Suryapet: బెల్ట్ షాపు వద్ద ‘ఖాకీ’ల గోల.. మందేసి.. మైకంలో మైమరిచి
చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే ఆ చట్టాన్ని చట్టుబండలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని పోలీసులు శిక్షించాల్సి ఉండగా అవే నిబంధనలకు కొంతమంది పోలీసులు తూట్లు పొడుస్తున్నారు.. ఆ వివరాల్లోకి వెళ్తే...

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని నర్సయ్య గూడెంలోని బెల్ట్ షాపులో మద్యం సేవించడానికి ఇద్దరు కానిస్టేబుళ్ళు వచ్చారు. చేసేది తప్పుడు పని.. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బెల్ట్ షాప్‌ను కట్టడి చేయాల్సింది పోయి అక్కడే మద్యం సేవించి ఎంజాయ్ చేశారు. గుట్టు చప్పుడు కాకుండా వచ్చామా తాగామా వెళ్ళామా అని కాకుండా ఇంకో బాటిల్ మద్యం కావాలంటూ వీరంగం సృష్టించారు. తాగిన మద్యం ఉరికే ఉండనిస్తుందా..కల్లు తాగిన కోతిలా రోడ్డెక్కి హంగామా చేశారు.
తన వద్ద మద్యం లేదని బెల్ట్ షాప్ నిర్వాహకుడు చెప్పినా వినకుండా విచక్షణ మరచి బూతులు తిడుతూ అతనిపై దాడికి దిగారు. రోడ్డు మీదకు తీసుకొచ్చి నిర్వహకుడిని చితక బాదారు. ఘటనను చిత్రీకరిస్తున్న స్థానికులపై దాడికి యత్నించారు. మద్యం మత్తులో జోగుతూ చేసిన ఘర్షణలో ఇద్దరికి గాయాలు కావడంతో కానిస్టేబుళ్ళ దౌర్జన్యానికి స్థానికులు హడలి పోయారు. పోలీస్ ఉద్యోగులుగా హుందాగా ప్రవర్తించాల్సిన వీరు దిగజారి రోడ్డున పడి చిల్లరగాళ్లలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి జిల్లా పోలీస్ బాస్ వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..