రాత్రంతా పొలాల్లో టెన్షన్ టెన్షన్.. రైతన్నల మాస్టర్ ప్లాన్.. ఎలా దొరికారో తెలుసా..?
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలో వరుస బోరు మోటార్ వైర్ల చోరీలతో విసిగిపోయిన రైతులు స్వయంగా నిఘా పెట్టారు. రాత్రివేళ పొలాల్లో కాపలా కాస్తూ ఎనిమిది మంది దొంగల ముఠాను గుర్తించారు. వారిలో ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇప్పటివరకు సుమారు 150 మంది రైతుల పొలాల్లో చోరీలు జరగడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వ్యవసాయ పొలాల్లో వరుస దొంగతనాలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు దొంగలు మరింత నష్టాలకు గురి చేస్తున్నారు. వ్యవసాయ పొలాల వద్ద బోర్ మోటార్లు చోరీ చేస్తూ కష్టాలు పెడుతున్నారు. దీంతో రోజురోజుకూ పెరుగుతున్న చోరీలతో విసిగిపోయిన రైతులు చివరకు అందరూ కలిసి రంగంలోకి దిగారు. రాత్రివేళ పొలాల్లో కాపలా కాస్తూ దొంగల కోసం నిఘా పెట్టారు. ఓ వ్యవసాయ పొలం వద్ద మోటార్ వైర్లు కట్ చేస్తుండగా దొంగల ముఠాను చుట్టుముట్టి ఆట కట్టించారు.
జోగులాంబ గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మండలం పరిధిలోని పలు గ్రామాల వ్యవసాయ పొలాల్లో కొంతకాలంగా బోరు మోటార్ వైర్ల దొంగతనాలు జరుగుతున్నాయి. వ్యవసాయ బోర్ల వద్ద ఉన్న మోటార్ పంపు సెట్లను బయటకు తీసి.. వాటిలోని విలువైన కాపర్ వైర్లను కట్ చేసి ఎత్తుకెళ్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 150 మంది రైతుల పొలాల్లో మోటార్ వైర్లు చోరీకి గురైనట్లు చెబుతున్నారు అన్నదాతలు. ఈ ఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా దొంగతనాలు ఆగలేదు. దీంతో వరుస చోరీలతో నష్టపోతున్న రైతులు ఇక ఉపేక్షించకూడదని నిర్ణయించుకున్నారు. దొంగలను పట్టుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగాలని నిశ్చయించుకున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి ప్రతి రోజూ రాత్రి దొంగల కోసం కాపు కాస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అదే సమయంలో ఆటోలో వచ్చిన ఎనిమిది మంది దొంగలు ఓ పొలం వద్ద బోరు మోటార్‌ను బయటకు తీసి కాపర్ వైర్లు కట్ చేస్తున్నారు. అప్పటికే నిఘా పెట్టిన రైతులు ఒక్కసారిగా వారిని చుట్టుముట్టారు. దొంగల ముఠాలో ఆరుగురు అక్కడి నుంచి పారిపోగా.. ఇద్దరు రైతులకు చిక్కారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆటోతో పాటు కట్ చేసిన కాపర్ వైర్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇక దొంగతనాలకు సంబంధించిన వీడియోలు, ఇతర ఆధారాలను సైతం పోలీసులకు అందించినట్లు రైతులు చెబుతున్నారు. అయితే పట్టుబడిన వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్లో గుర్తుతెలియని వ్యక్తులుగా పేర్కొనడంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆధారాలు అందించినప్పటికీ ఇలా నమోదు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. దొంగతనాల వెనుక ఉన్న ముఠాపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మోటార్ వైర్లు చోరీ కావడంతో బోర్లు పనిచేయక మూడు, నాలుగు రోజులుగా పంటలకు నీరందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దొంగతనాలతో ఆర్థికంగా నష్టపోగా.. ఇప్పుడు నీరు అందక పంటలు ఎండిపోతుండటంతో మరింత ఆందోళన చెందుతున్నారు.
