AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓయూ ఆర్ట్స్‌ కాలేజ్ భవనానికి ఇండియన్‌ ట్రేడ్‌ మార్క్‌ సర్టిఫికెట్‌! ఆ రెండు భవనాల తర్వాత..

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల భవనం భారతదేశంలోని ప్రముఖ ట్రేడ్‌మార్క్ భవనాల జాబితాలో చేరింది. ఈ ఘనతను సాధించిన మూడవ కట్టడంగా నిలిచింది. ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ ద్వారా భవనం యొక్క ఆర్కిటెక్చర్ మరియు బ్రాండ్ ఇమేజ్ రక్షించబడతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓయూ పూర్వ విద్యార్థులు ఈ ఘట్టాన్ని ఆనందిస్తున్నారు.

ఓయూ ఆర్ట్స్‌ కాలేజ్ భవనానికి ఇండియన్‌ ట్రేడ్‌ మార్క్‌ సర్టిఫికెట్‌! ఆ రెండు భవనాల తర్వాత..
Ou Arts College
Vasu Bathula
| Edited By: |

Updated on: Apr 30, 2025 | 5:48 PM

Share

ఉస్మానియా విశ్వవిద్యాలయం భారత ప్రభుత్వ ట్రేడ్ మార్క్ సర్టిఫికెట్ సాధించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాల భవనం మరో అరుదైన ఘనత సాధించింది. దేశంలోని ప్రసిద్ధ ట్రేడ్ మార్గ్ భవనాల జాబితాలో చోటు దక్కించుకుంది. యూనివర్సిటీ మరో మైలురాయిని అధిగమించింది. ముంబై తాజ్ హోటల్, స్టాక్ ఎక్చేంజ్ తరువాత ట్రేడ్ మార్క్ కలిగిన మూడో కట్టడంగా ఓయూ ఆర్ట్స్ కళాశాల భవనం నిలిచింది. ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ధృవపత్రాన్ని ఓయూ పూర్వ విద్యార్థి సుభజిత్ సాహా ఓయూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరంకు అందించారు. ఓయూ రిజిస్ట్రార్ ఆచార్య నరేష్ రెడ్డి, ఓఎస్డీ ఆచార్య జితెందర్ నాయక్, ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్, డైరెక్టర్ల సమక్షంలో ప్రొఫెసర్ కుమార్ ఆర్ట్స్ కళాశాల ట్రేడ్ మార్క్ ధృవ పత్రాన్ని స్వీకరించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ముఖచిత్రంగా ఉన్న ఆర్ట్స్ కళాశాల భవనానికి ఇప్పటికే ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ట్రేడ్ మార్క్ గుర్తింపు ద్వారా ఆర్కిటెక్చర్ హక్కుల సంరక్షణ సహా బ్రాండ్ ఇమేజ్ కు ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓయూ పూర్వ విద్యార్థులు ట్రేడ్ మార్క్ సర్టిఫికెట్ రావడం పట్లఆనందం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీలో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. ఓయూ పూర్వ విద్యార్థి, రిసల్యూట్ 4ఐపీ అండ్‌ టీఎం లీగల్ హెడ్ సుభజిత్ సాహా ఆర్ట్స్ కళాశాల భవన విశిష్టతను, హైదరాబాద్ వారసత్వం, బ్రాండింగ్ ను దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ 22న ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తు చేశారు. ఓయూ లా కాలేజ్ సీనియర్ ప్రొఫెసర్, ఎంహెచ్ఆర్డీ ఐపీఆర్ ఛైర్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి ట్రేడ్ మార్క్ సాధనకు అవసరమైన డాక్యుమెంటేషన్ సహకారాన్ని అందించారు.

ఓయూ ఆర్ట్స్ కళాశాలకు ట్రేడ్ మార్క్ గౌరవం దక్కటం. ఓయూ బ్రాండ్ ను మరింత పెంచనుంది. ఆర్ట్స్ కళాశాల ఆర్కిటెక్చర్, నిర్మాణ హక్కులు ఓయూకు దక్కడం ద్వారా ఓయూ అనుమతి లేకుండా ఆర్ట్స్ కళాశాల భవనాన్ని ఎలాంటి వాణిజ్య, ప్రకటనలు, ఇతర వాణిజ్య అవసరాలకు వాడేందుకు అవకాశం ఉండదు. అజంతా, ఎల్లోరా గుహల నిర్మాణ ప్రోత్సాహంతో ఈ నిర్మాణాన్ని కుతుబ్ షాహి, మొఘల్ శైలుల సమ్మేళనంతో నిర్మించారు. కాకతీయ టెంపుల్స్ స్పర్శలతో బెల్జియన్ వాస్తు శిల్పి ఎర్నెస్ట్ జాస్పర్ ఆర్ట్స్ కళాశాల భవన నిర్మాణానికి రూపకల్పన చేశారు. నిజాం భవనాలకు భిన్నంగా ఒకే పెద్ద గోపురానికి బదులుగా కవచం, పై కప్పు, కోణాల తోరణాలతో బల్బస్ గోపురాలతో భిన్నమైన డిజైన్ చేశారు. వాస్తు శిల్పి, లౌకిక భావన, ప్రపంచ ప్రఖ్యాత అభ్యాస విద్యాసంస్థగా అందరినీ ఆకర్షించే ఉద్దేశం కూడా ఇందులో ఇమిడి ఉంటుంది. ఎంఫైర్ ఎస్టేట్ భవనం, క్రిస్లర్ భనవం, యూఎస్ లోని న్యూయార్క్ స్టాక్ ఎక్చేంజ్, ఫ్రాన్స్ లోని ఈఫిల్ టవర్, ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఒపెరా హౌస్, ప్రపంచంలోని ప్రసిద్ధ ట్రేడ్ మార్క్ భవనాలు ఆర్ట్స్ కళాశాల ప్రస్తుత గుర్తింపుతో ప్రసిద్ధ కట్టడాల సరసన చేరింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి