AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Congress: ఆ గట్టు నుంటారా.. ఈ గట్టు కొస్తారా.. ఎటు తేల్చుకోలేకపోతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ మంత్రి కుమారుడి

మాజీ మంత్రి రత్నాకర్ రావు తనయుడు నర్సింగరావు ప్రయాణం ఎటు? కాంగ్రెస్ లో ఉంటాడా.. వేరే పార్టీ లోకి దుకుతాడా. జగిత్యాల జిల్లాలో రాజకీయంగా ఇదో హాట్‌ టాపిక్‌గా మారింది. ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఎవరు,ఎప్పుడు ఎటువైపు వెళ్తారో అర్థం కాని పరిస్థితి.

Telangana Congress: ఆ గట్టు నుంటారా.. ఈ గట్టు కొస్తారా.. ఎటు తేల్చుకోలేకపోతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ మంత్రి కుమారుడి
Juvvadi Narsinga Rao
Sanjay Kasula
|

Updated on: Dec 12, 2022 | 7:50 PM

Share

జగిత్యాల జిల్లాలో… మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు తనయుడు.. జువ్వాడి నర్సింగరావు వ్యవహారం.. ఇప్పుడిలాంటి చర్చలకే దారి తీస్తోంది. ఆయన రాజకీయ భవిష్యత్తుపై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు.. అన్నట్టుగా పార్టీల్లోకి జంపింగులు చేస్తున్న నర్సింగ్‌ రావు.. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నా.. నమ్మశక్యంగా కనిపించడం లేదట. అసలు పార్టీలో ఉంటారా? మరో పార్టీలోకి షిప్టయిపోతారా? అనే చర్చ జోరుగా నడుస్తోంది. గతంలోనే కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌కు.. టీఆర్‌ఎస్‌ నుంచి మళ్ళీ కాంగ్రెస్‌కు మారిపోయారు. పార్టీలు మారినా.. రాతమారలేదు, గెలుపు తలుపు తట్టలేదు. అందుకే, మళ్లీ పార్టీ మారే ఆలోచనలో నర్సింగరావు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

రత్నాకర్‌రావు వారసత్వం.. ఇంకా దక్కని గెలుపు

జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన జువ్వాడి నర్సింగరావు.. తండ్రి రత్నాకర్‌రావు వారసత్వాన్ని తీసుకున్నా.. విజయతీరాలకు మాత్రం చేరలేకపోతున్నారు. తండ్రి వరుస విజయాలు నమోదు చేస్తే.. ఈయనేమో గెలుపు రుచి చూడలేదు. అందుకే, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే వ్యూహరచన చేస్తున్నారు. అయితే, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కన్నా ముందు రత్నాకర్ రావు… బుగ్గారం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత బుగ్గారంలోని చాలా కొన్ని గ్రామాలు కోరుట్లలో, మరి కొన్ని జగిత్యాలలో కలిశాయి. దీంతో, జువ్వాడి కుటుంబానిది ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. చివరకు, నర్సింగరావు మాత్రం కోరుట్లనే ఎంచుకున్నారు.

అందుకే ఆ పార్టీలో ఉండలేకపోయారు..

2018 ఎన్నికల్లో నర్సింగరావుకు కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో.. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. తరువాత గులాబీ కండువా కప్పేసుకున్నారు. కోరుట్లను టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా మార్చిన విద్యాసాగర్ రావుతో కలిసి.. కారు పార్టీలో ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. మళ్లీ, కాంగ్రెస్‌ గూటికి చేరుకున్న నర్సింగరావు… 2023 లో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, పోటీచేసేది కోరుట్లా? జగిత్యాలా? అనేది తేలాల్సి ఉంది. కోరుట్లలో కాంగ్రెస్ నేత కొమురెడ్డి రాములుతో నర్సింగరావుకు చాలాకాలంగా విభేదాలున్నాయి. దీంతో అక్కడ పోటీచేస్తే.. కాంగ్రెస్ నేతలు ఎంతవరకు సహకరిస్తారనే అనుమానం ఆయణ్ని వెంటాడుతోంది.

కమలంతో టచ్‌లోకి..

ఈ సందిగ్ధంలోనే.. ఇటీవల కమలంతో నర్సింగ్‌రావు టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. కోరుట్ల కాకుంటే.. జగిత్యాలలో అయినా సీటిచ్చేందుకు మేం రెడీ అంటోందట బీజేపీ. జగిత్యాలలో కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డికి తప్ప వేరే వ్యక్తికి టికెట్ ఇచ్చే అవకాశం లేదుకాబట్టి.. అక్కడ పోటీచేయాలనుకుంటే బీజేపీలో చేరడమే సరైన నిర్ణయమని నర్సింగరావు భావిస్తున్నారట. ఒకవేళ కాంగ్రెస్‌లోనే ఉంటూ… కోరుట్ల నుంచి పోటీ చేస్తే మాత్రం… అంతర్గత విభేదాలు ముంచేస్తాయని భయపడుతున్నట్టు తెలుస్తోంది. రోజువారీగా అనుచరులతో సమావేశమవుతున్న ఈ మాజీ మంత్రి తనయుడు.. త్వరలోనే ఏదో ఒక నిర్ణయం ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. లోకల్‌ క్యాడర్‌ కూడా దానికోసమే ఎదురుచూస్తోందట.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం