
గ్రామీణ చేతి వృత్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. చేనేత రంగాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. చేనేత అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆమె చెప్పారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. మూడు ప్రత్యేక హెలికాప్టర్లలో యాదాద్రి జిల్లా పోచంపల్లిని సందర్శించారు.
కేంద్ర చేనేత జౌళి శాఖ ఏర్పాటు చేసిన చేనేత ఔన్నత్యం ప్రతిబింబించే థీమ్ పెవిలియన్‌ను ఆమె సందర్శించారు. ఈ పెవిలియన్‌లో చేనేత మగ్గాలను ఆమె పరిశీలించారు. టై అండ్ డై ఇక్కత్ పట్టు చీరల తయారీనీ పరిశీలించి.. తయారీ విధానాన్ని చేనేత కార్మికులను రాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు. చేనేత వస్త్రాలకు సంబంధించిన ప్రత్యేక స్టాల్స్‌ను ఆమె పరిశీలించారు. స్టాల్స్ వద్ద చేనేత కార్మికులతో మాట్లాడి ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వర రావు, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. పోచంపల్లి చేనేత కళాకారులతో మాట్లాడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్రపతి అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పోచంపల్లి వస్త్రాలకు మంచి గుర్తింపు వచ్చిందని, ఈ ప్రాంతానికి వచ్చి చీరాలు నేసే విధానాన్ని చూడడటం సంతోషంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు.
చేనేత కళను వారసత్వంగా భావితరాలకు అందించడానికి కళాకారులు చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. పోచంపల్లి కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆమె చెప్పారు. తమ ప్రాంతం నుంచి కొందరిని పోచంపల్లి తీసుకువచ్చి ఇక్కడి కళను వారికి నేర్పిస్తామని అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..