Huzurabad Bypoll: హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక సమీపిస్తున్నా కొద్ది అక్కడ రాజకీయ రసవత్తరంగా మారుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా ఈటెల రాజేందర్ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా సాగుతున్న ఈ ఎన్నికల ప్రచారంలో నేతల తాజా కామెంట్స్.. మరింత హీట్ పెంచాయి. తాజాగా నియోజకవర్గం పరిధిలోని వీణవంక మండలం నర్సింహులపల్లిలో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ సంచలన కామెంట్స్ చేశారు. ‘‘ఈనెల 13, 14 తేదీలలో నామీద నేనే దాడి చేయించుకుంటా అని మంత్రులు అంటున్నారు. నా మీద దాడికి ఏమైనా కుట్ర చేస్తున్నారేమో..’’ అని తీవ్ర ఆరోపణలు చేశారు.
‘‘నామీద ఒక మంత్రిగారు మాట్లాడుతున్నారు. నేను చేతకాక.. ముఖం చెల్లక.. ఓడిపోతాను అనే భయంతో.. నా కార్యకర్తలతో నేనే ఈ నెల 13, 14 తేదీలలో దాడి చేయించుకొని.. కాళ్లు, చేతులకు కట్లు కట్టుకుని.. నా భార్య కన్నీళ్లు పెట్టుకుంటూ ఊరంతా తిరుగుతూ ఓట్లు అడుగుతారు అని మాట్లాడుతున్నారు. ఇదే చెన్నూరు ఎమ్మెల్యే కూడా కమలాపూర్‌లో మాట్లాడారు. కన్నీళ్లు పెట్టడం ఈటల రాజేందర్‌కి రాదు. అలాంటి పనికిమాలిన పనులు ఈటల చేయడు. నా మీద దాడి చేయడానికి ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారేమో అని అనుమానాలు వస్తున్నాయి. మాజీ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఇద్దరు గన్‌మెన్లు ఉంటారు. నేను మాజీ మంత్రిని, ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను. నాకు మాత్రం ఒక్కడే గన్‌మెన్ ఉంటాడు. అయినా బయటికి పోవడానికి భయపడే వాడిని కాదు.’’ అని ఈటల సంచలన కామెంట్స్ చేశారు.
సీఎం కేసీఆర్ అబద్ధాల మాటలు పక్కనపెట్టి దళితులకు పది లక్షలు ఇవ్వాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. తాను లేఖ రాశానని దొంగ లేఖలు సృష్టించి.. దళితులకు పది లక్షలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దళితులకు పది లక్షలు ఇచ్చినట్లుగానే.. ఇతర పేదలకు కూడా 10 లక్షలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈటల డిమాండ్ చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని విచ్చలవిడితనానికి తెరలేపారని టీఆర్ఎస్ నాయకులపై ఈటల రాజేందర్ విరుచుకుపడ్డారు. ‘‘ఓటుకి 20 వేలు ఇస్తారట తీసుకోండి. కానీ ఓటు మాత్రం నాకు వేయండి. చెయ్యి ఎత్తగానే ఎర్ర బస్సు ఎలా ఆగుతుందో.. నేను కూడా చెయ్యి ఎత్తగానే ఆగి పనిచేసే వాడిని.’’ అంటూ ప్రజలకు ఈటెల విజ్ఞప్తి చేశారు.
పచ్చని సంసారాల్లో సీఎం కేసీఆర్ చిచ్చు పెడుతున్నారని ఈటల ఫైర్ అయ్యారు. గ్రామాలను దావతులకు అడ్డాలుగా మార్చారని విమర్శలు గుప్పించారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన నాయకులను అంగట్లో సరుకులు కొన్నట్లు కొని ప్రజాక్షేత్రంలో వారిని పలుచన చేస్తున్నారని ఆరోపించారు.
Also read:
AR Murugadoss :ఆ టాలీవుడ్ స్టార్ హీరో కోసం అదిరిపోయే కథను సిద్ధం చేస్తున్న మురగదాస్..
IDBI Bank AM Result 2021: అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..