Telangana: ఘోర ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టి 150 మీటర్లు ఈడ్చుకెళ్లిన ట్రావెల్స్‌ బస్సు! తాత, మనవరాలు మృతి

|

Sep 16, 2024 | 8:43 AM

జగిత్యాల జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాఠశాలకు సోమవారం సెలవు కావడంతో కుమార్తె పిల్లలు బైక్‌పై తీసుకుని తన ఇంటికి తీసుకెళ్తున్న ఓ తాతను బస్సు రూపంలో మృత్యువు కబలించింది. అటుగా వచ్చిన ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ అతివేగంగా వీరి బైక్‌ను ఢీ కొట్టింది. అనంతరం తాత, మనవరాలను 150 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి..

Telangana: ఘోర ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టి 150 మీటర్లు ఈడ్చుకెళ్లిన ట్రావెల్స్‌ బస్సు! తాత, మనవరాలు మృతి
Private Travel Bus Accident
Follow us on

జగిత్యాల, సెప్టెంబర్ 16: జగిత్యాల జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాఠశాలకు సోమవారం సెలవు కావడంతో కుమార్తె పిల్లలు బైక్‌పై తీసుకుని తన ఇంటికి తీసుకెళ్తున్న ఓ తాతను బస్సు రూపంలో మృత్యువు కబలించింది. అటుగా వచ్చిన ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ అతివేగంగా వీరి బైక్‌ను ఢీ కొట్టింది. అనంతరం తాత, మనవరాలను 150 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మనవడు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఒక్క ప్రమాదం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మరో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. జగిత్యాల జిల్లా జగిత్యాల గ్రామీణ మండలం పొలాస వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం అల్లీపూర్‌కు చెందిన రైతు బైండ్ల లచ్చన్న (55) కుమార్తె బిడ్డలకు సోమవారం సెలవు కావడంతో మనవడు, మనవరాలిని తన ఇంటికి తీసుకొచ్చేందుకు ధర్మపురికి వెళ్లాడు. మనవరాలు నారవేణి శ్రీనిధి (9), మనవడు మల్లికార్జున్‌ను తీసుకొని ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై గ్రామానికి తిరిగి బయల్దేరాడు. జగిత్యాల గ్రామీణ మండలం పొలాస వద్దకు రాగానే కొండగట్టు నుంచి ధర్మపురికి వెళుతున్న ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఆర్టీసీ బస్సును దాటే క్రమంలో ఎదురుగా వస్తున్న వీరి బైకును బలంగా ఢీకొట్టింది. వీరితో పాటు ముందు వెళ్తున్న మరో బైక్‌ను కూడా బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైండ్ల లచ్చన్న, శ్రీనిధి అక్కడికక్కడే మృతి చెందగా.. వీరి మృతదేహాలను బస్సు 150 మీటర్ల దూరం వరకు ఈడ్చుకు వెళ్లి ఆగింది. ప్రమాదం ధాటికి రోడ్డుపై మృత దేహాలు చెల్లా చెదురుగా పడిపోయి చిద్రమయ్యాయి. తీవ్రంగా గాయపడిన మల్లికార్జున్‌ను జగిత్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమదంలో మరో బైక్‌ను కూడా ఢీకొట్టడంతో జగిత్యాల గ్రామీణ మండలం పొలాసకు చెందిన బదినిపెల్లి నర్సయ్య, బూర్ల రాజన్నలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని కూడా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్‌ నిర్లక్ష్యం మూలంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. జగిత్యాల రూరల్‌ సీఐ కృష్ణారెడ్డి, ఎస్సై సదాకర్‌ ప్రమాద స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు బైండ్ల లచ్చన్న అల్లుడు గల్ఫ్‌లో కార్మికునిగా పనిచేస్తుండగా.. పిల్లల్ని చదివించుకుంటూ కుమార్తె ధర్మపురిలో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.