Telangana: అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు.. ఎలా బయటపడిందంటే..?

ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీ రాకెట్‌ను అధికారులు బట్టబయలు చేశారు. ఈ వ్యవహారంలో ఏకంగా 35 మంది ఇన్-సర్వీస్ అభ్యర్థులపై వేటు వేయడంతో పాటు అక్రమాలకు సహకరించిన నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ వర్సిటీ వీసీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసలు ఈ స్కామ్ ఎలా బయటపడింది..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Telangana: అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు.. ఎలా బయటపడిందంటే..?
Professor Jayashankar Agriculture University Paper Leak

Edited By:

Updated on: Jan 08, 2026 | 11:16 PM

ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా సాగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై వర్సిటీ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో ఇన్-సర్వీస్ కోటాలో బీఎస్సీ (అగ్రికల్చర్) చదువుతున్న 35 మంది అభ్యర్థులను డిస్మిస్ చేయడంతో పాటు అక్రమాలకు సహకరించిన నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఇతర అధికారులతో కలిసి జగిత్యాల వ్యవసాయ కళాశాలను సందర్శించారు. అక్కడ రికార్డులను పరిశీలించగా సీసీ ఫుటేజీని తనిఖీ చేయగా సెమిస్టర్ ఫైనల్ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నట్లు ప్రాథమికంగా అనుమానం కలిగింది. దీనిపై సమగ్ర విచారణకు ముగ్గురు అధికారులతో కూడిన కమిటీని నియమించగా విచారణలో దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

వ్యవసాయ శాఖలో ఏఈఓలుగా పనిచేస్తూ, ఇన్-సర్వీస్ కోటా కింద వర్సిటీలో మూడవ సంవత్సరం బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న సుమారు 35 మంది అభ్యర్థులు ఈ కుట్రకు తెరలేపినట్లు కమిటీ నిర్ధారించింది. వర్సిటీ సిబ్బంది సహకారంతో ప్రశ్నపత్రాలను ముందే సంపాదించారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇతర కళాశాలల విద్యార్థులకు ప్రశ్నపత్రాలను చెరవేస్తున్నరు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు అధికారులు గుర్తించారు. ఈ తంతు గత కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోందని కమిటీ నివేదికలో తెలిపింది. ఈ కుంభకోణాన్ని తీవ్రంగా పరిగణించిన రిజిస్ట్రార్, వైస్ ఛాన్సలర్ కఠిన చర్యలకు ఆదేశించారు. లీకేజీకి సహకరించిన ఒక ఉన్నతాధికారితో సహా నలుగురు సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేశారు. అక్రమాలకు పాల్పడిన 35 మంది ఇన్-సర్వీస్ అభ్యర్థుల ప్రవేశాలను రద్దు చేసి, వారిని తిరిగి వ్యవసాయ శాఖకు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రక్షాళనే లక్ష్యం: వీసీ అల్దాస్ జానయ్య

2014 నుంచి 2024 వరకు వర్సిటీలో పూర్తిస్థాయి అధికారులు లేకపోవడం వల్లే ఇలాంటి అవకతవకలు జరిగాయని వీసీ జనయ్య మండిపడ్డారు. విశ్వవిద్యాలయ ప్రతిష్టను దెబ్బతీసే ఎవరినీ వదిలిపెట్టమని.. అవసరమైతే ఈ కేసును సైబర్ క్రైమ్ విభాగానికి అప్పగిస్తామన్నారు. పరీక్షా విధానంలో ఆధునిక సాంకేతికతను జోడించి సమూల మార్పులు తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..