Itlu Mee Niyojakavargam: స్టేషన్ ఘన్‌పూర్‌లో పొలిటికల్ జామ్.. కడియం, తాటికొండ జగడం.. ఎవరికి ప్లస్..
ఇద్దరు ఉద్దండులకు రాజకీయ జన్మనిచ్చిన నియోజవర్గం అది... ఒకప్పటి రాజకీయ విరోధులు ఇప్పుడు ఒకే పార్టీలో కొనసాగుతున్నారు.. కానీ వారి రాజకీయ ప్రయాణం నిత్యం పాము- ముంగీస కథే... మరి అక్కడ ప్రతిపక్ష పార్టీల పరిస్థితి ఏంటి..? అభివృద్ధి ఎలా ఉంది..? విమర్శలు ఎవరికి..?అభివృద్ధి ప్రశంసలు ఎవరి ఖాతాలో..? నిత్యం వార్తల్లో నిలిచే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంపై ఓ లుక్ వేద్దాం..
తెలంగాణలో స్టేషన్ ఘన్‌పూర్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కణ్నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా అధికార బీఆర్‌ఎస్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న డాక్టర్ తాటికొండ రాజయ్యకు… రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రిగా అవకాశం దక్కింది. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన రాజీనామా చేసినా… ఆ తర్వాత ఇదే నియోజకవర్గానికి చెందిన కడియం శ్రీహరిని ఆ పదవి వరించడం విశేషం. ఇద్దరిదీ దళితవర్గమే.. ఇద్దరికీ ఈ నియోజకవర్గమే… అందుకే స్టేషన్ ఘన్‌పూర్.. అప్పట్లో పొలిటికల్‌గా స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. బట్ ఈ ఇద్దరు నేతల వైరమే ఇప్పుడు… అధికారపక్షానికి పెద్ద తలనొప్పిగా మారిందన్న ప్రచారం జరుగుతోంది.
స్టేషన్ ఘన్‌పూర్‌లో అధికార, విపక్షాల మధ్య వైరం కంటే… ఒకే పార్టీలో ఉంటూ కత్తులు దూసుకుంటున్న శ్రీహరి, రాజయ్యల యుద్ధమే ఎక్కువ హైలెట్ అవుతోంది. ఒకప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉంటూ తలపడిన ఈ ఇద్దరు నేతలు… ఇప్పుడు ఒక ఒరలో ఉంటూ కీచులాడుకుంటున్నారు. ఎమ్మెల్యేగా రాజయ్య, ఎమ్మెల్సీగా కడియం… ఎవరికివారే అన్నట్టుగా వ్యవహరిస్తూ గులాబీ దళంలో విజయంపై కొత్త గుబులు పుట్టేలా చేస్తున్నారు. తూకిత్తా.. మై కిత్తా.. అనుకుంటూ సవాళ్లు విసురుకుంటున్న నేతలు.. అసలుకే ఎసరు తెచ్చేలా ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ కీలకనేత, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి… సొంత ఇలాఖాలో బీఆర్‌ఎస్ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం.. కాస్త ఇబ్బందిగానే అనిపిస్తోంది.
2009లో రాజయ్య పొలిటికల్ ఎంట్రీ.. 2012లో గులాబీగూటికి!
పిల్లల వైద్యనిపుణుడిగా ఉన్న రాజయ్య.. 2009లో పొలిటికల్ స్క్రీన్ మీదికొచ్చారు. కాంగ్రెస్ తరపున గెలిచి.. ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకొన్న రాజయ్య.. తెలంగాణ కోసం రాజీనామా చేసి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా వరుస విక్టరీలు కొట్టిన తాటికొండ… ఐదోసారి విజయం సాధించేందుకు సై అంటున్నారు. ఇక్కడే పుట్టా.. ఇక్కడే పెరిగా… చివరివరకు ఇక్కడే ఉంటా.. అంటూ సందు చిక్కినప్పుడల్లా… ప్రత్యర్థులకు సవాల్ విసురుతూనే ఉన్నారు.
లెక్చరర్‌గా మొదలెట్టి.. మంత్రి దాకా ఎదిగిన కడియం
మరి, కడియం శ్రీహరేమైనా తక్కువా…? అంటే.. ఆయనదీ బలమైన బ్యాగ్రౌండే. లెక్చరర్‌గా పనిచేసిన ఆయన.. అప్పుడెప్పుడో టీడీపీ తరపున పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లలో.. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. రెండుసార్లు స్టేషన్ ఘన్‌పూర్ నుంచి విజయం సాధించిన కడియం… 2013లో గులాబీ తీర్థం పుచ్చుకుని, 2014 ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా గెలిచారు. అయితే, ఆ తర్వాత అనూహ్య పరిణామాల మధ్య… రాజయ్య నుంచి డిప్యూటీ సీఎం పదవిని అందుకోవాల్సి వచ్చింది. అలా రాజయ్య, శ్రీహరి మధ్య మొదలైన వార్.. నాన్ స్టాప్ కంటిన్యూ అవుతూనే ఉంది.
వచ్చేసారి బీఆర్‌ఎస్ తరపున.. కడియమా? తాటికొండా?
