AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sangareddy: నీకు దోషం ఉంది.. అందుకే ఇన్ని కష్టాలు అన్నాడు.. కట్ చేస్తే..

కుటుంబంలో దోషాలు ఉన్నాయని, ప్రత్యేక పూజలు చేస్తే సమస్యలు తొలగిపోతాయని నమ్మించిన గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళను మోసం చేశారు. పూజల పేరుతో ఆమె నుంచి 9 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.45 వేల నగదును తీసుకుని పరారయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలో చోటుచేసుకుంది.

Sangareddy: నీకు దోషం ఉంది.. అందుకే ఇన్ని కష్టాలు అన్నాడు.. కట్ చేస్తే..
Superstition Fraud (Representative image )
P Shivteja
| Edited By: |

Updated on: Nov 05, 2026 | 3:47 PM

Share

కుటుంబంలో దోషాలు ఉన్నాయని.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తే కష్టాలన్నీ తొలగిపోయి మంచి జరుగుతుందని నమ్మించారు. ఆ మాటలతో ఓ మహిళను బురిడీ కొట్టించి బంగారు ఆభరణాలు, నగదుతో ఉడాయించారు. మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుని సాగించిన ఈ మోసం సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

సిర్గాపూర్ మండల పరిధిలోని ఉజలంపాడ్ గ్రామానికి బుధవారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు భిక్షాటన చేసుకుంటూ వచ్చారు. తాము పూజలు చేసే బాబాలమంటూ గ్రామస్తులకు పరిచయం చేసుకున్నారు. ఈ క్రమంలో యాదవరావు ఇంటికి వెళ్లి ఆయన భార్యతో మాటలు కలిపారు.

ఆమెకు దోషం ఉందని, అందువల్లే కుటుంబంలో సమస్యలు ఎదురవుతున్నాయని నమ్మబలికారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తే దోషాలు తొలగిపోయి కుటుంబానికి మంచి జరుగుతుందని మాయమాటలు చెప్పారు. వారి మాటలు నమ్మిన మహిళ పూజలు చేసేందుకు అంగీకరించింది.

పూజా కార్యక్రమానికి బంగారు ఆభరణాలు, నగదు అవసరమని వారు చెప్పడంతో.. ఆమె తన వద్ద ఉన్న 9 గ్రాముల బంగారు నగలు, రూ.45 వేల నగదును వారికి అప్పగించింది. ఇదే అదనుగా భావించిన దుండగులు ఆమె దృష్టి మరల్చి బంగారం, నగదుతో అక్కడి నుంచి పరారయ్యారు.

కొద్దిసేపటి తర్వాత తాను మోసపోయినట్లు గుర్తించిన మహిళ కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. బాధితురాలి భర్త యాదవరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామానికి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తుల వివరాలు, వారు వెళ్లిన మార్గాలపై ఆరా తీస్తున్నారు.

ప్రజలకు పోలీసుల సూచన

దోషాలు తొలగిస్తామని, పూజలతో అదృష్టం మారుస్తామని చెప్పే గుర్తుతెలియని వ్యక్తులను నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు. పూజలు, పరిహారాల పేరుతో ఎవరైనా బంగారం, నగదు అడిగితే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారు.

Follow Us