Telangana: హాట్‌ టాపిక్‌గా మారిన దుబ్బాక రాజకీయం.. చిచ్చురేపుతోన్న ప్రోటోకాల్‌ రచ్చ..

దుబ్బాక నియోజకవర్గం.. ఇప్పుడు తెలంగాణలో ఈ నియోజకర్గాన్ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం తర్వాత ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పేరు మారుమోగింది. అప్పటి నుంచి ఈ నియోజకవర్గం నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా దుబ్బాకలో ప్రోటోకాల్ రచ్చ రేపుతోంది..

Telangana: హాట్‌ టాపిక్‌గా మారిన దుబ్బాక రాజకీయం.. చిచ్చురేపుతోన్న ప్రోటోకాల్‌ రచ్చ..
DUBBAKA
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Oct 18, 2024 | 5:37 PM

ఈ మధ్య కాలంలో ఆ నియోజకవర్గ రాజకీయం ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. అక్కడ ఉన్న మూడు పార్టీల నేతలు ఢీ అంటే ఢీ అని వ్యవహరిస్తూ. ఎవరికి వారు తగ్గేదేలే అన్నట్లుగా మారడంతో ఆ నియోజచర్గంలో నిత్యం ఏదో ఒక రచ్చ నడుస్తూనే ఉంది. తాజాగా ప్రోటోకాల్ రచ్చతో మరోసారి వార్తల్లోకి వచ్చిందా నియోజకవర్గం. ఇంతకీ ఏంటా నియోజకవర్గం, కథేంటో ఇప్పడు తెలుసుకుందాం..

అప్పటి టీఆర్‌ఎస్‌ పార్టీ ఓటమి మొదలైన దుబ్బాక నియోజకవర్గం ఇప్పుడు పొలిటికల్‌గా హాట్‌ టాపిక్‌గా మారింది. దుబ్బాక రాజకీయం రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. అక్కడ ఏ పార్టీ ప్రోగ్రాం జరిగిన ఎదో ఒక గొడవ జరగడం వార్తల్లోకి ఎక్కడం పరిపాటిగా మారుతోంది. గొడవలు ఎందుకులే మన పని మనం చేసుకుందాం అనే లీడర్ అస్సలు కనిపించడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇక ఇక్కడ ఉన్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందని ఇటీవల జరిగిన సంఘటనలు చూస్తుంటే అర్థమవుతోంది. ఈ మూడు పార్టీల నేతలకు క్షణం కూడా పడడం లేదు. దీంతో ఎవరికి వారు ప్రోగ్రాం చేసుకున్న ఎదో ఒక రకంగా గొడవ జరుగుతూనే ఉంది. ఈ నియోజకవర్గ పరిధిలో ఏ పార్టీ ప్రోగ్రామ్ అయిన జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్న పోలీస్‌లకు టెన్షన్‌ మొదలవుతుంది. ఎప్పుడు ఏ గొడవ జరుగుతుందో అని పోలీసులు సైతం టెన్షన్‌ పడే పరిస్థితి నెలకొంది.

ఇక రానురాను ఈ గొడవలు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రోటోకాల్‌ వివాదం తీవ్ర స్థాయిలోకి వెల్లిందట. మొన్నటికి మొన్న ఇంచార్జ్ మంత్రి కొండా సురేఖ ఓ కార్యక్రమానికి వస్తే కూడా అక్కడ ప్రోటోకాల్ రగడ జరిగింది. నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి సభ వేదిక పైకి ఎక్కగానే బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున్న గొడవకు దిగారు. మరో వైపు బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున్న నినాదాలు చేయడంతో ఇంచార్జ్ మంత్రి కొండా సురేఖ ప్రోగ్రాం మధ్యలో నుండే వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.

కాగా ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభకర్ రెడ్డి.. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇద్దరికి ఒకరు అంటే ఒకరికి అసలు పడడం లేదని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. వీరికి తోడు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కూడా వీరితో ఉప్పు నిప్పు లాగే ఉంటున్నారని, అందుకే ఈ నియోజకవర్గ పరిధిలోని ఈ మూడు పార్టీల కార్యకర్తలు కూడా వారి వారి నేతల తీరుగానే ఉంటున్నారని చర్చ నడుస్తోంది. అందుకే ఇక్కడ ఉన్న మూడు పార్టీల మధ్య ఎప్పుడు ఎదో ఒక గొడవ జరుగుతూనే ఉంది.

మొన్నటికి మొన్న దుబ్బాకలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ నాయకులు అత్యుత్సాహం చూపించారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకుల మధ్య వాగ్వాదం నెలకొని తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దుబ్బాకలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి వస్తున్న విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్‌ నాయకులు ఎమ్మెల్యే కాన్వయ్‌ని అడ్డుకునేందుకు ప్రయత్నించారని, బీఆర్‌ఎస్‌ నాయకులు విమర్శించారు. అంతటితో ఆగకుండా కాంగ్రెస్‌ నాయకులకు పోటీగా రంగంలోకి దిగారు. శివాజీ చౌక్‌ వద్దకు ఎమ్మెల్యే కాన్వయ్‌ వస్తుండగా..కాంగ్రెస్‌ నాయకులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బీఆర్‌ఎస్‌ నాయకులు స్పందిస్తూ కాంగ్రెస్‌కు, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ క్రమంలో కాంగ్రెస్‌ నాయకులు కోడి గుడ్లు విసిరేందుకు ప్రయత్నించారు. పోలీసుల జోక్యంతో రెండు పార్టీల నేతలు అక్కడి నుంచి వెనుదిరిగారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నట్లుగా వ్యవహరిస్తుండటం హాస్యాస్పదంగా మారిందని ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ నాయకులు అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తమవంతుగా పోరాడుతుంటే .. కాంగ్రెస్‌ నాయకులు అడ్డుకునే ప్రయత్నాలు చేయడం సిగ్గు చేటు అని కేపీఆర్‌ విమర్శించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరును ప్రజలు గమనిస్తున్నారన్న ఆయన.. త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కాగా ఒకప్పుడు దుబ్బాక నియోజకవర్గం అంటే చాలా కొద్ది మందికే తెలిసేది కానీ.. రామలింగారెడ్డి మరణంతో వచ్చిన ఉప ఎన్నికలతో దుబ్బాక రాష్ట్ర వ్యాప్తంగా హాట్ నియోజకవర్గంగా మారింది. ఉప ఎన్నికలప్పుడు మొదలైన అగ్గి ఇప్పటి వరకు చల్లారడం లేదని, అప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఉంటే.. ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ బీజీపీ అండ్ కాంగ్రెస్ గా మారిందని చర్చించుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..