Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఈ నెల 25, 26, 27 తేదీల్లో తెలంగాణలో మోదీ ఎన్నికల ప్రచారం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీసీ ఆత్మగౌరవ సభ నిర్వహించి ఆ వర్గానికి దగ్గరైన బీజేపీ - తాజాగా తెలంగాణలో మరో కీలక సామాజికవర్గం ఎస్సీలకు చేరవయ్యే ప్రయత్నం చేపట్టింది. మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి - MRPS నిర్వహిస్తున్న మాదిగ విశ్వరూప మహాసభలో ప్రధాని పాల్గొననున్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఈ సాయంత్రం జరిగే భారీ బహిరంగ సభకు MRPS విస్తృత ఏర్పాట్లు చేసింది. అంతేకాదు ఈ నెల చివర్లో సైతం ప్రధాని తెలంగాణకు రానున్నారు.

Telangana: ఈ నెల 25, 26, 27 తేదీల్లో తెలంగాణలో మోదీ ఎన్నికల ప్రచారం
PM Modi
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 11, 2023 | 12:46 PM

తెలంగాణ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది బీజేపీ. అందుకు తగ్గట్లుగానే అగ్రనేతలు క్యాంపైయిన్ చేస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో ప్రధాని పర్యటన ఉంది. అంతేకాదు నవంబర్ 25, 26, 27 తేదీల్లో కూడా మోదీ తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.  25న కరీంనగర్, 26న నిర్మల్ జన గర్జన సభల్లో ప్రధాని పాల్గొంటారు. 27న హైదరాబాద్ లో మోడీ భారీ రోడ్ షో ఉంటుంది. ఈ లోపు మరికొందరు కేంద్ర మంత్రులు, పలు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు.

నేడు మాదిగల విశ్వరూప సభలో పాల్గొననున్న ప్రధాని

ఎస్సీలకు గంపగుత్తగా కాకుండా అందులోని కులాలను బట్టి రిజర్వేషన్లు కల్పించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏళ్లుగా డిమాండ్‌ చేస్తోంది. దళిత కులాల గణన ప్రత్యేకంగా చేపట్టాలని కోరుతోంది. ఎస్సీల్లో ప్రభావవంతంగా మాల వర్గానికే అధిక రిజర్వేషన్లు అందుతున్నాయని, జనాభాపరంగా అధికంగా ఉన్నప్పటికీ మాదిగలకు ఆ ఫలాలు అందని మావిగా మారిపోయాయని MRPS అంటోంది. మాదిగ విశ్వరూప సభలో ప్రధాని మోదీ ఈ అంశం గురించి మాట్లాడతారని ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణపై హామీ ఇస్తారని MRPS భావిస్తోంది. ఎస్సీ వర్గీకరణ జరపాలని దాదాపు 30 ఏళ్లుగా MRPS డిమాండ్‌ చేస్తోంది. ఈ డిమాండ్‌కు బీజేపీ కూడా సానుకూలంగా స్పందించింది. పార్లమెంట్‌లో చట్టం చేయాలి కాబట్టి వర్గీకరణకు బీజేపీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.

తెలంగాణలోని ఎస్సీ జనాభాలో 60 శాతం మంది మాదిగలు ఉంటారని అంచనా. 2014లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణలో మాదిగ జనాభా 46 లక్షలని, మాలల జనాభా 21 లక్షలని MRPS వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణలో 20-25 నియోజకవర్గాల్లో ఫలితాలను తారుమారు చేసే స్థాయిలో మాదిగలు ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో MRPS కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించడమే కాదు ఆ పార్టీ తరపున ప్రచారం కూడా నిర్వహించింది. ఈ ఎన్నికల్లో MRPS తమ మద్దతు ఎవరికన్నది ఇంత వరకు ఎక్కడా బహిరంగంగా ప్రకటించలేదు. ఈ క్రమంలో ఆ సంఘం నిర్వహిస్తున్న సభకు ప్రధానిని ఆహ్వానించడం చూస్తుంటే కమలం వైపు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది. MRPS అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ గత నెల ఢిల్లీలో హోం మంత్రి అమిత్‌ షాను కలిసి వర్గీకరణపై విజ్ఞాపన పత్రం అందజేశారు. దీనికి షా సానుకూలంగా స్పందించారనే మంద కృష్ణ వెల్లడించారు. ఈ క్రమంలో పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరుగుతున్న సభలో ప్రధాని మోదీ వర్గీకరణపై స్పష్టమైన ప్రకటన చేస్తారని MRPS గట్టి నమ్మకంతో ఉంది.

ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ అధికార పార్టీ BRS సానుకూలంగానే ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ వర్గీకరణ చేపట్టాలని డిమాండ్‌ చేసింది. 2014లో నిర్వహించిన తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని కోరుతూ తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. అలాగే ఎస్సీ రిజర్వేషన్‌ను 15 శాతానికి పెంచాలని ప్రతిపాదించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…