AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: 40 రోజుల్లో 4 సంచలన ఘటనలు.. ఆదిలాబాద్ రిమ్స్‌లో అసలేం జరుగుతుంది..?

వరుస ఘటనలతో ఆదిలాబాద్ రిమ్స్ అభాసుపాలవుతోంది. పసికందుల నుంచి యువకుల వరకు ప్రాణాలు కోల్పోతున్నా.. ఏకంగా పట్టపగలే ప్రాణాలు నిలపాల్సిన ఆస్పత్రిలోని వెంటిలేటర్లు చోరీకి గురవుతున్న రిమ్స్ యాజమాన్యం మొద్దు నిద్ర వీడటం లేదు. కింది స్థాయి సిబ్బంది నుండి రిమ్స్ డైరక్టర్ వరకు అందరిది ఒకటే తీరు. నిర్లక్ష్యం నిర్లక్ష్యం పర్యవేక్షణ లోపం. భద్రత డొల్లా.. అన్నీ కలిసి రిమ్స్ లో కొండంత శని అన్నట్టుగా మారింది. అసలింతకి రిమ్స్ లో ఈ దుస్థితి ‌కారణం ఎవరు. వరుస ఘటనల పై భాద్యత ఎవరిది.

Telangana: 40 రోజుల్లో 4 సంచలన ఘటనలు.. ఆదిలాబాద్ రిమ్స్‌లో అసలేం జరుగుతుంది..?
Adilabad Rims Ventilator Theft
Naresh Gollana
| Edited By: |

Updated on: Nov 05, 2026 | 4:01 PM

Share

ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి.. ఉమ్మడి జిల్లా ప్రజలకు పెద్ద దిక్కుగా ఉండాల్సిన ప్రభుత్వ వైద్యశాల. పేద, మధ్యతరగతి ప్రజలు మెరుగైన వైద్యం కోసం ఆశగా వచ్చే ఈ ఆస్పత్రిలో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవైపు వైద్య సేవల్లో నిర్లక్ష్యం ఆరోపణలు.. మరోవైపు ఆస్పత్రి నిర్వహణలో లోపాలు.. ఇంకోవైపు భద్రతా వైఫల్యాలు.. వెరసి రిమ్స్ పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెల వ్యవధిలో చోటుచేసుకున్న వరుస ఘటనలు ఆస్పత్రిలో పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నాయో ప్రశ్నిస్తున్నాయి. సెప్టెంబర్ 23న రిమ్స్‌లోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు నవజాత శిశువులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మరో 22 మంది శిశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించగా, ఏడుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. చిన్నారులకు ప్రాణాలు పోయాల్సిన వైద్యశాలలో అగ్నిప్రమాదం ఐదుగురు పసికందుల ప్రాణాలను బలిగొనడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన ఆస్పత్రిలో అగ్నిమాపక భద్రత, విద్యుత్ నిర్వహణ, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సన్నద్ధతపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది.

తల్లి.. కడుపులోని కవలల మృతి..

ఈ విషాదం మరువకముందే అక్టోబర్ 28న మరో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఏడు నెలల గర్భిణి బి.సునీత వైద్యం కోసం రిమ్స్‌కు రాగా.. అత్యవసర చికిత్స అందించడంలో నిర్లక్ష్యం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. చివరకు ఆమెతో పాటు కడుపులో ఉన్న కవల శిశువులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఒకే ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేసింది. వైద్యుల అందుబాటు, అత్యవసర వైద్య సేవలు, రోగుల పర్యవేక్షణపై మరోసారి చర్చ మొదలైంది.

