Munugode Poll: మునుగోడు కోసం మల్లయుద్ధం..రాజగోపాల్ రెడ్డి దూకుడు.. చండూరులోనే ఇల్లు అద్దెకు తీసుకున్న మంత్రి జగదీష్..
ఉప ఎన్నిక బాధ్యతను భుజాన వేసుకున్న మంత్రి జగదీశ్ రెడ్డి చండూరులోనే మకాం పెట్టారా...? అప్పుడప్పుడూ వచ్చి పోతుంటే పనులు కావని.. పూర్తిగా.. పక్కాగా.. అక్కడే ఉండి అన్నీ చక్కబెడుతున్నారా.. గెలవాలంటే తప్పదు..
మునుగోడు ఉప ఎన్నికల్లో తన పట్టు నిరూపించుకునేందుకు టిఆర్ఎస్ వేస్తున్న ప్లాన్ ఏంటి…? నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలపై సర్కార్ దృష్టి పెట్టిందా…? ఉప ఎన్నిక బాధ్యతను భుజాన వేసుకున్న మంత్రి జగదీశ్ రెడ్డి చండూరులోనే మకాం పెట్టారా…? అప్పుడప్పుడూ వచ్చి పోతుంటే పనులు కావని.. పూర్తిగా.. పక్కాగా.. అక్కడే ఉండి అన్నీ చక్కబెడుతున్నారా.. గెలవాలంటే తప్పదు సార్ అని కార్యకర్తలు కూడా ఆయన వెంటే నడుస్తున్నారు. ఇంతకీ మంత్రి మునుగోడును మేనేజ్ చేయగలరా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. రాజగోపాల్ రెడ్డికి ఈ ఉప ఎన్నిక చావో రేవో అన్నట్లుంది. మరో వైపు అధికార పార్టీ కూడా.. మునుగోడు ఉప ఎన్నికలో గులాబీ జెండాను ఎగరవేసి రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా నిరూపించుకునేందుకు టిఆర్ఎస్ ప్రయత్నిస్తోందట. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ నానా యాతన పడుతుందట. ఇలా మూడు పార్టీలు మునుగోడు కోసం మల్లయుద్ధం చేస్తున్నాయి.
మునుగోడులో అమిత్ షా బహిరంగ సభ తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూకుడు పెంచి వివిధ పార్టీల నుంచి చేరికలకు తెర లేపారు. నియోజకవర్గంలో ఎదుటి పక్షాలకు అవకాశం లేకుండా చేసేందుకు మంత్రి జగదీశ్ రెడ్డి చండూరులోనే మకాం వేశారు. నియోజక వర్గంలో టిఆర్ఎస్ పట్టును కోల్పోకుండా ఉండేందుకు మంత్రి జగదీశ్ రెడ్డి చండూరులో కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ అంతర్గత సమావేశానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గానికి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధులతో మాట్లాడి సమస్యల సమాచారాన్ని సేకరించారట. సీఎం కెసిఆర్ గతంలో ఇచ్చిన హామీలకు సంబంధించి తక్షణమే ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారట.
మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఆలస్యమయ్యే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో స్థానికంగా పట్టు కోల్పోకుండా ఉండేందుకు సీఎం సభకు ముందు ఎమ్మెల్యేలకు కేటాయించిన గ్రామాల్లో రెండు రోజులకు ఒకసారి పర్యటించాలని టిఆర్ఎస్ ప్లాన్ వేసిందట. స్థానిక నాయకులను సమన్వయం చేసుకుంటూ ఓటర్లతో మమేకం కావాలని, ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు..గులాబీ పార్టీ స్కెచ్ వేసిందట. మరోవైపు, మంత్రి జగదీష్ రెడ్డి చండూరులో ఓ పెద్ద ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే మకాం పెట్టారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన నాటి నుంచి నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రి..అందరికీ అందుబాటులో ఉండేందుకే చండూరులో ఉంటున్నారట.
ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు చుక్కలు కనిపిస్తున్నాయి. నోటిఫికేషన్ వచ్చాక ఇంకెంత రాజకీయ వేడి రాజుకుంటుందో.. ఇంతకీ మునుగోడు ఓటరు మనసులో ఏ పార్టీ ఉందో.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం