AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఒక్కరోజు కూడా ప్రచారానికి వెళ్లలే.. అయినా బంపర్ మెజార్టీతో విజయం..

రోడ్డు ప్రమాదంలో కాలికి గాయమై మంచానికే పరిమితమైన టీడీపీ అభ్యర్థి దాచర్ల వెంకట రమణయ్య.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండానే ఘన విజయం సాధించారు. ఒంగోలు కార్పొరేషన్ 9వ డివిజన్ నుంచి 2,728 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. కుటుంబ సభ్యులు, బంధువులు, కార్యకర్తలు ఆయన తరఫున ప్రచారం చేయగా.. ఆయన ఫోన్‌లో ఓటర్లను అభ్యర్థించారు.

Andhra: ఒక్కరోజు కూడా ప్రచారానికి వెళ్లలే.. అయినా బంపర్ మెజార్టీతో విజయం..
Dacherla Venkata Ramanaiah
Ram Naramaneni
|

Updated on: Nov 05, 2026 | 3:59 PM

Share

ఎన్నికల్లో గెలవాలంటే ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలి. ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించాలి. కానీ ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ అభ్యర్థి మాత్రం ఇవేమీ చేయకుండానే ఘన విజయం సాధించారు. ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితమైనా.. ఓటర్లు మాత్రం ఆయనకు భారీ మెజారిటీతో పట్టం కట్టారు. ఒంగోలు కార్పొరేషన్‌లోని 9వ డివిజన్ నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి దాచర్ల వెంకట రమణయ్య ఈ అరుదైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ప్రమాదంతో ఆగిన ప్రచారం

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందే వెంకట రమణయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆయన కాలికి గాయమైంది. వైద్యులు కాలికి కట్టు కట్టి రెండు వారాల పాటు బయటకు వెళ్లవద్దని సూచించారు. ఇదే సమయంలో కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. 9వ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా రమణయ్యకు అవకాశం లభించింది.

నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ ఆయన నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనను మోసుకుంటూ వెళ్లి నామినేషన్ దాఖలు చేయించారు. అయితే గాయం కారణంగా ఎన్నికల ప్రచారానికి మాత్రం ఆయన దూరంగా ఉండాల్సి వచ్చింది.

మంచం మీద నుంచే ఓటర్లకు ఫోన్లు

రమణయ్య తరఫున కుటుంబ సభ్యులు, బంధువులు, టీడీపీ కార్యకర్తలు డివిజన్‌లో ప్రచారం నిర్వహించారు. ఆయన మాత్రం మంచానికే పరిమితమైనప్పటికీ తన వంతు ప్రయత్నం చేశారు. ఫోన్ ద్వారా ఓటర్లను సంప్రదిస్తూ తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనకపోయినా ఓటర్లు ఆయనకు అండగా నిలిచారు.

ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి రమణయ్య 2,728 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో ఆయన గెలుపు స్థానికంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రానికి బంధువులు, స్నేహితుల సాయంతో చేరుకున్న ఆయన.. ఎన్నికల విజయానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.

ఒంగోలులో కూటమి ఆధిపత్యం

మరోవైపు ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. కూటమి తరఫున టీడీపీ మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన నల్లిమిల్లి శ్రీశిల్ప 37,626 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 62 డివిజన్లలో కూటమి 48 స్థానాలను కైవసం చేసుకోగా.. వైఎస్సార్‌సీపీ 11 డివిజన్లకే పరిమితమైంది.

ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధించారు. వీరిలో కూటమి రెబల్స్‌గా పోటీ చేసిన వారు కూడా ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన అంకసాల రంగనాయకులు ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ సమక్షంలో పార్టీలో చేరడంతో కూటమి బలం 49కి చేరింది.

ఇలా ఒకవైపు ఒంగోలు కార్పొరేషన్‌పై కూటమి పట్టు సాధించగా.. మరోవైపు ప్రచారానికి వెళ్లలేని పరిస్థితుల్లోనూ 9వ డివిజన్‌లో వెంకట రమణయ్య సాధించిన విజయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Follow Us