తేలు కాటు.. వైద్యుల తీరుపై ఆరోపణలు

అక్టోబర్ 29న తేలు కాటుకు గురైన కాంబ్లే రాహుల్ అనే యువకుడు చికిత్స కోసం రిమ్స్‌కు వచ్చాడు. అయితే తనకు సరైన వైద్యం అందించలేదని, వైద్యులు తనను బెదిరించారని అతడు ఆరోపించినట్లు సమాచారం. ఈ పరిణామాల అనంతరం రాహుల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపణలు రావడంతో ఆస్పత్రి వైద్య సేవలపై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనలో జరిగిన పరిణామాలు, బాధ్యతలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆస్పత్రిలోనే వెంటిలేటర్ల చోరీ

ఇన్ని ఘటనలతో రిమ్స్‌పై విమర్శలు వెల్లువెత్తుతుండగానే అక్టోబర్ 30న మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. రోగులకు అత్యవసరంగా ఆక్సిజన్ అందించేందుకు ఉపయోగించే నాలుగు వెంటిలేటర్లు ఆస్పత్రిలోనే చోరీకి గురయ్యాయి. రెండో అంతస్తులోని పల్మనాలజీ విభాగం పరిధిలో ఉన్న ఆర్ఐసీయూ, చెస్ట్, సార్కో, టీబీ వార్డుల నుంచి ఈ పరికరాలను దుండగులు ఎత్తుకెళ్లారు. మధ్యాహ్నం 2.37 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు వెంటిలేటర్లను సంచుల్లో పెట్టుకుని తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఒక్కో వెంటిలేటర్ విలువ సుమారు రూ.8 లక్షల వరకు ఉండగా.. నాలుగు పరికరాల విలువ దాదాపు రూ.35 లక్షలుగా అంచనా వేస్తున్నారు. ఆస్పత్రిలో రోగులు, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఉన్న సమయంలోనే ఈ చోరీ జరగడం విస్మయం కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా ఆ సమయంలో రెండో అంతస్తుతో పాటు మొదటి అంతస్తు, గ్రౌండ్ ఫ్లోర్‌లో కలిపి 36 మంది సెక్యూరిటీ సిబ్బంది, మరో వంద మంది అవుట్‌సోర్సింగ్ సిబ్బంది విధుల్లో ఉన్నట్లు సమాచారం. అయినప్పటికీ దొంగలు ఎలాంటి అడ్డంకి లేకుండా నాలుగు వెంటిలేటర్లను తీసుకెళ్లడం భద్రతా వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటపెడుతోంది.

ఇంటి దొంగల సహకారం ఉందా..?

ఈ చోరీ వెనుక ఆస్పత్రి సిబ్బందిలో ఎవరి సహకారమైనా ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంటిలేటర్లను సంచుల్లో పెట్టుకుని తీసుకెళ్తున్నా ఎవరూ ప్రశ్నించకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. పైగా ఆస్పత్రిలోని ఆయా విభాగాల్లో 24 గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉండాల్సి ఉన్నప్పటికీ ఈ ఘటన జరగడం పర్యవేక్షణ లోపాన్ని ఎత్తిచూపుతోంది. ఆ సమయంలో వార్డుల్లో సిబ్బంది ఏం చేస్తున్నారు? సెక్యూరిటీ గార్డులు ఎందుకు అడ్డుకోలేదు? పరికరాలను తీసుకెళ్తున్న వ్యక్తులను ఎవరూ ఎందుకు ప్రశ్నించలేదు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే రిమ్స్‌లో ద్విచక్ర వాహనాలు, ఇతర వార్డుల్లో చోరీలు జరిగినట్లు సమాచారం. ఏడాది క్రితం ఎంఐసీయూ విభాగంలోనూ ఓ వెంటిలేటర్ చోరీకి గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్ని ఘటనలు జరుగుతున్నా భద్రతా వ్యవస్థలో మార్పు రాకపోవడం గమనార్హం.

రంగంలోకి ఐదు ప్రత్యేక బృందాలు..

వెంటిలేటర్ల చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుల కదలికలను పరిశీలిస్తున్నారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన వారై ఉంటారని అనుమానిస్తున్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం వెలువడింది. అయితే చోరీ వెనుక ఎవరెవరి ప్రమేయం ఉందన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

మార్పు ఎప్పుడు..? బాధ్యత ఎవరిది..?

