటెంట్ (ట్రెజరీ) పోస్టుల సంఖ్య: 90
  • జూనియర్ అకౌంటెంట్ (ట్రెజరీ) పోస్టుల సంఖ్య: 48

ఇతర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు, దరఖాస్తు తేదీలు

  • సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్ పోస్టులు 503: దరఖాస్తుల తేదీలు నవంబర్ 2–22
  • డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ పోస్టులు 6: దరఖాస్తుల తేదీలు నవంబర్ 2–22
  • సహాయ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ పోస్టులు 5: దరఖాస్తుల తేదీలు నవంబర్ 2–22
  • సహాయ సంచాలకుడు (మైన్స్) పోస్టులు 1: దరఖాస్తుల తేదీలు నవంబర్ 6–26
  • టెక్నికల్ అసిస్టెంట్ (మైన్స్) పోస్టులు 36: దరఖాస్తుల తేదీలు నవంబర్ 6–26
  • రాయల్టీ ఇన్‌స్పెక్టర్ (మైన్స్) పోస్టులు 9: దరఖాస్తుల తేదీలు నవంబర్ 6–26
  • ల్యాండ్ సర్వేయర్ (మైన్స్) పోస్టులు 1: దరఖాస్తుల తేదీలు నవంబర్ 6–26
  • సహాయ కెమికల్ ఎగ్జామినర్ (ఎక్సైజ్) పోస్టులు 9: దరఖాస్తుల తేదీలు నవంబర్ 6–26
  • సహాయ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు 50: దరఖాస్తుల తేదీలు నవంబర్ 6–26
  • డైట్ లెక్చరర్ పోస్టులు 104: దరఖాస్తుల తేదీలు నవంబర్ 18–డిసెంబర్ 8
  • ఎస్‌ఎల్‌టీ లెక్చరర్ పోస్టులు 10 : దరఖాస్తుల తేదీలు నవంబర్ 18–డిసెంబర్ 8
  • డైట్ సీనియర్ లెక్చరర్ పోస్టులు 46: దరఖాస్తుల తేదీలు నవంబర్ 18–డిసెంబర్ 8

Follow Us