AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రాణ స్నేహితుడినే పొట్టనబెట్టుకున్న కానిస్టేబుల్.. ఎందుకో తెలిసి పోలీసులే షాక్..!

రక్షక భట నిలయంలో ఉండి సమాజాన్ని కాపాడాల్సిన ఒక కానిస్టేబుల్, వ్యసనాలకు బానిసై కరడుగట్టిన నేరస్తుడిగా మారాడు. సిద్దిపేట జిల్లాలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రకంపనలు సృష్టించింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌ల మత్తులో పడి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన కానిస్టేబుల్, తనకి ఆర్థికంగా ఆసరాగా నిలిచిన స్నేహితుడినే అత్యంత కిరాతకంగా అంతమొందించాడు.

ప్రాణ స్నేహితుడినే పొట్టనబెట్టుకున్న కానిస్టేబుల్.. ఎందుకో తెలిసి పోలీసులే షాక్..!
Police Constable Murders Friend
P Shivteja
| Edited By: |

Updated on: May 07, 2026 | 9:12 PM

Share

రక్షక భట నిలయంలో ఉండి సమాజాన్ని కాపాడాల్సిన ఒక కానిస్టేబుల్, వ్యసనాలకు బానిసై కరడుగట్టిన నేరస్తుడిగా మారాడు. సిద్దిపేట జిల్లాలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రకంపనలు సృష్టించింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌ల మత్తులో పడి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన కానిస్టేబుల్, తనకి ఆర్థికంగా ఆసరాగా నిలిచిన స్నేహితుడినే అత్యంత కిరాతకంగా అంతమొందించాడు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ప్రవీణ్ అనే పోలీస్ కానిస్టేబుల్, ఆన్‌లైన్ జూదానికి అలవాటుపడి దాదాపు 36 లక్షల రూపాయలకు పైగా పోగొట్టుకున్నాడు. ఈ క్రమంలో విశ్వనాథం వద్ద వ్యక్తి దగ్గర సుమారు 40 లక్షల రూపాయల వరకు అప్పు చేశాడు. అప్పు తీర్చమని విశ్వనాథం ఒత్తిడి చేయడంతో, ఎలాగైనా అతడిని అడ్డు తొలగించుకోవాలని ప్రవీణ్ ప్లాన్ చేశాడు. ఈ ఘాతుకంలో తన భార్య రజితను కూడా భాగస్వామిని చేయడం గమనార్హం.

మే నెల 2వ తేదీన డబ్బుల విషయంలో మాట్లాడుకుందామని నమ్మబలికి విశ్వనాథాన్ని కారులో ఎక్కించుకున్నారు. నిర్మానుష్య ప్రాంతమైన పెద్దకోడూరు శివారుకు తీసుకెళ్లి, భార్యాభర్తలిద్దరూ కలిసి విశ్వనాథాన్ని హతమార్చారు. అంతేకాకుండా మృతుడి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకున్నారు. మృతదేహం గుర్తుపట్టకుండా ఉండేందుకు రంగనాయకసాగర్ రిజర్వాయర్ గేట్ల వద్ద పడేశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు భార్యాభర్తలు అక్కడి నుండి హైదరాబాద్‌కు పరారయ్యారు.

అయితే కనపించకుండాపోయిన విశ్వనాథం ఆచూకీ కోసం అతని భార్య పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను పట్టుకున్నారు. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. గత నెలలో కూడా ఒక మహిళ మెడలోంచి మూడున్నర తులాల బంగారాన్ని ఈ దంపతులే అపహరించినట్లు తేలింది.

ఒక ప్రభుత్వ ఉద్యోగి, అందునా బాధ్యతాయుతమైన పోలీస్ శాఖలో ఉండి ఇలాంటి దారుణానికి ఒడిగట్టడం సమాజాన్ని విస్మయానికి గురిచేసింది. ఆన్‌లైన్ జూదం లాంటి వ్యసనాలు మనిషిలోని విచక్షణను చంపి, రక్షకుడిని సైతం భక్షకుడిగా మారుస్తాయని ఈ ఘటన నిరూపించింది. ప్రస్తుతం నిందితులు ప్రవీణ్, రజిత జైలు ఊచలు లెక్కపెడుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us