వచ్చే ఎన్నికలకు స్టేషన్ ఘన్‌పూర్‌లో ఈ ఇద్దరు నేతల్లో ఎవరు బరిలో ఉంటారన్నదే .. అధికార బీఆర్‌ఎస్‌లో జరుగుతున్న చర్చ. ఎవరికివారే.. టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తుండటంతో… పొలిటికల్‌గా ఆసక్తి ఏర్పడింది. అయితే, మళ్లీ నాకే అవకాశమని రాజయ్య ధీమా వ్యక్తం చేస్తుంటే… తాను కాకపోతే, కూతురు కావ్యనైనా బరిలో దింపాలనే ఆలోచనలో కడియం ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా, కీలకనేతల ఆధిపత్య పోరుతో.. సతమతమవుతోంది బీఆర్‌ఎస్.
టిక్కెట్ రేసులో రాజయ్య, సాంబయ్య
స్టేషన్ ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగానే ఉంది. రాజయ్య ఎగ్జిట్ అయ్యింది మొదలు.. హస్తానికి బలమైన నేత దొరకడం లేదు. గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిన సింగపురం ఇందిర మరోసారి బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ, టిక్కెట్ కోసం చాలామంది ఆశావహులు ఎదురుచూస్తుండటమే.. హస్తం పార్టీకి ఇబ్బందిగా మారేలా ఉంది. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, దొమ్మటి సాంబయ్య వంటి నేతలు రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందిరపై స్థానికురాలనే సాఫ్ట్ మార్క్ ఉన్నా… ఎన్నికలప్పుడు తప్ప మరెప్పుడు కనబడరన్న అపవాదు కూడా ఉంది.
రేసులో వెంకటేశ్వర్లు, సుభాష్, వెంకటేశ్
కాషాయ పార్టీ సైతం… ఇక్కణ్నుంచి బరిలో నిలిచేందుకు సై అంటున్నా, అభ్యర్థి విషయంలోనే క్లారిటీ మిస్సవుతోంది. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌కు.. ఆ తర్వాత బీజేపీకిలోకి వచ్చిన మాజీమంత్రి Dr విజయరామారావ్… పువ్వుగుర్తుపై పోటీచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, మాదాసి వెంకటేశ్వర్లు, పెరుమాండ్ల వెంకటేశ్, బొజ్జపల్లి సుభాష్ వంటి లోకల్ లీడర్లు సైతం టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తుండటంతో అంతర్గతంగా వార్ మొదలైనట్టు కనిపిస్తోంది.
బీఎస్పీ నుంచి బరిలో ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్!
మాజీ ఐపీఎస్, బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ కూడా ఇక్కణ్నుంచి బరిలో నిలిచేందుకు కసరత్తు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. స్థానికంగా గ్రౌండ్ లెవల్‌లో తన కార్యక్రమాల్లో స్పీడు పెంచినట్టు తెలుస్తోంది. ఇక, 2లక్షల 35వేల మంది ఓటర్లున్న స్టేషన్‌ఘన్‌పూర్.. 1978లో ఎస్సీ రిజర్వుడయ్యింది. ఇక్కడ అభ్యర్థుల తలరాతలు మార్చేది SC ఓటర్లే. ఆ తర్వాత ఎక్కువ ప్రభావం చూపేంది బీసీలు, రెడ్లు.
అభివృద్ధి విషయంలోనూ కడియంvs రాజయ్య
అభివృద్ధి విషయంలోనూ.. కడియం, తాటికొండల మధ్య… నువ్వెంతంటే, నువ్వెంతన్నట్టుగా మాటల తూటాలు పేలుతున్నాయ్. నియోజకవర్గాన్ని నేనంటే నేను అభివృద్ధి చేశానంటూ సవాళ్లు విసురుకుంటున్నారు.
ప్రాంతం కాదు, నేతలే అభివృద్ధి చెందారా?
డెవలప్మెంట్‌పై జనంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. రాజకీయ నేతల కుటుంబాలు అభివృద్ధి చెందాయి తప్ప… తమకెలాంటి ప్రయోజనమూ చేకూరలేదంటోంది స్టేషన్ ఘన్‌పూర్ యువత.
ఒకప్పుడు కరువుప్రాంతం… ఇప్పుడు సమస్యశ్యామలం
అయితే, ఒకప్పుడు కరువు ప్రాంతంగా పేరుబడ్డ స్టేషన్ ఘన్‌పూర్‌లో… కొత్తగా అందుబాటులోకి వచ్చిన రిజర్వాయర్లతో భూములన్నీ సస్యశ్యామలమయ్యాయి. పల్లెలన్నీ కాస్త పచ్చదనం అద్దుకున్నాయి. అయితే, పరిశ్రమల్ని తీసుకురావడంలో నేతలు ఫెయిలయ్యారన్న అసంతృప్తి జనంలో కనిపిస్తోంది.
కడియం, తాటికొండ జగడం.. ప్రతిపక్షాలకు ప్లస్సవుతుందా?
దశాబ్దాలుగా వేర్వేరు పార్టీలో ఉంటూ కత్తులు దూసుకున్న కడియం, తాటికొండ.. ఇప్పుడు ఒకే జెండా పట్టుకుని జగడాలాడుతున్నారు. ఈ వైరం వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ప్లస్సయ్యి, బీఆర్‌ఎస్ విజయానికి బ్రేకులేస్తుందా? అనే ప్రచారం జరుగుతోంది. ఫైనల్‌గా స్టేషన్ ఘన్‌పూర్ ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపుతారన్నదే ఇప్పుడు ఆసక్తికరాంశం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం