ఆరోగ్యమే బాగాలేదు.. రిటైర్‌ అయి మళ్లీ ఎందుకు ఆ పోస్టు? ప్రభాకర్‌ రావు బెయిల్ పిటిషన్‌ విచారణలో వాడీవేడి వాదనలు!

ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు లో వాదనలు జరిగాయి. ప్రభాకర్ రావు తరఫు న్యాయవాది LOC జారీ, రాజీనామా విషయాలను వివరించగా, ప్రభుత్వం అధికార దుర్వినియోగాన్ని ప్రస్తావించింది. ఆరోగ్య పరిస్థితి, అమెరికా ప్రయాణంపైనా ప్రశ్నలు తలెత్తాయి.

ఆరోగ్యమే బాగాలేదు.. రిటైర్‌ అయి మళ్లీ ఎందుకు ఆ పోస్టు? ప్రభాకర్‌ రావు బెయిల్ పిటిషన్‌ విచారణలో వాడీవేడి వాదనలు!
Prabhakar Rao And High Cour

Updated on: Apr 25, 2025 | 7:55 PM

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌ రావు బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టులో వాడీవేడిగా వాదనలు సాగాయి. ప్రభాకర్ రావ్ తరపున న్యాయవాది సురేందర్ రావ్ వాదనలు వినిపించారు. ప్రభాకర్ రావును నిందితుడిగా చేర్చక ముందే ఆయనపై LOC జారీ చేశారని కోర్టుకు వివరించారు. 2023 డిసెంబర్ 4న సాయంత్రం 4 గంటలకు ప్రభాకర్ రావు తన SIB చీఫ్ పోస్ట్ కు రాజీనామా చేశారని, ఆయన రిజైన్ చేసిన తరువాత ఆదేశాలను స్టాఫ్ ఎలా పాటిస్తారని ప్రశ్నించారు. 2023 డిసెంబర్ 2న రివ్యూ కమిటీ ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ట్యాపింగ్ చేసిన ఆధారాలను ధ్వంసం చేశారన్నారు.

ప్రతి ఆరు నెలలకు ఒకసారి రివ్యూ కమిటీ భేటీ అయి ట్యాపింగ్ డీటెయిల్స్‌ నిర్వీర్యం చేసేలా ఆదేశాలిస్తుందని కోర్టుకు వివరించారు సురేందర్ రావు. హైకోర్ట్ జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారనేది పూర్తిగా అవాస్తవమని వాదనలు వినిపించారు. తన క్లెయింట్ ప్రభాకర్ రావు రాష్ట్రానికి ఎంతో సేవ చేశారని, ఎన్నో మెడల్స్ సంపాదించారని చెప్పారు. ఇప్పుడు ప్రభాకర్‌ రావు వయసు 64 ఏళ్లని, ఈ వయసులో ఆయనకు ఇలాంటి ట్రీట్మెంట్ ఇస్తారా? అని అడిగారు. ప్రభుత్వం తరఫున సిద్ధార్ద్ లూత్రా వాదనలు వినిపిస్తూ.. ఎన్ని మెడల్స్ వచ్చినా అధికార దుర్వినియోగానికి పాల్పడితే శిక్షకు అర్హులే అన్నారు.

ఒకవేళ ప్రభాకర్ రావుకు ఆరోగ్యం బాగా లేకుంటే, క్యాన్సర్ పేషెంట్ అయితే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మళ్లీ ఎందుకు SIB పోస్టులో రీ జాయిన్ అయ్యాడని ప్రశ్నించారు. చేసిన తప్పులకు ఆరోగ్యాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకోవాలని చూస్తున్నారని కోర్టుకు వివరించారు. ఆరోగ్యం సహకరించుకుంటే నేరుగా అమెరికాకి వెళ్లకుండా తిరుపతి, చెన్నై మీదుగా అమెరికాకు వెళ్లాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత ప్రభాకర్‌ రావు బెయిల్‌ పిటిషన్‌పై తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది హైకోర్టు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి