
కరీంనగర్ జిల్లా చొప్పదండి అసెంబ్లీ సెగ్మెంట్‌లో రాజకీయం… రోజుకో రంగు మారుతోంది. ప్రధాన పార్టీలన్నింటా ఏదో తెలియని కన్ఫ్యూజన్. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సుంకె రవిశంకర్.. ఈసారి బరిలో ఉంటారా? ఉండరా? బీజేపీ తరపున బొడిగె శోభకు అవకాశం ఉంటుందా?లేదా? కాంగ్రెస్ కహానీ ఏంటి? అనే చర్చ లోకల్ పాలిటిక్స్‌లో జోరుగా జరుగుతోంది. అసలిక్కడ రాజకీయం.. అనూహ్యమైన మార్పులు తీసుకున్నది 2018లోనే. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్.. అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బొడిగె శోభను సైడ్ చేసేశారు. ఆమెపై స్థానిక గులాబీ శ్రేణులు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో… సుంకె రవిశంకర్‌కు టిక్కెట్ కేటాయించారు. ఆ తర్వాత బిజెపి కండువా కప్పేసుకున్న శోభ… బీఆర్‌ఎస్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. సుంకె రవిశంకర్, సమీప కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యంపై యాభైవేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. అలా అనూహ్యమైన టర్న్ తీసుకున్న చొప్పదండి రాజకీయం.. ఆ తర్వాత పూర్తిగా మారిపోయింది.
2023 ఎన్నికలు దగ్గరికొస్తున్న దరిమిలా.. మరోసారి ఇక్కడ అధికారపార్టీ సీటుపై… రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. గులాబీ దళపతి.. మరోసారి ఇక్కడ క్యాండిడేట్‌ను మారుస్తారనే ప్రచారం ఊపందుకుంది. రవిశంకర్‌స్థానంలో.. కొత్త వ్యక్తి వస్తారన్న ముచ్చట బలంగా వినిపిస్తోంది. అందుకు తగ్గట్టే.. చాలామంది లోకల్ గులాబీ లీడర్లు… చొప్పదండి టిక్కెట్ ఆశిస్తున్నారు. బోయినపల్లి జడ్పిటిసి భర్త కత్తరపాక కొండయ్య … రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కు అత్యంత సన్నిహితుడు.
ఆవిర్భావం నుంచీ పార్టీలో ఉన్న కొండయ్య… ఆ రూట్‌లో గప్‌చిప్‌గా టిక్కెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే మండలానికి చెందిన ఎంపిపి పర్లపల్లి వేణుగోపాల్, కరీంనగర్ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ సహా మరో ఇద్దరు నేతలు టికెట్‌పై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. దీంతో, ఈసారి మార్పులు చేర్పులు తప్పవన్న గుసగుసలు ఎక్కువయ్యాయి. అయితే, ఎమ్మెల్యే రవిశంకర్ మాత్రం… మరోసారి సిట్టింగులకే ఛాన్సంటూ అధినేత చేసిన ప్రకటనే ఆయుధంగా.. జనాల్లోకి దూసుకెళ్తున్నారు. ఎవరెలాంటి ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రచారాలుచేసినా… మళ్లీ బంపర్ మెజార్టీతో గెలిచేది తానేనంటూ ధీమాగా ఉన్నారు.
గత ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం… మరోసారి బరిలో నిలిచేందుకు సై అంటున్నారు. అప్పుడు గట్టి పోటీ ఇవ్వలేకపోయిన సత్యం… ఆ తర్వాత నుంచీ నియోకవర్గంలోనే మకాం పెట్టి.. మరో దఫా పోటీకోసం సమాయత్తమవుతున్నారు. అయితే, కకావికలంగా మారిన కాంగ్రెస్ నుంచి కూడా టిక్కెట్ కోసం పోటీపెరగడం ఇక్కడ రాజకీయ విశేషం. సత్యంతో పాటు ఎన్ఎస్ఎయుఐ మాజీ నేత నాగెల్లి శేఖర్ కూడా… చొప్పదండి కాంగ్రెస్ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. సత్యంతో పోలిస్తే.. నాగెల్లి శేఖర్ సామాజిక వర్గం ఓట్లు కూడా ఇక్కడ అధికంగా ఉన్నాయ్. సో… అన్ని ఈక్వెషన్సూ లెక్కలేసే హస్తం హైకమాండ్ డెసిషన్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం.
గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మీద కోపంతో బీజేపీలో చేరి కమలం గుర్తుపై పోటీచేసిన బొడిగె శోభ… కేవలం 15వేలు ఓట్లు సాధించారు. అయితే, పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి సీన్ మారింది. చొప్పదండి సెగ్మెంట్‌లో 50వేలకు పైగా ఓట్లు సాధించి.. సత్తా చాటింది బీజేపీ. ఆ తర్వాత కమలంలో జోష్ కూడా పెరగడంతో… ఈసారి కచ్చితంగా గెలవగలననే ధీమాతో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే శోభ. అయితే, కాషాయదళంలోనూ కూడా టిక్కెట్‌వార్ ముదరడంతో గందరగోళం ఏర్పడినట్టు కనిపిస్తోంది. శోభతో పాటు మాజీ ఎంఎల్ఎ సుద్దాల దేవయ్య, మరోనేత లింగంపల్లి శంకర్… ఇక్కడ బీజేపీ తరపున పోటీకి ఆసక్తి చూపుతున్నారు. అయితే, హైకమాండ్ మాత్రం… సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తామని స్పష్టం చేయడంతో… నేతలు తమపని తాము చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రధాన పార్టీలన్నింటి మధ్యా నేనూ ఉన్నానంటోంది బీఎస్పీ. ఇక్కడ బలమైన అభ్యర్థికోసం అన్వేషిస్తోంది.
