AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంటలను కాపాడండి.. సాకులు చెబితే వేటే.. విద్యుత్ కోతలపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆగ్రహం..

విద్యుత్ అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కరెంట్ ఉత్పత్తి పెంచకపోవడం, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఏర్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్‌నినోను కోవిడ్ తరహా విపత్తుగా భావించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో తాగునీరు, పశుగ్రాసం ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు సీఎం.

పంటలను కాపాడండి.. సాకులు చెబితే వేటే.. విద్యుత్ కోతలపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆగ్రహం..
Telangana CM Revanth Reddy
Shaik Madar Saheb
|

Updated on: Oct 15, 2026 | 9:10 AM

Share

తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతుల పంటలు ఎండిపోకుండా రేయింబవళ్లు విద్యుత్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంటలు చేతికొచ్చే వరకు విద్యుత్ కోతలు లేకుండా చూడాలన్నారు. వచ్చే 20 రోజులు పంటలకు అత్యంత కీలకమని, ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ కొరత కారణంగా రైతులు పంట నష్టపోకూడదని హెచ్చరించారు. వ్యవసాయానికి విద్యుత్ అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అందుకు అనుగుణంగా సరఫరా పెంచాలని సూచించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం, విద్యుత్, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలవారీగా ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా సాఫీగా జరిగేలా చూడాలని పలుమార్లు ఆదేశించినా పరిస్థితిలో మార్పు ఎందుకు రావడం లేదని అధికారులను నిలదీశారు. రాబోయే రోజుల్లో విద్యుత్ కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నప్పటికీ ఉత్పత్తిని పెంచేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నైనీ, మహానది నుంచి బొగ్గు సరఫరాకు లింకేజీ ఏర్పాట్లు చేసినా యాదాద్రి విద్యుత్ ప్లాంట్‌లో పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి ఎందుకు జరగడం లేదని ఆరా తీశారు. రైతుల పంటలను కాపాడేందుకు అవసరమైన విద్యుత్ సరఫరా చేయాలని ఎన్నిసార్లు చెప్పినా పరిస్థితి మారలేదని.. ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలను సహించేది లేదన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదఅని అవసరమైతే విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్, జెన్‌కో సీఎండీ.. సంబంధిత విభాగపు ఐఏఎస్ లను సస్పెండ్ చేస్తానని తీవ్రంగా హెచ్చరించారు. విద్యుత్ అంతరాయాలకు రోజుకో కారణం చెప్పవద్దని.. ప్రజలకు నిరంతర విద్యుత్ కొనసాగాలని ఆదేశించారు.

ఎల్‌నినోను కోవిడ్ తరహా విపత్తుగా పరిగణించాలి..

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై సీఎంకు అధికారులు నివేదిక ఇచ్చారు. ఎల్‌నినోను కోవిడ్ తరహా విపత్తుగా పరిగణించి అన్ని ప్రభుత్వ శాఖలు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు సీఎం రేవంత్. ఇప్పుడు సాధారణ సమస్యగా కనిపిస్తున్నా… ముందస్తు చర్యలు తీసుకోకపోతే తీవ్ర సంక్షోభంగా మారే ప్రమాదం ఉందని అలర్ట్ చేశారు. అన్ని శాఖల అధికారులు తమ పరిధిలో ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేయాలి, సమస్యలను అధిగమించేందుకు పరిష్కార మార్గాలను గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు సీఎం రేవంత్. మళ్లీ వానలు వచ్చే వరకు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు.

తాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు

వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సరఫరా సజావుగా సాగేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మాణ రంగంతో పాటు ఇతర అవసరాలకు ఎస్టీపీలు శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎల్‌నినోతో పశువులకు పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు ప్రతి మండలానికి గ్రూప్–1, గ్రూప్–2 స్థాయి అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆయా మండలాల్లో వర్షాభావ పరిస్థితులు, విద్యుత్, తాగునీటి సరఫరా, పంటలు, పశుగ్రాసం లాంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించే బాధ్యతలను వారికి అప్పగించాలని సూచించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు CSకు నివేదించాలని సూచించారు. ఎల్‌నినో ఒక విపత్తని, దీని ప్రభావం, రాబోయే సంక్షోభ పరిస్థితులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు సీఎం. రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలతో పాటు.. కళాజాత బృందాలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆదేశించారు.

Follow Us