ఒకదాని తర్వాత ఒకటిగా జరుగుతున్న ఘటనలు రిమ్స్‌లో వైద్య సేవలు, పర్యవేక్షణ, భద్రతా వ్యవస్థలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పసికందుల ప్రాణాలు పోయినా.. గర్భిణి, కవల శిశువులు మృత్యువాత పడినా.. యువకుడి ఆత్మహత్య కలకలం రేపినా.. ఇప్పుడు లక్షల రూపాయల విలువైన ప్రాణాధార పరికరాలు చోరీకి గురైనా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ఆస్పత్రిలోనే ప్రాణాధార పరికరాలకు భద్రత లేకపోతే ఇక సామాన్య రోగుల పరిస్థితి ఏంటి? వైద్యుల విధుల పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారు? సిబ్బంది బాధ్యతలను ఎవరు సమీక్షిస్తున్నారు? సెక్యూరిటీ వ్యవస్థ ఉన్నా దొంగతనాలు ఎలా జరుగుతున్నాయి? గత ఘటనలపై తీసుకున్న చర్యలేంటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.

రిమ్స్‌లో మారాల్సింది కేవలం సిబ్బంది కాదు.. మొత్తం వ్యవస్థ. ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం, విచారణకు ఆదేశించడం కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలి. అప్పటి వరకు రిమ్స్‌కు పట్టిన శని వదలడం కష్టం. పేదోడికి పెద్దాస్పత్రిలో రిమ్స్ లో భరోసా కలగడం కష్టమే.

Follow Us
40 రోజుల్లో 4 సంచలన ఘటనలు.. ఆదిలాబాద్ రిమ్స్‌లో ఏం జరుగుతుంది..?
40 రోజుల్లో 4 సంచలన ఘటనలు.. ఆదిలాబాద్ రిమ్స్‌లో ఏం జరుగుతుంది..?
ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలే.. అయినా ఘనవిజయం..
ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలే.. అయినా ఘనవిజయం..
ఇంట్లోనే నేచురల్ ఫ్లోర్ క్లీనర్ తయారు చేయడం ఎలా? మార్బుల్, టైల్స్
ఇంట్లోనే నేచురల్ ఫ్లోర్ క్లీనర్ తయారు చేయడం ఎలా? మార్బుల్, టైల్స్
రెండో వన్డేలో హైదరబాదీ ఎంట్రీ.. ఆ బౌలర్‌ సీటు గల్లంతు?
రెండో వన్డేలో హైదరబాదీ ఎంట్రీ.. ఆ బౌలర్‌ సీటు గల్లంతు?
ఎవరికి వారే యమునా తీరే.. ఈ సామెత అసలు అర్థం తెలుసా..?
ఎవరికి వారే యమునా తీరే.. ఈ సామెత అసలు అర్థం తెలుసా..?
నీ దోషం పోగొడతా.. సంతోషం తెస్తా అన్నాడు.. ఆమె నమ్మింది.. అంతే..
నీ దోషం పోగొడతా.. సంతోషం తెస్తా అన్నాడు.. ఆమె నమ్మింది.. అంతే..
అమ్మమ్మల కాలం నాటి పెసరపప్పు హల్వా.. నోట్లో వేసుకుంటే వెన్నలా
అమ్మమ్మల కాలం నాటి పెసరపప్పు హల్వా.. నోట్లో వేసుకుంటే వెన్నలా
పోలింగ్ కేంద్రంలో గుండెను కలిచే ఘటన..!
పోలింగ్ కేంద్రంలో గుండెను కలిచే ఘటన..!
ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. ఫోన్‌‌లో ఫ్లైట్ మోడ్‌ వల్ల..
ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. ఫోన్‌‌లో ఫ్లైట్ మోడ్‌ వల్ల..
దీపావళి కాలుష్యం నుంచి ఊపిరితిత్తులను ఎలా కాపాడుకోవాలి?డాక్టర్ల
దీపావళి కాలుష్యం నుంచి ఊపిరితిత్తులను ఎలా కాపాడుకోవాలి?డాక్టర్ల