ఎస్సీ రిజర్వుడుగా ఉన్న ఈ నియోజకవర్గంలో… ఎవరి లెక్కలు వారివే. ఏ పార్టీ ఎత్తుగడలు ఆ పార్టీవే. మొత్తం రెండు లక్షల 27వేల 615 మంది ఓటర్లుంటే… అందులో దాదాపు యాభైవేల ఓట్లు దళితులవే. అందులోనూ మళ్లీ డిఫరెన్సు. మాదిగ వర్గానికి చెందిన ఓట్లు 38వేలకు పైగా ఉంటే… మాల వర్గానికి చెందిన ఓట్లు 8 వేల ఓట్లున్నాయి. ఆ తర్వాత పద్మశాలీల ఓట్లు 25వేలు, ముదిరాజ్ ఓట్లు 20వేలు, గొల్ల కుర్మలు 20వేలు ఉన్నాయ్. ప్రస్తుత ఎంఎల్ఎ సుంకె రవిశంకర్.. మాదిగ వర్గానికి చెందిన వ్యక్తి. సో.. ఈసారి ఏ వర్గం ఎవరికి సపోర్టిస్తుందన్నది కీలకంగా మారింది. గత ఎన్నికల్లో… ఎస్సీ, బీసీ ఓట్లు వన్‌సైడ్‌గా బీఆర్‌ఎస్‌కు పడ్డాయ్. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం.. ఈ వర్గాలన్నీ బీజేపీకి జై కొట్టాయ్. అందుకే, ఈసారి సీన్ ఎలా ఉంటుందనే కన్ఫ్యూజన్ ఏర్పడింది. అందుకే, అధికార బీఆర్‌ఎస్ సహా ప్రధాన పార్టీలన్నీ… గెలుపోటముల మీద ప్రభావం చూపే ఆయా వర్గాలపై గట్టి ఫోకస్ పెట్టాయ్.
రాజకీయ బలాబలాలు సరే… ప్రజా సమస్యల పరిష్కారం మాటేమిటి? అభివృద్ధి సంగతేమిటి? అన్నదే ప్రస్తుతం నియోజకవర్గంలో నడుస్తున్న చర్చ. అయితే, అభివృద్ధిలో చొప్పదండి మందంజలో ఉందంటున్నారు ఎంఎల్ఎ సుంకె రవిశంకర్ అంటున్నారు. 2018లో ఇచ్చిన హామీలన్నీ అమలుచేశానంటున్నారు. మిడ్ మానేరుతో పాటు, నారాయణ పూర్ రిజర్వాయర్ సమస్యలు కూడా తీర్చామంటున్నారు. కొండగట్టు బస్సు ప్రమాద బాధితులందరినీ ఆదుకున్నామన్న రవిశంకర్… మౌళిక వసతులకు పెద్దపీట వేశామని చెబుతున్నారు.
చొప్పదండి నియోజకవర్గంలో ఓ వర్గం ప్రజలు సైతం… ఎమ్మెల్యే మాట కరెక్టే అంటున్నారు. సాగు, తాగు నీటి సమస్య తీరిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో బీడుగా ఉన్న భూములు ఇప్పుడు సస్యశ్యామలంగా మారాయని ఆనందపడుతున్నారు. గతంతో పోలిస్తే.. గ్రామాల్లో మౌళిక వసతులూ పెరిగాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు
అయితే, ప్రతిపక్షాల వెర్షన్ మరోలా ఉంది. 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని అమలు చేయడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారన్నది విపక్షనేతల ఆరోపణ. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించలేదనీ, అది మాటలకే పరిమితమైందనీ విమర్శిస్తున్నారు.
చొప్పదండిలో ప్రధానమైంది నిర్వాసితుల సమస్య. మిడ్ మానేరు నిర్వాసితుకులకు… ఇంకా పూర్తి స్థాయిలో పరిహారం అందలేదు. దీనిపై ఇప్పటికీ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయ్.
ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు బాధితులు. నారాయణాపూర్ రిజర్వాయర్ కింద ఉన్న నారాయణపూర్‌నూ… ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరుతున్నారు స్థానికులు.
కొండగట్టు బస్సు ప్రమాదంలో… సుమారు 60 మంది చనిపోయారు. 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారికి పరిహారం ఇచ్చినా.. మృతుల కుటుంబాల్ని ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఆదుకుంటామన్న హామీ నెరవేరలేదు. తీవ్రంగా గాయపడిన వారికి వైద్యఖర్చులు అంతకంతకూ పెరిగిపోతున్నాయ్. పూర్తిగా మంచానికి పరిమితమైన తమవారికి ప్రభుత్వం మరింత సాయం చేయాలని కోరుతున్నారు.
సంక్షేమపథకాలు పక్కాగా అమలవుతున్నాయ్… పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ రోడ్లు అభివృద్ధి చెందాయి. మౌళిక వసతులకు పెద్దపీట వేసిన ఎమ్మెల్యే.. ఆ దిశగా సక్సెస్సయినట్టే కనిపిస్తోంది. అయితే, భూనిర్వాసితులు, పూర్తికాని డబుల్ బెడ్రూం ఇండ్లు, కొండగట్టు ప్రమాదం బాధితుల తీరనివెతలు.. ఎమ్మెల్యే ట్రాక్ రికార్డులో మైనస్‌గా ఉన్నాయ్. మరి, వచ్చేసారి ఎన్నికల్లో ఈ అంశాలు ఎంతవరకు ప్రభావం చూపుతాయన్నదే ఆసక్తి రేపుతోంది. మొత్తంగా ఇదీ చొప్పదండి నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం